You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కెనడా ఎన్నికల్లో మెజార్టీ సాధించని లిబరల్ పార్టీ.. అయినా అధికారంలో కొనసాగనున్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో - BBC Newsreel
కెనడా ఎన్నికల్లో ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో లిబరల్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించింది. కానీ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.
ట్రుడో ఎన్నికల్లో గెలవడం ఇది మూడోసారి. కానీ, ఎన్నికల వల్ల సమయం వృథా అయ్యిందని ఆయన విమర్శకులు అంటున్నారు.
లిబరల్స్ 156 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన ట్రుడోకు మెజారిటీకి అవసరమైన 170 స్థానాల కంటే ఇది చాలా తక్కువ.
మరోవైపు, కన్జర్వేటివ్స్ తమ ప్రధాన ప్రతిపక్ష హోదాను నిలుపుకోగలిగారు. ఆ పార్టీ దాదాపు 122 స్థానాలు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
"లక్షలాది కెనడా ప్రజలు ఒక ప్రగతిశీల ప్రణాళికను ఎంచుకోవడాన్ని మనం చూశాం. మీకోసం పోరాడే, మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు" అని ట్రుడో మంగళవారం ఉదయం మాంట్రియల్‌లో తన మద్దతుదారులతో అన్నారు.
కెనడాలో కరోనా మహమ్మారి ఫోర్త్ వేవ్ సమయంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఇవి దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. ఈ ఎన్నికల నిర్వహణకు 470 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు.
ఇప్పుడు అంచనా వేస్తున్న ఫలితాలు రెండేళ్ల క్రితం 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలనే సూచిస్తున్నాయి.
కింగ్ మేకర్ కానున్న ఎన్డీపీ
కెనడాలో ప్రభుత్వాలు మైనారిటీలో ఉండడం సర్వ సాధారణమే అయినా, సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రం చాలా అరుదు. చట్టాన్ని ఆమోదించాలంటే ప్రధాని ట్రుడో ప్రతిపక్ష పార్టీలతో రాజీ పడాల్సి ఉంటుంది.
దీంతో, కొత్త పార్లమెంటులో న్యూ డెమాక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) కింగ్ మేకర్‌గా మారనుంది. బల పరీక్ష నుంచి బయటపడ్డానికి, తమ విధానాలు అమలు చేయడానికి ఈ పార్టీ ప్రభుత్వానికి సహాయపడవచ్చు.
గత పార్లమెంటులో ప్రధాని ట్రూడోకు, తనకు మధ్య సంప్రదింపులు జరిగినట్లు బ్రిటిష్ కొలంబియాలోని బుర్నబీలో మాట్లాడిన ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ చెప్పారు.
ఈ సారీ తన ప్రాధాన్య జాబితాలో ఉన్న వాతావరణ మార్పులు, పేదలకు గృహ వసతి, ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
"మేం కలిసి పనిచేస్తే, మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని మీరు కచ్చితంగా ఆశించవచ్చు" అని జగ్మీత్ సింగ్ అన్నారు.
ఎన్డీపీకి 25 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)