ఆ ఊర్లో రాత్రి ఏడు కాగానే గంట మోగుతుంది, అందరూ ఫోన్లు, టీవీలు ఆపేస్తారు, ఎందుకు

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ హిందీ

అదొక గ్రామం...సుమారు 3వేల మంది జనాభా ఉంటారు.

రాత్రి 7 గంటలు కాగానే ప్రతి రోజూ ఆ ఊర్లో సైరన్ మోగుతుంది. అంతే టీవీలు కట్టేసి, ఫోన్లు పక్కన పెట్టేసి జనాలు ఇంట్లో నుంచి బయటకు వస్తారు.

ఇరుగుపొరుగుతో నాలుగు మాటలు కలబోసుకుంటారు. గత కొంత కాలంగా ఈ పద్ధతిని పాటిస్తోంది మహారాష్ట్రలోని వడగావ్ అనే ఊరు.

మళ్లీ రాత్రి 8.30 గంటలకు సైరన్ మోగుతుంది. అప్పుడు ఫోన్లు, టీవీలు మళ్లీ వాడుకోవచ్చు. ఇలా రోజుకు గంటన్నర రెండు గంటల పాటు గ్రామస్తులు ఫోన్లు, టీవీలను దూరంగా ఉంచుతున్నారు.

'ఫోన్లు, టీవీలు చూడటం అనేది ఒక రకమైన వ్యసనంగా మారుతోంది. కరోనా సంక్షోభం వల్ల చదువు కోసం పిల్లలు ఫోన్ల మీద ఆధారపడటం మరింత పెరిగింది.

ఆ తరువాత స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరచినా పిల్లలు ఇంటిక వచ్చిన తరువాత ఫోన్లలో గేమ్స్ ఆడటమో లేదా టీవీ చూస్తూ ఉండటమో చేస్తున్నారు.

అలాగే పెద్ద వాళ్లు కూడా ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా ఎక్కువ సమయం ఫోన్లు, టీవీలతోనే గడుపుతున్నారు.

‘‘దీనికి పరిష్కారం కోసం అగస్టు 14న మేమంతా సమావేశమయ్యాం. మరుసటి రోజు అంటే స్వాతంత్ర్య దినోత్సవం నాడు నుంచి రోజూ కాసేపు వాటిని దూరంగా ఉంచాలని నిర్ణయించాం. ఆ మరుసటి రోజు నుంచే సైరన్ మోగగానే టీవీలు, ఫోన్లు వాడటం ఆపేయడం ప్రారంభించాం’’ అని ఆ ఊరి సర్పంచ్ విజయ్ మోహితే తెలిపారు.

ఫోన్లు, టీవీ వల్ల పిల్లల చేత హోం వర్క్ చేయించడం కష్టంగా మారుతోందని వందన మోహితే అంటున్నారు. ‘‘ఫోన్లు, టీవీలు కాసేపు ఆపాలనే నిబంధన వచ్చిన తరువాత నా పని కాస్త సులభం అయింది. మా ఆయన ఇంటికి వచ్చిన తరువాత పిల్లల చేత హోం వర్క్ చేయిస్తున్నారు. నేను ప్రశాంతంగా వంట పని చేసుకోగలుగుతున్నా’’ అని వందన తెలిపారు.

అయితే ఫోన్లు, టీవీలు దూరంగా ఉంచాలనే నిర్ణయానికి అందరి నుంచి అంగీకారం, మద్దతు అంత సులభంగా లభించలేదు.

‘‘ముందు ఈ నిర్ణయాన్ని ఊర్లో వాళ్లకు చెప్పినప్పుడు మగవారు నవ్వారు. కానీ ఆ తరువాత ఆడవారితో మాట్లాడాం. ఇంట్లో టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసేది వారే. దాని మీద వారికి అవగాహన కల్పించి అంగీకారం తీసుకున్నాం. అలా టీవీలు, ఫోన్లు ఆపాలనే నిర్ణయానికి గ్రామస్తుల నుంచి మద్దతు లభించింది’’ అని విజయ్ వివరించారు.

‘‘ఫోన్లు, టీవీలు ఎప్పుడు ఆపాలో తెలిపేందుకు ఊర్లోని దేవాలయం వద్ద ఒక సైరన్ పెట్టాలని మరొక సమావేశంలో నిర్ణయించాం' అని ఆయన తెలిపారు.

అయితే నిర్ణయం తీసుకోవడమే కాదు దాన్ని అమలు చేయడం కూడా తొలుత కష్టంగా ఉండేది. సైరన్ మోగగానే గ్రామస్తులు ఫోన్లు, టీవీలు ఆపుతున్నారో లేదో చెక్ చేసేందుకు గ్రామసభ సభ్యులు వెళ్లేవారు. ఇంటింటికి తిరుగుతూ ఫోన్లు, టీవీలు ఆపాల్సిందిగా కోరేవారు.

ఇప్పుడు ఊరంతా ఫోన్లు, టీవీలు ఆపేస్తున్నట్లు విజయ్ చెబుతున్నారు.

'కరోనా వల్ల ఆన్‌లైన్‌ యాక్టివిటీస్ పెరిగాయి. వాటి కోసం ఫోన్, కంప్యూటర్ల మీద ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది' అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్‌కు చెందిన డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ అంటున్నారు.

2020లో జులై-డిసెంబరు మధ్య 682 మంది మీద డా.మనోజ్ కుమార్ బృందం పరిశోధనలు జరిపింది. వారిలో ఇంటర్నెట్ వాడటం సమస్యాత్మక స్థాయికి చేరినట్లు పరిశోధనలో తేలింది. టీనేజీ వారితో పాటు యువతలో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

‘‘అవసరం ఉన్నా లేకున్నా ఇంటర్నెట్ వాడుతూ ఉండటం వల్ల ఈ సమస్య వస్తోంది. అది మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతోంది. ఇది అనేక రకాలుగా జీవితం మీద చెడు ప్రభావం చూపుతుంది’’ అని డా.మనోజ్ కుమార్ అన్నారు.

ఇలా మానసిక ఒత్తిడికి లోనయ్యే యువత, తాత్కాలిక ఉపశమనం కోసం ఇంటర్నెట్‌ను మరింతగా వాడటం మొదలు పెడతారు. అలా వారు ఇతరులతో మాట్లాడటం, కలవడం తగ్గిస్తారు. బంధువులు, స్నేహితులను కలవరు. కుటుంబ సభ్యులతోను అంతగా మాట్లాడరు.

‘‘ఫోన్లు వాడకం తగ్గించాలంటే కుటుంబ బంధాలు బలపడి, వారి మధ్య సంబంధాలు పెరగాలి. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. నలుగురితో కలిసేలా బయటకు వెళ్లి వారు ఆడుకునేలా చూడాలి. సరిపడా నిద్ర, తిండి తింటున్నారో లేదో గమనించాలి' అని డా.మనోజ్ కుమార్ సూచించారు.

ఊర్లో రోజూ కాసేపు ఫోన్లు, టీవీలు ఆపాలనే నిర్ణయం తీసుకున్న తరువాత తమ పిల్లల్లో మార్పు వచ్చిందని చెరకు పండించే రైతులు దిలీప్ మోహితే అంటున్నారు. ఆయనకు ముగ్గురు అబ్బాయిలు.

ఇంతకు ముందు వారు చదువు మీద శ్రద్ధ పెట్టేవారు కాదని, ఇప్పుడు ఆ తీరు మారిందని దిలీప్ చెబుతున్నారు. పెద్దవారు కూడా నలుగురు కలిసి మాట్లాడుకోవడం పెరిగిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)