You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒకపరి కొకపరి వీడియో తొలగించిన శ్రావణ భార్గవి.. ‘అన్నమయ్యపై అభిమానంతోనే వీడియోను తొలగిస్తున్నా’
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రావణ భార్గవి పెద్ద తిరుమలాచార్యులు రచించిన కీర్తనతో కూడిన వీడియోను తొలగించారు. తెలుగు సినీ గాయని శ్రావణ భార్గవి అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యులు రచించిన కీర్తనకు చేసిన కవర్ పాట వివాదాస్పదంగా మారింది.
ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం విడుదల చేశారు.
"గంటలకొద్దీ కష్టపడి, ఎంతో కళాత్మకంగా మేము ఆ వీడియో రూపొందించాం. అన్నమాచార్య పై నాకున్న ఎనలేని గౌరవం, అభిమానంతోనే వీడియోను తొలగిస్తున్నాను"
"వివాదాలకు నేను ఎప్పుడూ దూరంగానే ఉంటాను. నెగిటివిటీని నేను ఎన్నడూ ప్రోత్సహించను.ఈ వివాదం మరింత దూరం వెళ్లడం నాకు ఇష్టం లేదు. మరో విభిన్న సంగీతాన్ని, సందేశాన్ని జోడించి కొత్త వీడియో విడుదల చేశాను"
"చూసే దృక్కోణం పైనే విషయం ఆధారపడి ఉంటుంది. ఒక విషయాన్ని చూసే దృష్టిని మార్చుకున్నప్పుడు, మనం చూసే విషయం కూడా మారుతుంది" అని పోస్టులో రాశారు.
తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామి పై చేసిన రచనకు ఆమె చేసిన అభినయాన్ని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు ఈ వీడియో కళాత్మకంగా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఈ పాటలో ఏముంది?
"ఒకపరి కొకపరి కొయ్యారమై, మొఖమున కళలెల్ల మొలచినట్లుండెగ"
శ్రావణ భార్గవి అభినయం చేసిన కీర్తన ఇలా మొదలవుతుంది. 1 నిమిషం 16 సెకండ్ల పాటు ఉన్న వీడియోలో ఈ ఒక్క వ్యాఖ్యానికి మాత్రమే ఆమె అభినయం చేశారు. ఈ కీర్తనను కూడా ఆమె స్వయంగా పాడారు.
"స్వామికి పునుగు పిండితో లేపనం చేసి పచ్చకర్పూరం, చందనం లాంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఆ సమయంలో తిరుమలాచార్యులకు స్వామి పరిపరి విధాలుగా కనిపించారు. ఆ సమయంలో తిరుమలాచార్యులు "ఒక పరి నొకపరి వొయ్యారమై" అనే కీర్తనను రచించారు" అని అన్నమాచార్యుల 12వ తరం వారసులు తాళ్ళపాక స్వామి బీబీసీకి వివరించారు. ఆయన తిరుమల ఆలయంలో వేంకటేశ్వర స్వామిని మేల్కొల్పేందుకు కైంకర్య గీతాలు పాడతారు.
ఈ వీడియో పట్ల అభ్యంతరం ఏంటి?
శ్రావణ భార్గవి చేసిన అభినయం అన్నమయ్య కీర్తనను, వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచేట్లు ఉందని అన్నమయ్య వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
"అన్నమయ్య 32,000 కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలన్నీ స్వామి పైనే రచించారు. ఈ పాటను పెద్ద తిరుమలాచార్యులు శుక్రవారం సమయంలో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తుండగా స్వామి కనిపించిన విధానానికి అనుగుణంగా ఆయనను ఊహించుకుంటూ రచించారు".
"అటువంటి కీర్తనను ఆలయంలో భక్తితోనో లేదా ఇంట్లో దేముడి ముందో పాడితే బాగుండేది కానీ, ఏవో తింటూ కాళ్లు చూపిస్తూ అభినయం చేశారు" ఇది కీర్తనను అపహాస్యం చేస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.
"దేమునిపై రాసిన కీర్తనలను మనుషుల కోసం రాసినట్లు దృశ్యాలను చిత్రీకరించడం మాకు అభ్యంతరం" అని అన్నారు.
"అన్నమాచార్యులు సినిమా పాటల రచయత కాదు. ఇలా చేయడం భగవంతుని అవమానించడమే" అని అన్నారు.
ఆమె సంగీత జ్ఞానాన్ని వారు ప్రశ్నించలేదని చెపుతూ, ఈ వీడియోను పబ్లిక్ వేదికల నుంచి తీసివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
శ్రావణ భార్గవి అన్నమయ్య ట్రస్ట్ సభ్యునితో మాట్లాడినట్లుగా ఒక ఆడియో క్లిప్ మాత్రం మీడియాలో కనిపిస్తోంది. ఈ ఆడియోలో ఆమె "నేను హిందువును, బ్రాహ్మణ అమ్మాయిని. మనోభావాలు ఎక్కడ దెబ్బ తిన్నాయో నాకు తెలియలేదు. వీడియో తొలగించను. ఇందులో అశ్లీలత ఎక్కడుంది?" అని ప్రశ్నించారు.
