You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ శనివారం కన్నుమూశారు.
83 ఏళ్ల రాహుల్ బజాజ్ పుణేలో తుదిశ్వాస విడిచారని కంపెనీ అధికారులు పేర్కొనట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
బజాజ్ కంపెనీ అభివృద్ధిలో రాహుల్ బజాజ్ పాత్ర చాలా కీలకం. చేతక్, ప్రియా, కవాసకి మోటార్ బైక్‌లను వినియోగదారుల చెంతకు చేర్చింది ఆయనే.
రాహుల్ బజాజ్ 1938 జూన్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్ ఆనర్స్ చదివారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో శిక్షణ పొందారు. ఇదే సమయంలో బాంబే యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యను కూడా అభ్యసించారు.
60వ దశకంలో ఆయన అమెరికాలోని హర్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ డిగ్రీ పట్టాను పొందారు. చదువు పూర్తయిన తర్వాత, 30 ఏళ్ల వయస్సులో 'బజాజ్ ఆటో లిమిటెడ్' కంపెనీకి సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ స్థానాన్ని అధిష్టించిన అతిపిన్న భారతీయునిగా ఆయన ఘనతకెక్కారు.
భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్న దేశంలోని అతికొద్ది పారిశ్రామికవేత్తలలో రాహుల్ బజాజ్ కూడా ఒకరు.
భారతదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ భూషణ్'ను అందుకున్న రాహుల్ బజాజ్, రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్ఐఏఎం) సంస్థలకు అధ్యక్షునిగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చైర్మన్‌గా కూడా పనిచేశారు.
రాహుల్ బజాజ్ మృతి పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సంతాపం తెలియజేశారు. ''విజయవంతమైన పారిశ్రామికవేత్త, పరోపకారి, బజాజ్ కంపెనీ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ గారికి నా హృదయపూర్వక నివాళులు. పారిశ్రామిక రంగానికి ఆయన ఎనలేని సేవ చేశారు. భగవంతుడు, ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నా'' అని గడ్కారీ ట్వీట్ చేశారు.
రాహుల్ బజాజ్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని సీఎం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ ఉద్రిక్తతలు: 'రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు' - అమెరికా హెచ్చరిక
- ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ
- ఆయనకు 49, ఆమెకు 18.. పాకిస్తాన్ ఎంపీ మూడో పెళ్లి
- పురిటి బిడ్డకి మొదటి స్నానం ఎప్పుడు చేయించాలి.. ఎలా చేయించాలి.. తీసుకోవలసిన జాగ్రత్తలేంటి
- బస్సు, రైలు, విమానాల్లో పెంపుడు జంతువులతో ప్రయాణించాలంటే నిబంధనలు ఇవీ..
- రాంగోపాల్ వర్మ: ఇది సినీ పెద్దల బెగ్గింగ్ - ప్రెస్ రివ్యూ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)