కాళీపట్నం రామారావు: కథా రచయిత కారా మాస్టారు ఇక లేరు

కథారచయిత, విమర్శకులు, కథానిలయం వ్యవస్థాపకులు కారా మాస్టారుగా సుపరిచితులైన కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం కన్నుమూశారు.

అత్యంత సరళమైన శైలిలో కథలు రాసే తెలుగు రచయితల్లో కారా మాస్టారిది ముందు వరుస.

అదొక ‘యజ్ఞం’

ఆయన రాసిన'యజ్ఞం' పాఠకులను ఆయనకు మరింత దగ్గర చేయడంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకూ ఎంపికయ్యేలా చేసింది.

ఉత్తరాంధ్రకు చెందిన కాళీపట్నం రామారావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సామాన్యుల జీవితాలను దగ్గర నుంచి చూసిన అనుభవంతో ఆయన తన కథలలో వాటినే ఇమిడ్చారు.

దోపిడీ ఎలా ఉంటుందనేది తన 'యజ్ఞం'లో ఆయన కళ్లకు కట్టడంతో విశేషాదరణ పొందింది. శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న సుందరపాలెం అనే గ్రామం నేపథ్యంగా ఈ 'యజ్ఞం' కథ రాశారు. గ్రామ పెద్ద, దళారి, దళిత రైతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఇదే కాకుండా రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన ఇతర రచనలూ ఆదరణ పొందాయి.

కథలకు కంచి

కారా మాస్టారు 1997లో 'కథా నిలయం' నెలకొల్పారు.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా సమకూరిన డబ్బు, మరికొందరు సాహితీవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలతో ఆయన కథానిలయాన్ని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు కథా నిలయంలో ఉన్న కథల సంఖ్య లక్ష దాటిపోయింది.

అనంతర కాలంలో kathanilayam.com అనే వెబ్‌సైట్ ఏర్పాటు చేసి కథలన్నీ డిజిటలైజ్ చేస్తున్నారు.

కథానిలయంలోని కథలలో సగానికిపైగా ఇప్పటికే డిజిటలైజ్ అయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)