You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Minority-Hindus: భారత్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తించే అవకాశం ఉందా?
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"హిందువులు అల్పసంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వారిని మైనారిటీలుగా గుర్తించవచ్చు" అంటూ కేంద్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
దాంతో, హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో, వారికి మైనారిటీ హోదా కల్పించడం వీలవుతుందా, ఏ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు హిందువులకు మైనారిటీ హోదా ఇవ్వగలవు, దీనివల్ల హిందువులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.
జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992, మైనారిటీ విద్యా సంస్థల జాతీయ కమిషన్ చెల్లుబాటును సవాలు చేస్తూ అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
"జాతీయ స్థాయిలో భాష, మతం ఆధారంగా మైనారిటీ హోదా ఇవ్వలేమని 2002లో సుప్రీంకోర్టు 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం చెప్పింది. రాష్ట్ర స్థాయిలో వీరిని మైనారిటీలుగా గుర్తించవచ్చు. కానీ, ఈ దిశలో రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు మార్గదర్శకాలు ఎందుకు తయారు చేయలేదు?" అని అశ్వినీ కుమార్ బీబీసీతో అన్నారు.
ఇప్పటి వరకు ఆరు మతాలకు జాతీయ స్థాయిలో మైనారిటీ హోదా కల్పించారు. ఇందులో ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన మతాలు ఉన్నాయి. 2014లో జైన మతానికి, 1993లో మిగిలిన మతాలకు కేంద్ర ప్రభుత్వం మైనారిటీ హోదా కల్పించింది.
మైనారిటీకి నిర్వచనం ఎక్కడా చెప్పలేదని లాయర్ అశ్వినీ కుమార్ అన్నారు.
"ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రభుత్వం తన ఇష్టానుసారం వివిధ మతాలకు మైనారిటీ హోదా కల్పించింది. మన దేశంలో యూదులు, బహాయి మతానికి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ, వారికి మైనారిటీ హోదా లేదు" అని ఆయన అన్నారు.
ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, "2016లో మహారాష్ట్ర ప్రభుత్వం యూదులకు మైనారిటీ హోదా ఇచ్చినట్లే, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భాష, మత ప్రాతిపదికన మైనారిటీ హోదా ఇవ్వవచ్చని" సుప్రీంకోర్టుకు తెలిపింది.
కర్ణాటకలో ఉర్దూ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, తుళు, లమాని, హిందీ, కొంకణి, గుజరాతీలకు మైనారిటీ భాషల హోదా ఇచ్చారని కేంద్రం తెలిపింది.
అయితే, మైనారిటీల విషయంలో చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు మాత్రమే ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
అంటే, రాష్ట్రాలు మైనారిటీ హోదాల విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ, కేంద్రం కూడా మైనారిటీ వర్గాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.
మైనారిటీ హోదా వల్ల ప్రయోజనం ఏమిటి?
మైనారిటీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు 1992లో జాతీయ మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేశారు.
ఈ అంశంపై 'అటల్ బిహారీ వాజ్‌పేయి సీనియర్ ఫెలో' ప్రొఫెసర్ హిమాంషు రాయ్ బీబీసీతో మాట్లాడుతూ, మైనారిటీలుగా గుర్తింపు పొందినవారికి కొన్ని లాభాలు ఉంటాయని చెప్పారు.
"భాష, మతం ఆధారంగా మైనారిటీ హోదా పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీరేట్లకు రుణాలు, మైనారిటీ హోదా కలిగిన విద్యాసంస్థల్లో సులువుగా ప్రవేశం మొదలైన ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం మతపరమైన మైనారిటీ హోదా ఉన్న సంస్థ. ఇందులో దాదాపు 50 శాతం సీట్లు ముస్లిం విద్యార్థులకు కేటాయిస్తారు. ఇక్కడ కులం ఆధారంగా ఇచ్చే కోటా విధానం పనిచేయదు" అని ఆయన వివరించారు.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ లాంటి సంస్థలు దేశంలో చాలా ఉన్నాయి. మైనారిటీ వర్గాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేస్తుంది.
2014 నుంచి పార్సీ, జైన, బౌద్ధ, సిక్కు, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన సుమారు అయిదు కోట్ల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చినట్టు మైనారిటీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ స్కాలర్‌షిప్‌ల వల్ల ముఖ్యంగా ముస్లిం బాలికల స్కూలు డ్రాప్ అవుట్ రేటు గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది.
2014కు ముందు ముస్లిం బాలికల్లో డ్రాప్ అవుట్ రేటు 70 శాతం ఉండగా, ఇప్పుడు అది 30 శాతానికి తగ్గింది.
"మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. కానీ, దానివల్ల వారికి ఆర్థికంగా పెద్ద ప్రయోజనం చేకూరడంలేదు. మణిపూర్‌లో మైనారిటీ వర్గాల ప్రజలకు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ లేదు" అని ఆ రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ అన్వర్ హుస్సేన్ బీబీసీతో చెప్పారు.
ఏ రాష్ట్రాల్లో హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు?
భారతదేశంలో సుమారు 78 శాతం హిందువులు ఉన్నారు. అలాంటప్పుడు హిందువులకు మైనారిటీ హోదా ఎలా ఇస్తారు? ఇది తెలియాలంటే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హిందువుల జనాభా ఎంత ఉందో చూడాలి.
వాస్తవానికి పంజాబ్, లద్దాఖ్, మిజోరాం, లక్షద్వీప్, జమ్మూ కశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో హిందువుల కంటే ఇతర మతాల వారే ఎక్కువ.
