కోవిడ్: ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’.. ఐసీయూలో పనిచేసే ఓ నర్సు అనుభవాలు

కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మరణాలు రెండు లక్షలు దాటిపోయాయి. కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది- ఈ పెను విపత్తును, మరణాలను రోజూ చూస్తున్నారు. ఒక కోవిడ్ వార్డులోని ఐసీయూలో సేవలు అందిస్తున్న వివేకి కపూర్ అనే నర్సు ఈ వైద్యసిబ్బందిలో ఒకరు. కరోనావైరస్ వ్యాప్తి తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఆమె బీబీసీతో పంచుకున్నారు. ఈ పోరాటంలో తను చూసిన చిన్న చిన్న విజయాలను, పరాజయాలను ఆమె ప్రస్తావించారు. కథనం వివేకి కపూర్ మాటల్లో...

దిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్ వార్డు ఐసీయూలో నేను నర్స్ ఇంచార్జిని. 25 మంది నర్సుల విధులను నేను పర్యవేక్షిస్తుంటాను. కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత చాలా మంది నర్సులు ఉద్యోగాలు మానేశారు. “మా జీతం చాలా తక్కువ, మాకొచ్చే జీతానికి ఇంత పెద్ద రిస్క్ తీసుకోలేం” అని వారు చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్‌తో ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. దిల్లీలోని చాలా ఆస్పత్రుల మాదిరే మా ఆస్పత్రి కూడా పడకలు ఖాళీ లేక చాలా మంది రోగులను తిప్పి పంపాల్సి వచ్చింది.

మా పనిభారం ఐదు రెట్లు పెరిగింది. నర్సులు అందరూ అదనపు సమయం పనిచేస్తున్నారు. మేం ఎప్పుడూ రావాల్సిన సమయానికే విధుల్లోకి వస్తాం. కానీ ఏ రోజూ ఆస్పత్రి నుంచి వెళ్లాల్సిన సమయానికి వెళ్లలేకపోతున్నాం.

నేను 22 ఏళ్లుగా నర్సుగా పనిచేస్తున్నాను. గతంలో పెద్దసంఖ్యలో రోగులను ఎమర్జెన్సీ వార్డుల్లో చేర్చే అనేక విపత్కర పరిస్థితుల్లో నేను సేవలు అందించాను. కానీ ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులను మాత్రం ముందెన్నడూ చూడలేదు. విధులు ముగిసే సమయానికి బాగా అలసిపోతున్నాను. పడక కూడా అక్కర్లేదు, ఎక్కడైనా నిద్రలోకి జారిపోయేంత అలసట వస్తోంది.

ప్రపంచంలోనే నర్సింగ్ అత్యున్నతమైన ప్రొఫెషన్ అని చెబుతుంటారు. మమ్మల్ని ‘సిస్టర్’ అని పిలుస్తారు. రోగులు మమ్మల్ని కుటుంబ సభ్యుల్లా చూస్తారు. ఎవరైనా రోగి ఆస్పత్రిలో చేరినప్పుడు వాళ్లు మొదట కలుసుకొనేది నర్సునే. మాతో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకుంటారు. కోవిడ్‌తో ఆస్పత్రికి వచ్చే రోగుల్లో చాలా భయం కనిపిస్తోంది. మేం వాళ్లకు దైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం.

నేనైతే రోగులకు సింహం, జింక కథ చెబుతుంటాను. “సింహం కన్నా జింక వేగంగా పరుగెత్తుతుంది, అయినా జింకపై సింహం దాడి చేయగలుగుతుంది. ఎందుకంటే జింక భయపడినప్పుడు తడబడుతుంది. అలా మీరు ప్రతికూల ఆలోచనలతో ఉంటే, వైరస్‌దే పైచేయి అవుతుంది” అని చెబుతూ వారికి ధైర్యం కలిగించేందుకు ప్రయత్నిస్తుంటాను.

నర్సు కోసం పిలిచామని, ఆమె వెంటనే రాలేదని గతంలో కొన్నిసార్లు రోగులు ఫిర్యాదు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లు మాకు ఎంతగానో సహకరిస్తున్నారు.

