'ఇదేం కాల్పుల విరమణ? శ్రీనగర్‌లో పేలుళ్లు వినిపిస్తున్నాయి' : ఒమర్ అబ్దుల్లా

'''ఇదేం కాల్పుల విరమణ? శ్రీనగర్‌లో పేలుళ్లు వినిపిస్తున్నాయి''' అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సారాంశం

  • భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటన వచ్చినప్పటికీ, శనివారం రాత్రి జమ్మూకశ్మీర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడే ఉన్న బీబీసీ ప్రతినిధులు చెప్పారు.
  • ఇదేం కాల్పుల విరమణ? శ్రీనగర్‌లో పేలుళ్లు వినిపిస్తున్నాయంటూ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
  • తక్షణ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు భారత్ - పాకిస్తాన్ అధికారిక ప్రకటనలు చేశాయి.
  • భారత్, పాకిస్తాన్‌ పూర్తి స్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఎక్స్‌లో తెలిపారు.
  • ''పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌‌కు కాల్ చేసి మాట్లాడారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది'' అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
  • పాకిస్తాన్, భారత్‌ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అన్నారు.
  • కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, శ్రీనగర్ చుట్టుపక్కల పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

లైవ్ కవరేజీ

శ్రీనివాస్ నిమ్మగడ్డ, బీబీసీ ప్రతినిధి

  1. పాకిస్తాన్ చారిత్రక విజయం: షాబాజ్ షరీఫ్

    పాకిస్తాన్, షాబాజ్ షరీఫ్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ చారిత్రక విజయం సాధించినట్లు ఆ దేశ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు.

    సీనియర్ సైన్యాధికారులకు, ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.

  2. 'ఇదేం కాల్పుల విరమణ? శ్రీనగర్‌లో పేలుళ్లు వినిపిస్తున్నాయి' : ఒమర్ అబ్దుల్లా

    ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్

    ఫొటో సోర్స్, Omar Abdullah/facebook

    భారత్ - పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటన వచ్చినప్పటికీ, జమ్మూకశ్మీర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

    ''ఇదేం కాల్పుల విరమణ? శ్రీనగర్ చుట్టుపక్కల పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి'' అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    ''ఇది కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్‌ మధ్యలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి'' అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. అందులో, ఆకాశంలో కొన్ని శకలాల వెలుగులు కనిపిస్తున్నాయి.

    జమ్మూకశ్మీర్, ఒమర్ అబ్దుల్లా

    ఫొటో సోర్స్, @OmarAbdullah/X

  3. కాల్పుల విరమణ పాటిస్తూనే, అప్రమత్తంగా ఉంటాం: భారత రక్షణ శాఖ

    భారత్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొద్దిసేపటికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది.

    భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొద్దిసేపటికి, రక్షణ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది.

    "సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని అనుసరిస్తుంది. అలాగే, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది" అని భారత ఆర్మీ అధికారి కమోడోర్ ఆర్.రఘు నాయర్ అన్నారు.

    వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, మసీదులను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుందనే పాక్ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

  4. కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది: భారత్, పాక్ ప్రకటన

    భారత్, పాకిస్తాన్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్ - పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇరుదేశాల నుంచి శనివారం అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.

    భారత్, పాకిస్తాన్‌ పూర్తి స్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఎక్స్‌లో ప్రకటించారు.

    ‘’అమెరికా మధ్యవర్తిత్వంలో, రాత్రంతా సుదీర్ఝ చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ పూర్తిస్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా’’ అని ఆయన తెలిపారు.

    ''పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌‌కు కాల్ చేసి మాట్లాడారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది’’ అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.

    పాకిస్తాన్, భారత్‌ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అన్నారు.

  5. జనావాసాలను లక్ష్యంగా చేసుకున్నారన్న భారత్ ఆరోపణలపై స్పందించిన పాక్ మంత్రి

    పాకిస్తాన్ మంత్రి అతావుల్లా తరార్

    ఫొటో సోర్స్, bbc

    ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్

    దాడులకు ప్రతిస్పందించడానికి పాకిస్తాన్‌కు హక్కు ఉందని ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ బీబీసీతో అన్నారు.

    "పాకిస్తాన్ రెచ్చగొట్టేది కాదు, దాడులకు ప్రతిస్పందించే హక్కు సైన్యానికి ఉంది" అని ఆయన అన్నారు.