ఉదాహరణకు, పంజాబ్‌లో సిక్కులు 57.69 శాతం ఉంటే, హిందువులు 38.49 శాతం ఉన్నారు. అలాగే, అరుణాచల్ ప్రదేశ్‌లో క్రైస్తవుల జనాభా 30.26 శాతం కాగా, హిందువుల జనాభా 29.04 శాతం.
ఇలాంటి చోట్ల హిందువులకు మైనారిటీ హోదా ఇవ్వాలని లాయర్ అశ్వినీ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్‌ను కూడా ఈ జాబితాలో చేర్చాలని ఆయన అన్నారు.
""మణిపూర్‌లో హిందూ జనాభా ఎక్కువే. రాష్ట్రంలో సుమారు 41 శాతం ఉన్న హిందువులకు మైనారిటీ హోదా ఇచ్చే ప్రశ్నే లేదు. ఇక్కడ హిందువుల ఆర్థిక పరిస్థితి కూడా బాగుంది. వీరంతా బిజినెస్ చేస్తున్నారు. అందరికన్నా ఎకువగా భూములు వీరి దగ్గర ఉన్నాయి" అని మణిపూర్ స్టేట్ మైనారిటీ కమీషన్ ఛైర్మన్ మొహమ్మద్ అన్వర్ హుస్సేన్ అన్నారు.
పంజాబ్‌లో హిందువులు మైనారిటీలా?
2011 జనాభా లెక్కల ప్రకారం, పంజాబ్‌లో సిక్కులు 57.69 శాతం కాగా హిందువులు 38.49 శాతం ఉన్నారు. అంటే పంజాబ్‌లో సిక్కులు మెజారిటీలో ఉన్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు మైనారిటీలను గుర్తించాల్సి ఉంటుందని, ఆ తరువాతే వారికి విద్యాసంస్థలు, ఇతర సంస్థల్లో ప్రాధాన్యం లభిస్తుందని పంజాబ్ రాష్ట్ర మైనారిటీల కమిషన్ చైర్మన్ ప్రొ. ఇమాన్యుయేల్ నాహర్ అన్నారు.
"ఇప్పటి వరకు పంజాబ్‌లో సిక్కు మతాన్ని తప్ప మరే ఇతర మైనారిటీ మతాలను నోటిఫై చేయలేదు. పంజాబ్‌లో ముస్లిం, క్రైస్తవం, బౌద్ధం, పార్సీ, జైన మతాలకు చెందినవారిని మైనారిటీలుగా పరిగణించరు. ఈ ప్రశ్న నేను చాలాసార్లు లేవనెత్తినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ వర్గాలన్నింటికీ దక్కాల్సిన ప్రయోజనాలను ఒక్క మతం మాత్రమే పొందుతోంది" అని ఆయన చెప్పారు.
పంజాబ్‌లో హిందువులకు మైనారిటీ హోదా ఇస్తే, సిక్కు మతస్థులు పొందుతున్న ప్రయోజనాలను హిందువులకు కూడా పంచవలసి ఉంటుంది. ఇది సిక్కులకు ఇష్టం ఉండదని ప్రొఫెసర్ ఇమాన్యుయేల్ చెప్పారు.
అసలు మైనారిటీగా గుర్తింపు పొందడానికి ప్రాతిపదిక ఏమిటి?
ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం మతాలకు మైనారిటీ హోదా కల్పించే విషయంలో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దాన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయి. రాష్ట్రాల్లో జనాభా బట్టి మైనారిటీలుగా గుర్తుస్తారా లేక మరేదైనా ప్రాతిపదిక ఉందా అన్నది స్పష్టంగా లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
దేశంలో సుమారు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో హిందువుల జనాభా 50 శాతం కంటే తక్కువగా ఉంది. అవి.. మణిపూర్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మేఘాలయ, నాగాలాండ్, లక్షద్వీప్, మిజోరాం.
మైనారిటీ హోదాపై రాజకీయాలు
కొన్ని రాష్ట్రాల్లో హిందువులకు మైనారిటీ హోదా కల్పించాలన్న వాదన కొత్తేం కాదు. చాలాకాలంగా వినిపిస్తున్నదే.
అటల్ బిహారీ వాజ్‌పేయి కాలం నుంచి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని, కానీ, కేంద్రం తప్పించుకుంటూ ఉందని ప్రొఫెసర్ హిమాంషు రాయ్ చెప్పారు. దీనివల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.
"నాగాలాండ్‌లో క్రైస్తవులు 87 శాతం, హిందువులు 8 శాతం ఉన్నారు. నాగాలాండ్‌లో ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వస్తే, మెజారిటీ క్రైస్తవులను తమ పక్షానికి తెచ్చుకోవాలి. అలాంటప్పుడు, హిందువులకు మైనారిటీ హోదా కల్పిస్తే క్రైస్తవులకు నచ్చకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో మరో పార్టీ దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చు" అని ప్రొఫెసర్ హిమాంషు రాయ్ వివరించారు.
అందుకే ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే విడిచిపెట్టాలని కేంద్రం కోరుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఆరు వారాల తరువాత మళ్లీ విచారణ జరుపుతారు.
నాలుగు వారాల్లోగా ఈ పిటిషన్‌కు సంబంధించిన అన్ని అంశాలపై సమాధానం ఇవ్వాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
- ఒక్క వాచీ ధర ఏడు కోట్లు.. రష్యా ఏజెంట్లు వీటిని ఎందుకు జప్తు చేశారు?
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను
- Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?
- ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి తల్లిని హత్య చేసిన 17 ఏళ్ల కూతురు.. ఏం జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)