"స్వామి వారికి సంబంధించిన కీర్తనలను అమ్మవారికి పాడటం సరైంది కాదు" అని అవతలి వ్యక్తి అన్నప్పుడు "నేనా పాటను భక్తితో పాడాను" అని శ్రావణ భార్గవి సమాధానం చెప్పారు.
అయితే, బీబీసీ ఈ ఆడియో క్లిప్‌ను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. బీబీసీ ఆమెను సంప్రదించాలని ప్రయత్నించగా, ఆమె స్పందించలేదు.
శ్రావణ భార్గవి ఈ పాటకు చేసిన అభినయం గురించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కాల్‌లో ఆమె వీడియోను తొలగించడం కష్టమని చెప్పారు.
కౌగిలింతలు, ముద్దుల మధ్యన "సామజవరగమన"..
ఈ వివాదం గురించి అన్నమయ్య సాహిత్య అధ్యయనకర్త, రచయిత్రి డాక్టర్ జయప్రభతో బీబీసీ మాట్లాడింది. ఆమె అన్నమయ్య సాహిత్యంపై పుస్తకాలు కూడా రచించారు.
"ఇది వివాదాస్పద అంశమే కాదు" అని అంటూ శ్రావణ భార్గవి చేసిన వీడియో సృజనాత్మకంగా ఉంది. ఈ కీర్తన పాడుతూ కన్యాశుల్కం పుస్తకం చదవడం, జంతికలు తినడం కాస్త సంబంధం లేనట్లుగా ఉంది తప్ప అశ్లీలత ఎక్కడా కనిపించలేదు" అని జయప్రభ అన్నారు.
చాలా మంది సినిమా దర్శకులు మువ్వ గోపాలుని పదాలు, త్యాగయ్య కృతులు, జయదేవుని అష్టపదులు, అన్నమయ్య సంకీర్తనలను చిత్రీకరించినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
"సప్తపదిలో "మరుగేలరా ఓ రాఘవ!" అంటూ నాయిక నాయకుణ్ణి ఉద్దేశిస్తూ పాడుతున్నట్టుగా , "నగుమోము గనలేని నా జాలి తెలిసి" అని ప్రేమికుల మధ్య మరో సందేశం చూపించారు. శంకరాభరణం సినిమాలో పెళ్లిచూపుల పాటలో కౌగిలింతలు, ముద్దుల మధ్యన నాయిక "సామజవరగమన" అంటూ ఎవరి గురించి పాడుతుందో తెలిసిందే" అని సురేష్ కొలిచల అనే ఫేస్ బుక్ యూజర్ రాసిన పోస్టును ఆమె ప్రస్తావించారు.
అన్నమయ్య రాసిన శృంగార కీర్తనల గురించి మీ సమాధానం ఏమిటని బీబీసీ తాళ్ళపాక స్వామిని ప్రశ్నించింది. "అవి శృంగార భరితమైనవే కానీ, అవి స్వామిని ఊహించుకుంటూ స్వామి కోసం మాత్రమే రాసినవి. వాటిని మనుషులపై చిత్రీకరించుకోవడం పట్ల మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం" అని తాళ్ళపాక స్వామి అన్నారు.
సినీ గీతాల్లో అన్నమయ్య కీర్తనల చిత్రీకరణ గురించి ప్రస్తావించినప్పుడు "చిత్రీకరణ సంగీతభరితంగా ఉన్నప్పుడు మాకు అభ్యంతరం లేదు" అని తాళ్ళపాక స్వామి అన్నారు.
తిరుమలలో అన్నమయ్య ప్రాశస్త్యం
తిరుమల ఆలయంలో అన్నమయ్య కీర్తనలతో సుప్రభాత సేవ మొదలు సకల సేవలు సాగుతాయి. సుప్రభాత సేవలో 'మేలుకో శృంగారరాయ' సంకీర్తనతో కైంకర్యం మొదలవుతుంది. అన్నమాచార్యులు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఆయన అభిషేక సమయంలో స్వయంగా గానం చేసేవారని చెప్పారు.
"పెద్ద తిరుమలాచార్యులు రచించిన మేలుకో శృంగార రాయ కీర్తనను స్వామిని మేల్కొల్పేందుకు పాడతారు. ఈ కీర్తన కూడా శృంగార కీర్తనే. కానీ, వీటిని ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించేందుకు మాత్రం లేదు" అని తాళ్ళపాక స్వామి వివరించారు.
మధ్యాహ్నం జరిగే 'నిత్య కళ్యాణం పచ్చ తోరణం' కైంకర్య సేవలో అన్నమయ్య సంకీర్తనల ఆలాపన జరుగుతుంది.
ఇక రాత్రి పూట ఏకాంత సేవలోనూ శయన మండపంలో ఉయ్యాలలూపుతూ పలు సంకీర్తనలు ఆలపిస్తారు. చిన్నబిడ్డలను ఉయ్యాలలో వేసి ఊపిన విధంగా లాలి పాటలను సంకీర్తనలుగా వినిపిస్తారు.
