ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: మాయావతి, ములాయం సింగ్‌ల మధ్య వైరం పెంచిన గెస్ట్‌హౌస్ ఘటన, ఆ రోజు ఏం జరిగిందంటే..

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాయావతి, ములాయం సింగ్ యాదవ్‌ల మధ్య దూరానికి పునాది 1995 మే 23న పడింది. పార్టీ పొత్తుల విషయమై కాన్షీరాంతో మాట్లాడేందుకు ములాయం సింగ్ లఖ్‌నవూ వెళ్లారు. అయితే, ఇకపై ఏ చర్చలైనా విలేఖరుల ముందే జరుగుతాయని కాన్షీరాం కచ్చితంగా చెప్పేశారు.

అదే రోజు రాత్రి కాన్షీరామ్ లాల్జీ టాండన్‌కు ఫోన్ చేసి మాయావతిని ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ మద్దతు కోరారు.

ములాయం ప్రభుత్వంలోని తన 11 మంది మంత్రులతో పాటూ మాయావతి జూన్ 1న గవర్నర్ మోతీలాల్ వోరాను కలుసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన వినిపించారు.

మూడు రకాల పత్రాలను వోరాకు సమర్పించారు మాయావతి. మొదటి పత్రంలో, అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం కాన్షీరాంకు అప్పగించారు.

రెండవ పత్రంలో, ములాయ్ సింగ్ యాదవ్ ప్రభుత్వానికి మద్దతు వాపసు తీసుకునే విషయాన్ని ప్రస్తావించారు. అందుకు కారణాలు కూడా వివరించారు.

మూడవ పత్రంలో, మాయావతికి మద్దతు ఇచ్చిన బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన 282 మంది ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు.

గెస్ట్ హౌస్‌పై కార్యకర్తల దాడి

మాయావతి ప్రతిపాదనపై నిర్ణయాన్ని గవర్నర్ మోతీలాల్ వోరా ఒకరోజు వాయిదా వేశారు.

అయితే, 1995 జూన్ 2 నాటికి పరిస్థితులు ఒక్కసారిగా దిగజారిపోయాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) మద్దతుదారులు కొందరు స్టేట్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ రూం నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు.

సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన హింసాకాండ రెండు గంటలపాటు కొనసాగింది. ఇరు పక్షాలవారూ గాయపడ్డారు.

హిందుస్థాన్ టైమ్స్ లఖ్‌నవూ ఎడిషన్ ఎడిటర్ సునీత ఆరోన్, తాను రాసిన 'అఖిలేష్ యాదవ్: విండ్స్ ఆఫ్ చేంజ్' పుస్తకంలో ఈ ఘటన గురించి వివరించారు.

"ఎస్పీ కార్యకర్తలు, ఏడుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలపై దాడికి ప్రయత్నించినప్పుడు మాయావతి గెస్ట్ హౌస్‌లో లేరు. ఎమ్మెల్యేలను కాన్ఫరెన్స్ రూంలో ఉండమని చెప్పి ఒక సీక్రెట్ మిషన్ కోసం ఆమె బయటకు వెళ్లారు. కొంతసేపటి తరువాత భారీ బందోబస్తు మధ్య ఆమె గెస్ట్ హౌస్ చేరుకున్నారు. రూం నంబర్ 2లో తాళం వేసుకుని కూర్చున్నారు. ఎస్పీ కార్యకర్తలు గెస్ట్ హౌస్‌కు కరెంట్, నీటి సరఫరా నిలిపివేశారు. ఇంతలో కొందరు బీజేపీ మద్దతుదారులు మాయవతికి కాపలాగా ఆమె గది బయట నిలబడ్డారు" అని రాశారు.

బీఎస్పీ ఎమ్మెల్యేలను లాక్కెళ్లారు

1995 జూన్ 1న ఉత్తర్‌ప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకుంది. వెంటనే, ములాయం సింగ్ ప్రభుత్వం లఖ్‌నవూలోని పలువురు అడ్మినిస్ట్రేటివ్, పోలీసు అధికారులను బదిలీ చేసింది.

