You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: యూఏఈలో 13.5 ఎకరాల్లో హిందూ మందిర నిర్మాణం
యూఏఈ రాజధాని అబూదాబి నగర శివారులో భారీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు.
అబూదాబి నుంచి 30 నిమిషాలు, దుబాయి నుంచి 45 నిమిషాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
13.5 ఎకరాల్లో ఆలయం, మరో 13.5 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఆ స్థలాన్ని అబూదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ విరాళంగా ఇచ్చారు.
ఈ ఆలయానికి రాజస్థాన్ గులాబీ రంగు ఇసుకరాళ్లు, పాలరాళ్లు వినియోగిస్తారు. భారత్‌లో దాదాపు 2,000 మంది శిల్పులతో చెక్కించిన కళాకృతులను తీసుకెళ్తున్నారు.
యూఏఈలో వేసవి ఉష్ణోగ్రత ఒక్కోసారి 50 డిగ్రీలకు చేరుతుంది. ఇంతటి తీవ్రమైన ఎండలను తట్టుకునేలా భారత్‌లోని రాజస్థాన్ నుంచి రాళ్లను తీసుకెళ్లాలని నిర్ణయించారు.
జైపూర్‌లో హవా మహల్ సహా, పలు రాజభవనాలకు ఆ రాళ్లు వినియోగించారు.
యూఏఈలో అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక ప్రదేశం ఇదే అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రతిబింబించేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు.
ప్రకృతి అందాలను ప్రతిబింబించేలా వృక్షాలు, పూలు, నెమళ్లు, ఏనుగుల కళాకృతులతో మందిరాన్ని ముస్తాబు చేస్తారు.
యూఏఈలోని ఏడు ఎమిరేట్ల (రాజ్యాల)కు గుర్తుగా ఏడు గోపురాలు ఉంటాయి.
2020లోగా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ ఈ నిర్మాణానికి రెండుమూడేళ్లు పడుతుందని భారత రాయబారి నవదీప్ సూరి గత నెలలో చెప్పారు.
ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు, భోజనశాల, గ్రంథాలయం, ఆడిటోరియం, ఆటస్థలం, ప్రదర్శనశాల, పార్కులను కూడా ఏర్పాటు చేస్తారు.
హిందూ వివాహాలు జరిపించేందుకు కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తారు.
ఈ మందిరాన్ని బాప్స్ స్వామినారాయణ్ సంస్థ నిర్మిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)