    పాకిస్తాన్ డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణులతో సైనిక స్థావరాలు, జనావాసాలు లక్ష్యంగా దాడులు చేస్తోందని భారత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆరోపించారు.

    అయితే, జనావాసాలను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలను తరార్ తోసిపుచ్చారు.

    "సైనిక స్థావరాలను మాత్రమే పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది" అని ఆయన అన్నారు.

    బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య రిపోర్టు ప్రకారం, జమ్మూ నగరంలోని రెహరీ కాలనీపై పాకిస్తాన్ దాడి చేసింది. ఈ దాడిలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని, అనేక వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయని స్థానికులు బీబీసీకి తెలిపారు.

  6. ‘‘ ఇంటి పై కప్పుకు రంధ్రం పడింది..ఇల్లంతా పొగకమ్మేసింది’’

    పాకిస్తాన్ దాడిలో దెబ్బతిన్న ఇల్లు

    ఫొటో సోర్స్, Midhat

    ఫొటో క్యాప్షన్, జమ్మూలోని జనిపుర్ కాలనీలో దెబ్బతిన్న ఇల్లు

    జమ్మూ నగరంపై పాకిస్తాన్ చేసిన దాడిలో అనేక ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు.

    ఇలా దెబ్బతిన్న ప్రాంతాలలో జమ్మూలోని జనిపుర్ కాలనీలోని ఓ ఇంటికి బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య వెళ్లారు. ఆ ఇంట్లోనివారితో మాట్లాడారు.

    ‘‘ఉదయం 6గంటలకు దాడి జరిగింది. ఆ సమయంలో నిద్రపోతున్నాం’’ అని ఆ ఇంట్లో ఉండే తల్లీ కూతుళ్లు చెప్పారు.

    ‘‘ఇంటి పైకప్పు ధ్వంసమై పెద్ద రంధ్రం ఏర్పడింది. గదులు దెబ్బతిన్నాయి’’ అని వారు తెలిపారు.

    ‘‘అంతటా పొగ అలుముకుంది. మేం ఏమీ చూడలేకపోయాం. మా అమ్మ కాళ్లకు చెప్పులు లేవు. దాడి కారణంగా ఇల్లంతా వేడెక్కిపోయింది. దీంతో నేలంతా కాలుతోంది. ఆ వేడికి మా అమ్మ కాళ్లు కాలుతున్నాయి. తలుపులు తెరవడానికి చాలా సమయం పట్టింది. ఎలాగో మేం తప్పించుకున్నాం’’ అని తానియా తల్వార్ చెప్పారు.

  7. హైస్పీడ్ మిసైల్స్‌తో పాకిస్తాన్ దాడులు: భారత్

    సోఫియా ఖురేషీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, పంజాబ్‌లోని సైనిక స్థావరంపైకి పాకిస్తాన్ హైస్పీడ్ మిసైల్‌తో దాడిచేసినట్టు భారత్ తెలిపింది

    పశ్చిమ సరిహద్దు అంతటా పాక్ సైన్యం దుందుడుకు చర్యలను కొనసాగిస్తోందని కల్నల్ సోఫియా ఖురేషీ వివరించారు.

    సరిహద్దుల వద్ద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ శనివారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించింది.

    విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడారు.

    నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ల చొరబాట్లు, భారీ ఆయుధాలతో కాల్పులు జరిగాయని కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు.

    శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 చోట్ల వైమానిక చొరబాటు ప్రయత్నాలు జరిగాయని, వాటిలో చాలా వరకు విఫలమయ్యాయని తెలిపారు.

    పంజాబ్ సైనిక స్థావరంపై తెల్లవారుజామున 1:40 గంటలకు పాకిస్తాన్ హైస్పీడ్ క్షిపణిని ప్రయోగించినట్లు ఆమె తెలిపారు. ఈ క్షిపణిని భారత్ నిర్వీర్యం చేసిందని ఖురేషీ చెప్పారు.

    పాకిస్తాన్ కార్యకలాపాలు నిరంతరం రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. అయితే భారత్ చేసిన ఈ ప్రకటనపై పాక్ ఇంకా స్పందించలేదు.

