తిరుపతిలో మిస్టరీ: భూమి లోపల ఉండాల్సిన బావి ఒరలు పైకి ఎందుకొచ్చాయంటే..

తిరుపతి నగరంలో ఒక బావి ఒరలు అకస్మాత్తుగా భూమి పైకి వచ్చాయి.

నవంబర్ 25వ తేదీ సాయంత్రం నగరంలోని శ్రీ కృష్ణ కాలనీలో భూమిలో నుంచి అకస్మాత్తుగా వరలు పైకి రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈశ్వరయ్య, మునెమ్మలు తాగు నీటి కోసం బావిని శుభ్రం చేస్తుండగా భూమిలో బావి చుట్టూ ఏర్పాటుచేసిన సిమెంట్ వరలు పైకి లేచి వచ్చాయి.

మొత్తం 18 ఒరల్లో 7 బయటకు వచ్చేశాయి. ఈ ఘటనలో మునెమ్మకు స్వల్పగాయాలయ్యాయి.

‘‘బావిని శుభ్రం చేసేందుకు బావిలోపలికి దిగాను. నీళ్లన్నీ తోడేసిన తర్వాత లోపలి నుంచి నీళ్లు తన్నుకు వస్తున్నట్లు, వరదలు వస్తున్నట్లు సౌండ్ వచ్చింది. నేను బావిలోపలి నుంచే అరిచి చెబుతున్నా. కానీ బయట ఉన్నవాళ్లకి వినిపించలేదు. అలా చెబుతుండగానే నేను కిందికి వెళ్లిపోయినట్లు అనిపించింది. మోకాళ్ల దాకా బుదర నీళ్లు వచ్చేశాయి. కొన్ని వరలు పైకి వచ్చేశాయి. భయంతో నేను కళ్లుతిరిగి పడిపోయా. మా ఆయన బయటి నుంచి అరుస్తున్నట్లు కొద్దికొద్దిగా వినిపించింది. లోపలికి నిచ్చెన వేశారు. నన్ను పట్టుకోమని అడుగుతున్నారు. నేను పట్టుకోలేనని చెప్పా. నువ్వు పట్టుకోకపోతే నేనూ దూకేస్తా అని అరిచాడు. దాంతో నేను ఎడమ చేత్తో నిచ్చెన పట్టుకున్నా. ఆయన పైకి లాగాడు. లోపల చాలా భయమేసింది. ఏడ్చాను. ఇక చనిపోతాను. ఇక నేను లేను అనిపించింది. మౌనంగా లోపలే ఉండిపోయా’’ అని మనెమ్మ చెప్పారు.

గత ఆరేడేళ్లుగా తాము ఇదే ఇంట్లో ఉంటున్నామని, ఏనాడూ ఇలాంటిది చూడలేదని ఈశ్వరయ్య అన్నారు.

ఈ బావి ఒక్కసారిగా పైకి లేవడం వెనుక కారణాలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం కనిపెట్టింది.

భూమిలో నుంచి వరలు పైకొచ్చిన ప్రదేశాన్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం సందర్శించింది.

భారీ వర్షాలు కురిసినప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో భూమి కింది పొరల్లో నీటి ఒత్తిడి పెరిగి ఇలా జరుగుతుందని జియాలజీ ప్రొఫెసర్ మధు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)