You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాయావతి
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తడంపై బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె ఒక ట్వీట్‌లో డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలని, పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని మాయావతి అన్నారు.
అయితే, దీనిపై రాజకీయాలు చేయడం మానాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఈ ఘటనను అడ్డంపెట్టుకుని రాజకీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, ఆరోపణలు చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాలు పక్కనబెట్టి ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని ఆమె తన ట్వీట్‌లో కోరారు.
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపం.. ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
పంజాబ్‌లో ప్రధానమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై తాము ఆందోళన చెందినట్లు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఓ ట్వీట్ పేర్కొంది.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు.
ఇటు ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డగింత వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఈ ఘటనను తీవ్రమైన భద్రతా లోపంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొనగా, దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ విచారం వ్యక్తం చేశారు.
కొందరు ఆందోళనకారులు హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చారని, దీని వెనక ఏదైనా కుట్ర ఉందనుకుంటే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తామని వెల్లడించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ మీద రేపు విచారణ జరగనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు రోడ్డు మార్గంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ర్యాలీకి వెళ్తుండగా, దారిలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రధానమంత్రి కాన్వాయ్ రోడ్డు మీద ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన తిరిగి ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)