  8. మా సైనిక స్థావరాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు: స్పష్టం చేసిన భారత్

    పాకిస్తాన్ దాడుల వల్ల భారత్ లోని సైనిక మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం మీడియా సమావేశంలో చెప్పారు.

    "అదంపూర్ వద్ద భారత ఎస్-400 వ్యవస్థ, సూరత్, సిర్సాలోని వైమానిక స్థావరాలు, నగ్రోటా వద్ద బ్రహ్మోస్ స్పేస్, డేరంగ్యారీ,చండీగఢ్ ఆయుధ సామాగ్రి డిపోలోని ఆర్టిలరీ తుపాకులు, ఇతర సైనిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లినట్టు సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ నిరంతర దుష్ప్రచారం చేస్తోంది" అని సింగ్ చెప్పారు.

    పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఇండియా నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నట్టు వ్యోమికా సింగ్ చెప్పారు.

  9. భారత్‌లో ఎక్కడెక్కడ దాడులు, పేలుళ్లు జరిగాయి?

    జమ్మూలో పేలుళ్లు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, జమ్మూలో శనివారం ఉదయం పేలుళ్ల కారణంగా వెలువడుతున్న పొగ

    కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి శనివారం ఉదయం నుంచి పలు ప్రాంతాలలో పేలుళ్లు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    శ్రీనగర్, జమ్మూ నగరాలలో బీబీసీ ప్రతినిధులు పేలుళ్ల శబ్దాలు విన్నారు.

    అయితే పేలుళ్లకు గల కారణాలు తెలియలేదు.

    ఉధంపుర్, పఠాన్‌కోట్‌లోనూ పేలుళ్లు జరిగినట్టు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

    ఈ రెండు చోట్ల భారత సైనిక స్థావరాలు ఉన్నాయి.

    అంతకుముందు రావల్పిండి, చక్వాల్, షార్‌కోట్‌లోని వైమానిక స్థావరాలపై భారత్ మిసైల్స్ ప్రయోగించిందని పాకిస్తాన్ చెప్పింది.

    కానీ భారత్ దీనిపై ఇంకా ఎటువంటి స్పందనా తెలియజేయలేదు.

  10. పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేశాం: ప్రకటించిన భారత సైన్యం

    పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేశామన్న భారత్

    ఫొటో సోర్స్, ADGPI/INDIAN ARMY

    ఫొటో క్యాప్షన్, అమృత్‌సర్ కంటోన్మెంట్‌పై ఎగురుతున్న డోన్లను కూల్చివేశామని భారత సైన్యం తెలిపింది

    భారత పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లు, ఇతర అయుధాలతో దాడులు కొనసాగిస్తోందని భారత సైన్యానికి చెందిన అడిషనల్ డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలోని పౌరసంబంధాల విభాగం ఎక్స్ లో పేర్కొంది.

    శనివారం ఉదయం సుమారు 5గంటల సమయంలో అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్‌పై శత్రువుకు చెందిన పలు సాయుధ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయని ఈ పోస్టులో వెల్లడించారు.

    వాటిని భారత వైమానిక రక్షణ దళాలు ధ్వంసం చేశాయని తెలిపారు .

    భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి పౌరులను ప్రమాదంలోకి నెట్టేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నం ఆమోదయోగ్యం కాదని, భారత సైన్యం శత్రువుల కుట్రలను తిప్పికొడుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  11. ‘పాక్ షెల్లింగ్‌లో జమ్మూకశ్మీర్ అధికారి మృతి’

    జమ్మూకశ్మీర్‌లోని రజౌరీ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసిన షెల్లింగ్‌లో అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కమిషనర్ రాజ్‌కుమార్ థాప్పా చనిపోయారని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.

    ‘‘నిన్ననే ఆయన డిప్యూటీ సీఎంతో కలిసి జిల్లా వ్యాప్తంగా పర్యటించారు. నేను అధ్యక్షత వహించిన ఆన్‌లైన్ సమావేశానికి హాజరయ్యారు. కానీ రజౌరీ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్‌లో ఆయన మరణించారు.’’ అని పేర్కొన్నారు.

  12. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో పేలుళ్లు

    శ్రీనగర్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని బీబీసీ ప్రతినిధి రిపోర్ట్ చేశారు. ఉదయం 5గంటల 45 నిమిషాలకు ఈ పేలుళ్ల శబ్దాలు విన్నట్టు బీబీసీ ప్రతినిధి చెప్పారు. 20 నిమిషాల తరువాత మరికొన్ని పేలుళ్లు జరిగాయి.

