You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం, గుండెపోటుతో తుదిశ్వాస
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించారు. సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
ఉదయం 8.45 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వర్గాలు బీబీసీకి నిర్ధారించాయి. ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే ఆయన మరణించారని అపోలో ఆసుపత్రి వర్గాలు బీబీసీతో చెప్పాయి.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ వారసత్వంతో వైసీపీలో చేరిన గౌతమ్ రెడ్డి స్వల్పకాలంలోనే కీలక స్థానానికి ఎదిగారు.
గత నెలలో ఆయన కరోనా బారిన పడ్డారు. కోవిడ్ నుంచి కోలుకుని వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
నిత్యం యోగా, జాగింగ్ సహా వివిధ ఆరోగ్య జాగ్రత్తలు ఆయన పాటించేవారని సన్నిహితులు చెబుతున్నారు.
జగన్ సన్నిహితుల్లో ఆయన ఒకరు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నిహితుల్లో ఆయన ఒకరు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు.
2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రెండోసారి కూడా ఆత్మకూరు నుంచి గెలవగానే ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. నాలుగు రోజుల క్రితం ఆయన ఏపీకి పెట్టుబడుల వ్యవహారంపై దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున వివిధ ఒప్పందాలు చేసుకున్నారు.
1971 నవంబర్ 2న ఆయన జన్మించారు. యూకేలో ఎమ్మెస్సీ చేశారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి ఆయన సొంత గ్రామం. ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది.
మంత్రి మేకపాటి మృతికి చంద్రబాబు సంతాపం
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు.
మంత్రివర్గంలో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని ఆయన అన్నారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరితోనూ ఆయన ఆప్యాయంగా కలిసిపోయేవారని, హుందాగా ప్రవర్తించేవారని ఆయన అన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ శైలజనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్యువు కబళించడం బాధాకరమని శైలజనాథ్ అన్నారు.
యువ నాయకుడిగా,మంత్రిగా గౌతమ్ రెడ్డి ఏపీకి విశేష సేవలందించారని విజయసాయిరెడ్డి అన్నారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో మంచి స్నేహితుడిని, అన్నను కోల్పోయాను అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని, ఆయన మృతి తనను ఆవేదనకు గురి చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘దేశంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉంది, ప్రాంతీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ – కేసీఆర్
- రాజా సింగ్: బుల్డోజర్ వ్యాఖ్యలపై కేసు నమోదుచేసిన హైదరాబాద్ పోలీసులు
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...
- సింగపూర్: అడవిలో ఈయన ఒంటరిగా 30 ఏళ్లు ఉన్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)