వివాదాస్పద అధికారి ఓపీ సింగ్‌ను హడావిడిగా లఖ్‌నవూ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఓపీ సింగ్‌కు మాయావతి అంటే పడదు. ఎందుకంటే గతంలో ఆమె, ఆయన్ను రెండుసార్లు బదిలీ చేశారు.

"సాయంత్రం నాలుగు అవుతుండగా సుమారు 200 మంది ఎస్పీ కార్యకర్తలు గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. మాయావతికి వ్యతిరేకంగా కులహంకార నినాదాలు చేయడమే కాక, ఆమెను బహిరంగంగా అవమానించేందుకు సిద్ధపడ్డారు. మాయావతి ఎమ్మెల్యేలు గెస్ట్ హౌస్ మెయిన్ గేటు మూసేశారు.

కానీ, ఎస్పీ కార్యకర్తలు వాటిని బద్దలుగొట్టుకుని లోపలికి చొరబడ్దారు. కనీసం అయిదుగురు ఎమ్మెల్యేలను కాన్ఫరెన్స్ రూం నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చి, వాహనాల్లోకి ఎక్కించి ములాయం సింగ్ యాదవ్ నివాసానికి తీసుకెళ్లారు.

రాజ్ బహదూర్ నేతృత్వంలోని బీఎస్పీ వర్గంలో చేరమని వాళ్లపై ఒత్తిడి తెచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు భయపడి వెంటనే అందుకు ఒప్పుకున్నారు. పత్రాలపై సంతకాలు చేశారు" అని అజయ్ బోస్, మాయావతి జీవిత చరిత్రపై రాసిన "బెహెన్జీ' పుస్తకంలో వివరించారు.

మాయావతి గదిలో తలదాచుకున్న బీఎస్పీ ఎమ్మెల్యేలు

ఇదిలా ఉండగా, కొందరు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాన్ఫరెన్స్ రూం నుంచి తప్పించుకుని మాయావతి గదిలో తలదాచుకున్నారు. అందరికన్నా చివర్న ఎమ్మెల్యే ఆర్కే చౌదరి మాయావతి గదికి చేరుకున్నారు. తన సెక్యూరిటీ గార్డు లాల్ చంద్, పోలీసు కానిస్టేబుల్ రషీద్ అహ్మద్ సహాయంతో ఆయన అక్కడకు చేరుకోగలిగారు.

లాల్ చంద్ సలహాతోనే ఎమ్మెల్యేలు గదికి లోపలి నుంచి తాళం బిగించారు. మరి కొద్దిసేపటికే ఎస్పీ కార్యకర్తలు ఆ గది వద్దకు చేరుకుని తలుపులు కొట్టడం ప్రారంభించారు. లోపలున్న వారిని దుర్భాషలాడుతూ, బయటికొస్తే మాయవతిని ఏంచేస్తామో చూడండి అంటూ బెదిరించారు.

ఆరోజు ఎస్పీ కార్యకర్తల నుంచి మాయావతిని రక్షించడంలో ఇద్దరు జూనియర్ పోలీసు అధికారులు, హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని హౌస్ ఆఫీసర్ విజయ్ భూషణ్, ఎస్‌హెచ్ఓ (వీఐపీ) సుభాష్ సింగ్ బఘేల్ ప్రధాన పాత్ర పోషించారు. అతికష్టం మీద గుంపును వెనక్కు నెట్టగలిగారు. మళ్లీ ఎవరూ ముందుకు రాకుండా గది బయట దడి కట్టి నిల్చున్నారు.

"వీళ్లు తప్పించి అక్కడ ఉన్న మిగతా అధికారులెవరూ ఈ గందగోళాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు. సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఓపీ సింగ్ అక్కడే ఉన్నారని, దాడిని ఆపే ప్రయత్నం చేయకుండా సిగరెట్ కాలుస్తూ నిల్చున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ ఖేర్ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి కొంత వరకు అదుపులోకి వచ్చింది. ముందుగా, పోలీస్ సూపరింటెండెంట్ రాజీవ్ రంజన్ వర్మ సహాయంతో ఎమ్మెల్యేలు కాని వారిని గెస్ట్ హౌస్ ప్రాంగణంలోంచి బయటకు పంపించారు. కాసేపటికి పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దాంతో, ఎస్పీ ఎమ్మెల్యేలనూ అక్కడి నుంచి బయటకు పంపించగలిగారు. దీని కోసం లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది.

