అమృత్‌సర్, పఠాన్‌కోట్, శ్రీనగర్‌లలో పేలుళ్లు.. జమ్మూ, పూంఛ్‌లో ఉద్రిక్తం

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్‌లోని సరిహద్దు పట్టణాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
పఠాన్‌కోట్‌లో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నామని, ఆకాశంలో వెలుగులు చూశామని బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ చెప్పారు. ప్రతిచోటా బ్లాకౌట్ ఉందన్నారు.
అమృత్‌సర్‌లో ఒకదాని తర్వాత ఒకటి అనేక పేలుళ్లు వినిపించాయని, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో డ్రోన్లు కూడా కనిపించాయని ఉన్న బీబీసీ ప్రతినిధి రవీందర్ సింగ్ రాబిన్ తెలిపారు. కాల్పుల శబ్దాలు వినిపించాయని ఆయన చెప్పారు.
"నిన్న, ఈరోజు పూంఛ్‌లో భారీ షెల్లింగ్ జరిగింది. ఇందులో ఒకరు మరణించారు, కొంతమంది గాయపడ్డారు. అయితే, సరిహద్దుకి కొంచెం దూరంలో సురాన్‌కోట్ ఉంది, ఇక్కడ షెల్లింగ్ ప్రభావం పెద్దగా లేదు" అని పూంఛ్ సమీపంలోని సురాన్‌కోట్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి రాఘవేంద్రరావు చెప్పారు.
జమ్మూలో పేలుళ్లు సంభవించాయని స్థానిక ప్రజలు చెప్పినట్లు జమ్మూలో ఉన్న బీబీసీ ప్రతినిధి దివ్య చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ, అంతర్జాతీయ సరిహద్దుతో పాటు పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాల్లో డ్రోన్లు కనిపించాయని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
''భారత సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఇలాంటి గగతనతల దాడులన్నింటినీ ట్రాక్ చేస్తూ, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలతో నిర్వీర్యం చేస్తున్నాయి’’ అని పేర్కొంది.