తోమాల సేవ నుంచి అన్ని సందర్భాల్లోనూ అన్నమయ్య కీర్తనల ఆలాపన ఆనవాయితీ.
అలసి సొలసిపోయిన వెంకటేశ్వరుడిని 'షోడస కళానిధికి..' అంటూ అన్నమయ్య సంకీర్తనలతో కొనియాడడం నిత్య కార్యక్రమంగా ఉంటుంది.
వెంకటేశ్వరుని నిత్యోత్సవాల్లో వైశాఖ మాసాన తిరుమాడ వీధుల్లో జరిగే ఊరేగింపు సందర్భంగా అన్నమయ్య సంకీర్తనలు వినిపించడం సంప్రదాయంగా వస్తోంది.
అన్నమయ్య సాహిత్యం ఎలా ఉంటుంది?
"అన్నమయ్య 32 వేల కీర్తనలను రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం-అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రచురించిన 14వేల సంకీర్తనల్లో మొదటి నాలుగు సంపుటాలు తప్ప మిగిలినవన్నీ శృంగార కీర్తనలే" అని అంటారు జయప్రభ.
"అన్నమయ్య అంటే, "అదిగో, అల్లదిగో శ్రీహరి వాసం" మాత్రమే కాదు. ఆయన వెంకటేశ్వర స్వామిని ఊహించుకుంటూ భక్తి, శృంగార, వైరాగ్య సాహిత్యం రాశారు. ఆయన తిరుమల గాలి పై కూడా కీర్తనలు రాశారు"
"అన్నమయ్య భక్తి ప్రాధాన్యం, వైరాగ్య శృంగార సంకీర్తనలని కూడా రాశారు. కానీ శృంగార సంకీర్తనలను ఇంకా విస్తృతంగా పాడటమే లేదు" అని అంటారామె.
అన్నమయ్య తండ్రి భాగవతంలో సిద్ధహస్తులు. తల్లి సంగీతకళానిధి అని చెబుతారు. ఇక అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రిగా గుర్తింపు పొందారు.
"తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు, చిన తిరువెంగళాచార్యులు రెండు శతాబ్దాల పాటు తెలుగు సారస్వత సేవలో తరించారు. అలాంటి వంశ పరంపర చాలా అరుదు" అని చరిత్ర పరిశోధకులు ఎం విశ్వనాథం అన్నారు.
అన్నమయ్య కుటుంబీకులకు నచ్చకపోతే వీడియో తొలగించాలా? వీటిపై హక్కులెవరివి?
"అన్నమయ్య సాహిత్యంపై హక్కులు ఆయన కుటుంబానివి కావు. వారికి నచ్చకపోతే వీడియో సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని అనడం సరైంది కాదు" అని జయప్రభ అన్నారు.
"అన్నమయ్య సజీవంగా ఉండి ఉంటేఈ విషయాన్ని చాలా చమత్కారంగా నవ్వుతూ స్వీకరించి ఉండేవారు" అని చమత్కారంగా అన్నారు.
"త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు కృతులు తెలుగువారి సొత్తు. ఇవి క్లాసిక్స్ కాబట్టి వీటిని ఒకపరికొకపరి ఎన్ని పర్యాయాలు ఎన్ని రకాలుగా చూస్తే అన్ని రకాల అర్థాలు తోస్తాయి. షేక్‌స్పియర్, టాల్ స్టాయ్, ఎలియట్ లాంటి వారి రచనలను ఎన్ని రకాలుగా మార్చి మార్చి అందులోని సారాంశాన్ని వాడుకుంటారో పాశ్చాత్య సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి అర్ధం అవుతుంది" అని సురేష్ రాశారు.
రాజకీయాలకు సంబంధం ఏమిటి?
ఒక అమ్మాయిపై తోటి మహిళలు విరుచుకుపడటం, అసభ్యకర పదజాలం ప్రయోగించడం సంస్కారయుక్తంగా లేదు. ఆ అమ్మాయి చేసిన తప్పేంటో కూడా అర్ధం కావటం లేదు. ఈ సాహిత్య విమర్శలో రాజకీయ నాయకుల పాత్ర ఎందుకు వస్తుందో అర్ధం కావటం లేదని అన్నారు. సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటని జయప్రభ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ అంశాన్ని టీటీడీ దృష్టికి తీసుకుని వెళతామని, కోర్టు ద్వారా పోరాడతామని అన్నమయ్య వంశస్థులు చెబుతున్నారు.
"ఈ మొత్తం వ్యవహారంలో అన్నమయ్య ప్రసక్తే లేదు. ఏ అంశాన్ని విమర్శించాలి, దేనిని విమర్శించకూడదనే విచక్షణ లేకుండా ప్రవర్తించడం మాత్రం సహేతుకం కాదు" అని అన్నారు.
"అనవసర విషయాలకు ప్రాచుర్యం కల్పించే బదులు అన్నమయ్య సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చి ప్రాజెక్టును సక్రమంగా నిర్వహిస్తే అదే ఆయనకు చేసే సేవ" అని జయప్రభ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- Rishi Sunak: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్‌కు ప్రధాన మంత్రి అవుతారా?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)