మేం ఎంతో కష్టపడుతున్నామని వాళ్లకు తెలుసు. కొన్నిసార్లు మమ్మల్ని “భోజనం చేశారా, లేదా” అని అడుగుతుంటారు. అలాగే “నీళ్లో, టీయో తాగండి” అని చెబుతుంటారు.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో వృద్ధులు ఎక్కువ మంది ఆస్పత్రికి వచ్చేవారు. ఇప్పుడు 15-17 ఏళ్ల చిన్నవయసు వాళ్లు కూడా ఇన్‌ఫెక్షన్‌తో వస్తున్నారు. ఇది చాలా బాధ కలిగిస్తోంది. ప్రతి రోగినీ కాపాడేందుకు చివరి వరకూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం.

ఎవరైనా రోగి కోలుకుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. వారికి నేను కూడా నా వంతు సేవలు అందించగలిగాని, నా కష్టం ఫలితాన్ని ఇచ్చిందని అనుకొంటుంటాను.

ఎవరైనా రోగి చనిపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. చిన్న వయసువారు చనిపోతే ఇంకా ఎక్కువ బాధ పడతాను. అలాంటివారు చనిపోయిన ప్రతిసారీ నా గుండె తరుక్కుపోతుంది.

ఇటీవల నా కూతురి ఫ్రెండ్ తండ్రి చనిపోయారు. ఆయన యువకుడు. ఎంతో బాధపడ్డాను. ఆయన కుటుంబాన్ని ఓదార్చడం తప్ప నేను చేయగలిగింది ఏముంది?

గత వారం ఆక్సిజన్ ప్రెజర్ పడిపోయి మా ఆస్పత్రిలో 25 మంది చనిపోయారు. నాకు నిస్సహాయంగా అనిపించింది. బాగా కోపం కూడా వచ్చింది.

భారతీయురాలిగా ఎప్పుడూ గర్వించేదాన్ని. కానీ దేశంలో ఇప్పుడు జరుగుతున్నది చూస్తే గుండె బద్దలవుతోంది. నాయకులే దీనికి బాధ్యులు. వాళ్లకు కావాల్సిందల్లా ఎన్నికల్లో గెలవడమే.

నా ఉద్యోగాన్ని నిరంతర టెన్షన్‌తో కూడిన ఉద్యోగంగా కోవిడ్ మహమ్మారి మార్చేసింది. దీనివల్ల నా కుటుంబ జీవితంలో కూడా ఒత్తిడి పెరిగిపోయింది.

నా భర్త ఒక ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడు. రెండు వారాలుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. దీంతో ముగ్గురు పిల్లలను, ఇంటి పనులను ఒక్కదాన్నే చూసుకోవాల్సి వస్తోంది.

ఇంతలో మధురలో నివసించే 90 ఏళ్ల మా అమ్మకు కరోనావైరస్ సోకడం, ఆమెను ఆస్పత్రిలో చేర్చాల్సి రావడం, వెంటిలేటర్‌పై ఉంచడం నాకు చాలా ఆందోళన కలిగించాయి. ఆమె కోలుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ప్రాణాంతక వైరస్‌ను 90 ఏళ్ల మనిషి ఓడించారు. ఇక్కడ నేను అందిస్తున్న సేవలు, నా రోగుల ఆశీస్సుల వల్లే అక్కడ మా అమ్మ కోలుకున్నారు.

నా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారి ప్రేమ, ఆప్యాయతలే నన్ను నడిపిస్తున్నాయి. నా ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందని వాళ్లు చెబుతుంటారు. అదే సమయంలో- మేం చేస్తున్న పని ఎంత ముఖ్యమైనదో కూడా అర్థం చేసుకొంటారు. “కరోనావైరస్ సోకుతుందనే భయంతో మేం ఇళ్లలోంచి అడుగు బయటపెట్టట్లేదు. కానీ నువ్వు రోజూ ఇంట్లోంచి వైరస్ దగ్గరకు వెళ్తావు” అని అభినందనపూర్వకంగా అంటుంటారు.

మా పొరుగింటి మహిళ ఈమధ్య నాతో ఓ మాట చెప్పారు. గతంలో ఆమె తన కుటుంబానికి దీర్ఘాయుష్షు ఇవ్వాలని దైవాన్ని ప్రార్థిస్తూ రోజూ సాయంత్రం ఒక మట్టి దీపం పెట్టేవారు. కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆమె నా క్షేమం కోరుతూ ఇంకో దీపం కూడా పెడుతున్నారు. ఇలాంటివి నా పనికి, జీవితానికి సార్థకతను చేకూరుస్తాయి.

(వివేకి కపూర్‌తో దిల్లీలోని బీబీసీ ప్రతినిధి గీతా పాండే మాట్లాడి అందించిన కథనం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)