కోవిడ్: దిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్

కరోనావైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది.

ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం(ఏప్రిల్ 26) ఉదయం 6 గంటల వరకు ఈ లాక్‌డౌన్ ఉంటుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

దిల్లీ కరోనావైరస్ నాలుగో వేవ్‌ను ఎదుర్కొంటోందని.. గత 24 గంటల్లో 23,500 పాజిటివ్ కేసులు వచ్చాయని కేజ్రీవాల్ చెప్పారు. ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలిందని తాను చెప్పకపోయినా దాదాపు అలాంటి పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.

''ఇలా రోజుకు సుమారు 25 వేల కేసులు వస్తే వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

ఇప్పటికే హాస్పిటల్ బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది.

దిల్లీలో ఆసుపత్రి వ్యవస్థ పరిమితికి మించిపోయేలా కేసులొస్తున్నాయి.

ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలకుండా ఆపడానికి కఠిన చర్యలు తప్పవు'' అని కేజ్రీవాల్ అన్నారు.

కాగా, ఇప్పటికే దిల్లీలో రెండు రోజుల వీకెండ్ లాక్‌డౌన్ విధించారు.

నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేశారు. అయినా, కేసుల తీవ్రత తగ్గకపోవడంతో వారం రోజుల పాటు కట్టుదిట్టమైన కర్ఫ్యూ అమలుకు నిర్ణయించారు.

లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దిల్లీ వదిలి వెళ్లొద్దు.. వలస కూలీలకు కేజ్రీవాల్ విన్నపం

లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వలస కార్మికులకు ఓ విన్నపం చేశారు.

ఎవరూ దిల్లీ వదిలి వెళ్లిపోవద్దని.. ఈ వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడతాయని, లాక్‌డౌన్ పొడిగించే అవసరం రాదని ఆశిస్తున్నానని అన్నారు.

వలస కూలీల బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు.

వివాహ వేడుకలకు 50 మందికే అనుమతి

లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు అనుమతులుంటాయి.

వివాహాలకైతే 50 మంది వరకు అనుమతి ఉంటుంది.

వివాహ ఆహ్వాన పత్రిక చూపిస్తేనే వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకైతే 20 మందినే అనుమతిస్తారు.

మద్యం దుకాణాల వద్ద బారులు

దిల్లీలో ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం లేదని తన ట్వీట్‌లో పేర్కొంది.

వేలల్లో కేసులు..

దిల్లీలో గత వారం రోజులుగా కేసుల తీవ్రంత విపరీతంగా పెరిగింది. ఆదివారం ఒక్క రోజే 25,462 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అంతకుముందు రోజు 24,375 కేసులు రికార్డయ్యాయి.

ఏప్రిల్ 11 నుంచి ప్రతి రోజూ 10 వేలకు మించి పాజిటివ్ కేసులు వస్తుండడం.. రోజువారీ కొత్త కేసులతో పోల్చితే కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంటుండడంతో ఆసుపత్రి వ్యవస్థపై ఒత్తిడి పడుతోంది.

ఆక్సిజన్, ఆసుపత్రి పడకల కొరత తీవ్రంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)