    మొదటి రెండు పేలుళ్లకు తమ హోటల్ కంపించింపోయిందని బీబీసీ ప్రతినిధి తెలిపారు. నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఈ పేలుళ్లకు కారణం ఏమిటో స్పష్టత లేదని చెప్పారు.

    శ్రీనగర్ విమానాశ్రయం వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఒక ప్రత్యక్ష సాక్షి కూడా బీబీసీకి చెప్పారు.

  13. గగనతలాన్ని మూసివేసిన పాకిస్తాన్

    పాకిస్తాన్ గగనతలాన్ని శనివారం మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్టు పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది.

    తమ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆరోపించిన కొద్దిసేపటి తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

    మరోపక్క పశ్చిమ, ఉత్తర ప్రాంతాలలో 32 విమానాశ్రయాలను మే 15వ తేదీవరకు మూసివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది.

  14. మా వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది, ప్రతిదాడులు మొదలుపెట్టాం: ప్రకటించిన పాకిస్తాన్

    పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, తమ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆరోపించింది.

    తమ వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణులను ప్రయోగించినట్టు పాకిస్తాన్ ఆరోపించింది.

    మూడు వైమానిక సైనిక స్థావరాలపై భారత్ క్షిపణులను ప్రయోగించిందని పాకిస్తాన్ మిలటరీ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై భారత్ స్పందించలేదు.

    ప్రభుత్వ టెలివిజన్ చేసిన ప్రత్యక్ష ప్రసారంలో లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి మాట్లాడుతూ "మా ప్రతిస్పందన కోసం వేచిచూడండి’’ అని భారతదేశాన్ని హెచ్చరించారు.

    భారత్ ప్రయోగించిన క్షిపణులను చాలావాటిని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్టు చౌధురి చెప్పారు. తమ బలగాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని, భారత్ దాడులు పిరికిపంద చర్య అని అభివర్ణించారు.

    రావల్పిండిలోని పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయం నూర్‌ఖాన్‌పై దాడి జరిగిందని పాకిస్తాన్ చెబుతోంది. ఈ ప్రాంతం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే భారత్ దీనిపై స్పందించలేదు.

    తమపై భారత్ దాడులు చేస్తున్నందున తాము ఎదురుదాడి ప్రారంభించినట్టు పాక్ ప్రభుత్వ టీవీ, ఆర్మీ ప్రజాసంబంధాల విభాగం తెలిపాయి.

    పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ తెలిపిన మేరకు, పాకిస్తాన్ ప్రతి దాడికి "ఆపరేషన్ బన్యన్ మార్సస్" అని పేరు పెట్టింది.

  15. భారత్: ఆ ఎయిర్‌పోర్టులలో విమానాల రాకపోకలపై నిషేధం..ఎక్కడెక్కడంటే..

    విమానాశ్రయాలు మూసివేత

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఆ ఎయిర్‌పోర్టులలో విమానరాకపోకలపై నిషేధం

    భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ (డీజీసీఏ) దేశంలోని 32 విమానాశ్రయాల నుంచి పౌరవిమాన రాకపోకలను నిషేధించింది.

    భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

    ఈమేరకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), సంబంధిత అధికారులకు నోటామ్ ( నోటీస్ టు ఎయిర్ మెన్) జారీ చేసింది.

    దీని ప్రకారం మే 15వ తేదీ ఉదయ 5గంటల 29 నిమిషాల వరకు నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

    విమానరాకపోకలు నిషేధం విధించిన విమానాశ్రయాలలో ఉధంపూర్, అంబాలా, అమృత్‌సర్, అవంతిపొర, భటిండా, భుజ్, బికనేర్, ఛండీగఢ్, హల్వారా, హిండాన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేషోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి, లేహ్, లుధియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పాటియాలా, పోర్‌బందర్, రాజ్‌కోట్ , సర్సావా, సిమ్లా, శ్రీనగర్, థోయిస్ ఉన్నాయి.

    విమానయాన మంత్రిత్వశాఖ నోటీసుల ప్రకారం జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, ఛండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్‌కు మే 15 ఉదయం 5.29 గంటల వరకు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.