మరోవైపు, ఎస్పీ ఎమ్మెల్యేలతో కఠినంగా వ్యవహరించవద్దంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాజీవ్ ఖేర్‌కు సందేశాలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఆయన వాటిని పట్టించుకోలేదు. అదే రోజు రాత్రి 11 గంటలకు ములాయం సింగ్ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది" అంటూ అజయ్ బోస్ ఆనాటి ఘటనలను తన పుస్తకంలో వివరించారు.

మీడియాలో మాయావతికి సానుభూతి

ఇది జరుగుతున్నంతసేపు మాయావతి గది లోపలే ఉండిపోయారు. గొడవ సద్దుమణిగిందని, ప్రమాదం లేదని జిల్లా మేజిస్ట్రేట్ పదే పదే హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి సమయంలో ఆమె తలుపులు తీసుకుని బయటకు వచ్చారు.

ఈ ఘటనతో, ములాయంకు మద్దతు ఇచ్చినవారు వెనక్కు తగ్గారు. మాయావతికి మీడియాలో సానుభూతి పెరిగింది.

అంతకుముందు ఇదే మీడియా, ములాయంకు మద్దతు ఉపసంహరించుకున్నందుకు మాయావతి అవకాశవాది అంటూ దుయ్యబట్టింది. అప్పటికి మీడియా దృష్టిలో ఉత్తర్‌ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి పగ్గాలు చేపట్టేంత అనుభవం మాయావతికి లేదు.

గెస్ట్ హౌస్ ఘటనతో మాయావతికి వ్యతిరేకంగా ఉన్న వాతావరణం మొత్తం మారిపోయింది. ఈ అవమానాన్ని మాయావతి ఎప్పుడూ మరచిపోలేదు. దీని గురించి మాట్లాడినప్పుడల్లా ఆమె పళ్లు కొరికేవారు. గొంతు వణికేది.

"గెస్ట్ హౌస్‌లో నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడే ములాయం సింగ్ నేరప్రవృత్తి బయటపడింది. తమ కండబలంతో మా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడమే కాకుండా నన్ను చంపేందుకు కూడా ప్రయత్నించారు" అంటూ తన ఆత్మకథ 'మేరా సంఘర్ష్మయ్ జీవన్ ఏవం బహుజన్ సమాజ్ మూవ్‌మెంట్ కా సఫర్నామా'లో మాయావతి రాసుకున్నారు.

ములాయం, మాయావతి మధ్య పెరిగిన అంతరం

గెస్ట్ హౌస్‌లో తమ కార్యకర్తలు నినాదాలు మాత్రమే చేశారని ములాయం సింగ్ అనేకమార్లు సమర్థించుకున్నారు.

"గోల విని బీఎస్పీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. మా కార్యకర్తలు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజానికి, మా ఎమ్మెల్యేలను కొట్టారు. వాళ్లు మా ఇంటికి వచ్చేసరికి గాయాలతో రక్తమోడుతూ ఉన్నారు" అని సునీతా ఆరోన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ములాయం.

అయితే, గెస్ట్ హౌస్ కుట్రలో ములాయం సింగ్ యాదవ్ హస్తం ఉందని ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన రమేశ్ చంద్ర కమిటీ తన 89 పేజీల నివేదికలో పేర్కొంది.

ఇది ముందుగానే ప్లాన్ చేశారని, ఆ మేరకు కొంతమంది అధికారులను లఖ్‌నవూ నుంచి బదిలీ చేశారని రిపోర్టులో తెలిపారు.

ఈ ఘటన ప్రభావం ఎంతంటే, ఈ అవమానాన్ని తన మద్దతుదారులకు గుర్తు చేసే ఏ అవకాశాన్నీ మాయావతి వదులుకోలేదు.

ఎన్ని రకాల రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ఎస్పీ, బీఎస్పీమధ్య అంతరం పూడుకోలేదు. ఈ ఘటన వల్లే దళిత, ముస్లిం, వెనుకబడిన వర్గాల కూటమి బలం శాశ్వతంగా మరుగునపడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దీన్ని పునరుద్ధరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)