పాకిస్తాన్ రఫేల్ జెట్‌ను కూల్చేసిందా?: భారత సైన్యం ఏం చెప్పిందంటే..

భారత్‌కు చెందిన రెండు రఫేల్ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైన్యం ఇటీవల ప్రకటన చేసింది. దీని గురించి ఆదివారం సాయంత్రం భారత సైన్యం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మీడియా ప్రశ్నించింది.

సారాంశం

  • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు.
  • జమ్మూకశ్మీర్‌ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదివారం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖా మంత్రి లోకేష్ ఓదార్చారు.
  • భారత్ - పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇరుదేశాల నుంచి శనివారం అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.
  • అమృత్‌సర్‌లో విద్యుత్ పునరుద్ధరించారు. రెడ్‌ అలర్ట్ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు
  • యుక్రెయిన్‌తో ''ప్రత్యక్ష చర్చలకు'' రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు.

లైవ్ కవరేజీ

శ్రీనివాస్ నిమ్మగడ్డ, బీబీసీ ప్రతినిధి

  1. 'రఫేల్‌ను కూల్చేశాం' అని పాకిస్తాన్ చేసిన ప్రకటనపై భారత సైన్యం ఏం చెప్పింది?

    ఎయిర్ మార్షల్ ఏకే భారతి

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి

    భారత్‌కు చెందిన రెండు రఫేల్ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైన్యం ఇటీవల ప్రకటన చేసింది. దీని గురించి ఆదివారం సాయంత్రం భారత సైన్యం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మీడియా ప్రశ్నించింది.

    ఈ ప్రశ్నకు ఎయిర్ మార్షల్ ఏకే భారతి సమాధానమిస్తూ, "మనం పోరాటంలో ఉన్నాం, అందులో నష్టాలు కూడా ఉంటాయి. మీరు మమ్మల్ని అడగాల్సింది, లేదంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో లక్ష్యాలను సాధించామా? అని. దానికి సమాధానం అవును" అని అన్నారు.

    "మనం ఇంకా పోరాటంలోనే ఉన్నాం. మేం ఏదైనా మాట్లాడితే, అది ప్రత్యర్థికి ప్రయోజనం చేకూరుస్తుంది. మేం ఎంచుకున్న లక్ష్యాలను సాధించామని, మా పైలట్లందరూ ఇంటికి తిరిగి వచ్చారని మాత్రం చెప్పగలను" అన్నారు ఏకే భారతి.

  2. ‘ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు’: భారత సైన్యం

    లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్

    ‘’ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు’’ అని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్ తెలిపారు.

    భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు కుదిరిన ఒప్పందం తర్వాత, భారత సైన్యం ఆదివారం సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించింది.

    ఈ సమావేశంలో, ఆర్మీ నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వైమానిక దళం నుంచి ఎయిర్ మార్షల్ ఏకే భారతి, నేవీ నుంచి వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శార్దా పాల్గొని ఆపరేషన్ సిందూర్ వివరాలు తెలిపారు.

    "సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన లక్ష్యంతో దాడి చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. వీరిలో యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి ఉగ్రవాదులున్నారు" అని రాజీవ్ ఘయ్ చెప్పారు.

    "ఐసీ 814 హైజాక్, పుల్వామా పేలుళ్లలో ఈ ముగ్గురి హస్తముందని" రాజీవ్ ఘయ్ అన్నారు.

    "భారత్ దాడుల అనంతరం, నియంత్రణ రేఖను కూడా పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఇది శత్రువు భయాందోళనతో కూడిన ప్రతిచర్య. పెద్ద సంఖ్యలో పౌరులు, గ్రామాలు, గురుద్వారాల వంటి మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో చాలామంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు" అని ఆయన అన్నారు.

  3. ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ లేఖ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని అందులో కోరారు.

    భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం సాయంత్రం కుదిరిన ఒప్పందం తర్వాత, ఆదివారం ప్రధాని మోదీకి రాహుల్ లేఖ రాశారు.

    ''పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటన చేయడం వంటి అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.

    రాహుల్ గాంధీ లేఖ

    ఫొటో సోర్స్, @INCIndia/X

    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ లేఖ
  4. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్న భారత్ ప్రకటనపై స్పందించిన పాకిస్తాన్.. ఏమందంటే..

    పాకిస్తాన్, ఇషాక్ దార్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్

    కాల్పుల విరమణకు ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోందంటూ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి చేసిన ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది.

    కాల్పుల విరమణకు పాకిస్తాన్ కట్టుబడి ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

    ''పాకిస్తాన్ - భారత్ మధ్య కాల్పుల విరమణ అమలుకు పాకిస్తాన్ కట్టుబడి ఉంది. కొన్నిచోట్ల భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పటికీ మా దళాలు సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. కాల్పుల విరమణ అమలులో ఏవైనా సమస్యలు ఎదురైతే, ఆయా స్థాయిల్లో చర్చల ద్వారా పరిష్కారమవుతాయని భావిస్తున్నాం. క్షేత్రస్థాయిలో భద్రతా దళాలు కూడా సంయమనం వహించాలి'' అని విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటన పేరుతో చేసిన ఆ పోస్టులో రాశారు.

  5. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్: ‘మా పని మేం చేశాం, ఇంకా చేస్తాం’

    ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

    ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని భారత వాయుసేన ప్రకటించింది.

    ఆదివారంనాడు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసిన వాయుసేన

    ‘‘ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం తనకు నిర్దేశించిన పనులను అత్యంత కచ్చితత్వంతో, నైపుణ్యంతో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యకలాపాలు జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించాం. ఈ కార్యకలపాలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఊహాగానాలు, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని భారత వైమానిక దళం ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తోంది’’ అని అందులో పేర్కొంది.

  6. మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటాం: పవన్ కల్యాణ్

    పవన్ కల్యాణ్

    ఫొటో సోర్స్, @JanaSenaParty

    ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్

    జమ్మూకశ్మీర్‌ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు తీసుకువచ్చారు.

    ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖామంత్రి లోకేశ్‌, మరికొందరు మంత్రులు నేతలు మురళీనాయక్ కుటుంబాన్ని ఆదివారం ఓదార్చారు.

    రైల్వే ఉద్యోగం కాదనుకుని దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో మురళీనాయక్ సైన్యంలో చేరినట్టు ఆయన తల్లిదండ్రులు చెబుతున్నారని పవన్ తెలిపారు.

    ఈ సందర్భంగా మురళీనాయక్ కుటుంబానికి ‘‘50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాం. 5 ఎకరాల పొలం. 300 గజాలు ఇంటి స్థలం ఇస్తున్నాం. ఇంటిలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం. నేను వ్యక్తిగతంగా పాతిక లక్షలు సాయం చేస్తానని తెలియజేస్తున్నా.ఈ పరిస్థితుల్లో భారత దేశ ప్రభుత్వానికి ఆర్మీకి మనం అండగా ఉండాలి. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి" అని పవన్ కల్యాణ్ చెప్పారు.

  7. భారత్, పాకిస్తాన్‌లపై ట్రంప్ ప్రశంసలు

    ట్రంప్ ప్రశంసలు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, భారత్, పాకిస్తాన్‌లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు

    భారత్, పాకిస్తాన్ ‘‘చరిత్రాత్మక, వీరోచిత నిర్ణయం’’ తీసుకున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు.

    ఈ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంపై ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు.

    ‘‘ఎంతోమంది మరణానికి, విధ్వంసానికి దారితీసే ప్రస్తుత ఉద్రిక్తతలను ఆపడానికి సమయం ఆసన్నమైందనే విషయాన్ని అర్ధం చేసుకున్న భారత్, పాకిస్తాన్ బలమైన నాయకత్వాలను చూసి గర్విస్తున్నాను. ఈ చరిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా సాయపడినందుకు నేను గర్విస్తున్నాను. ఎటువంటి చర్చలు చేయనప్పటికీ ఈ రెండుదేశాలతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాం. అంతేకాకుండా, 'వెయ్యేళ్ల తర్వాత' కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం ఏమైనా లభిస్తుందేమో చూడటానికి మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను.’’ అని తన ట్రూత్ సోషల్ ఖాతాలో రాశారు.

  8. ‘ప్రత్యక్షంగా చర్చించుకుందాం’ - యుక్రెయిన్‌కు పుతిన్ పిలుపు

    ప్రత్యక్షంగా చర్చిచుకుందాం రండి అని యుక్రెయిన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు

    యుక్రెయిన్‌తో ‘‘ప్రత్యక్ష చర్చలకు’’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ చర్చలు ‘‘ఎటువంటి ఆలస్యం లేకుండా మే 15 నుంచి ప్రారంభం కావాలి’’ అని ఆయన చెప్పారు.

    ‘‘ఘర్షణకు మూల కారణాలను పరిష్కరించడానికి, శాశ్వతమైన, బలమైన శాంతివైపుగా అడుగులు వేయడానికి మేం చర్చలు కోరుకుంటున్నాం’’ అని పుతిన్ చెప్పారు. శనివారం అర్ధరాత్రి టెలివిజన్‌లో చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్ చాలా అరుదుగా టెలివిజన్‌లో ప్రసంగిస్తుంటారు.

    యూకే ప్రధాని సర్ కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ సహా యూరోపియన్ నాయకులు యుక్రెయిన్‌ను సందర్శించి 30 రోజుల కాల్పుల విరమణకు రష్యా బేషరతుగా అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.

    అయితే దీనిపై ఆలోచించాల్సి ఉందని చెప్పిన రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్, తమపై ఒత్తిడి చేయడం వల్ల ఉపయోగం ఉండదని హెచ్చరించారు.

  9. అమృత్‌సర్‌లో విద్యుత్ పునరుద్ధరణ, కొనసాగుతున్న రెడ్ అలర్ట్

    అమృత్‌సర్‌లో విద్యుత్ పునరుద్ధరణ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అమృత్‌సర్‌లో విద్యుత్ పునరుద్ధరణ

    ‘‘అమృత్‌సర్‌లో నిన్న రాత్రి భారీ సైరన్లు వినిపించాయి’’ అని డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ ఆదివారం ఉదయం చెప్పారు.

    నగరంలో ప్రస్తుతానికి విద్యుత్‌ను పునరుద్ధరించారని, కానీ రెడ్ అలర్ట్ కొనసాగుతోందని బీబీసీ ప్రతినిధి రవీందర్‌ సింగ్ రాబిన్ తెలిపారు.

    ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, బయటకు రావద్దని ద్వారాలు, కిటికీలకు దూరంగా ఉండాలని డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

    ‘‘పరిస్థితి పూర్తి సురక్షితంగా మారినప్పుడు అధికారయంత్రాంగం ప్రజలకు ఈ విషయం తెలియజేస్తుంది. ఎవరూ ఆందోళనకు గురికావద్దు. పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అధికార యంత్రాంగానికి సహకరించండి’’ అని కమిషనర్ కోరారు.

    భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం సాయంత్రం (మే 10వతేదీ) కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.