You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: 'పార్టీ ఎంజాయ్ చేయడానికి వెళ్లే ముందు ఒకసారి ఐసీయూలో డాక్టర్లను గుర్తు చేసుకోండి'
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
లాన్స్‌లాట్ పింటో ముంబయిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన పల్మనాలజిస్ట్... అంటే శ్వాసకోశ వైద్య నిపుణుడు.
కోవిడ్ కేసుల కారణంగా 2020 ఏడాదిలో చాలావరకూ ఆయన తీరిక లేకుండా గడిపారు.
ఈ జనవరికి వచ్చేసరికి కుటుంబంతో కాస్త సేద తీరేందుకు సమయం దొరికందని ఆయనకు అనిపించింది. అప్పటికి దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పడిపోయింది. అంతకుముందు గరిష్ఠంగా సెప్టెంబర్‌లో ఇది 90 వేలుగా ఉంది.
కానీ, మార్చిలో పరిస్థితి మళ్లీ మలుపు తీసుకుంది. కుటుంబంతో సేదతీరాలన్న పింటో ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఏప్రిల్ 4న రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. కోవిడ్ సంక్షోభం మొదలయ్యాక దేశంలో ఎన్నడూ కేసుల సంఖ్యలో ఇంతటి తీవ్రత లేదు. పైగా వీటిలో సగం వరకూ కేసులు ముంబయిలోనే వస్తున్నాయి.
ఇప్పుడు పింటో ఫోన్ పదే పదే మోగుతోంది. ఆసుపత్రిలో పడకలు కావాలంటూ చాలా మంది కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్లు చేస్తున్నారు.
‘‘మా ఆసుపత్రుల్లో అస్సలు ఖాళీ లేదు. వాళ్లు అలా ఫోన్లు చేయడంలో తప్పు లేదు. సాయం దొరుకుతుందేమోనన్న ఆశతో వాళ్లు అలా చేస్తున్నారు. ఇంట్లో ఓ మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కడైనా సాయం దొరుకుతుందనిపిస్తే, ఎవరమైనా అడుగుతాం కదా’’ అని పింటో అంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కోసం తమ ఆసుపత్రిలో సిబ్బంది అంతా ఇప్పుడు సన్నద్ధమై పనిచేస్తున్నారని పింటో అన్నారు. తమ సిబ్బందిలో చాలా మంది వ్యాక్సీన్ వేయించుకున్నారని, నిబంధనలను కూడా మార్చామని చెప్పారు.
‘‘కానీ, మేం దీనికి మానసికంగా సన్నద్ధం కాలేదు. మేము చేయగలిగిందంతా చేస్తున్నాం. గత ఏడాది ఉన్నంత మానసిక స్థైర్యంతో ఇప్పుడు లేం’’ అని అన్నారు.
దేశ రాజధాని దిల్లీ, ఇతర ప్రాంతాల్లో పరిస్థితి కూడా అలాగే ఉంది.
‘‘ఆసుపత్రిల్లో చేరికయ్యేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. కొన్ని రోజులుగా దిల్లీలో రోజువారీగా 3,500 కేసులు వస్తూ ఉన్నాయి. ముంబయిలో జరిగిందే.. దిల్లీలోనూ జరుగుతోంది’’ అని గురుగ్రామ్‌లోని అర్టెమిస్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగానికి హెడ్‌గా ఉన్న రేష్మా తివారీ బసు చెప్పారు.
దిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రులు నిండిపోయాయి...
కేసుల ఉధృతి ఈ స్థాయిలో పెరుగుతుందని ఊహించలేదని, కరోనా సంక్షోభం ముగిసినట్లుగా జనాలు ప్రవర్తిస్తుండటం చిరాకు కలిగిస్తోందని డాక్టర్ బసు అన్నారు.
అయితే చాలా నగరాల్లో జనజీవితం సాధారణంగానే కనిపిస్తోంది. రెస్టారెంట్లు, నైట్ క్లబ్‌లు, మార్కెట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. మాస్క్‌లు వేసుకుంటూ, భౌతిక దూర నిబంధనలు పాటిస్తున్నవారు చాలా తక్కువగానే ఉంటున్నారు.
జనవరి, ఫిబ్రవరిలో కేసులు తగ్గిపోవడంతో వచ్చిన మంచి అవకాశాన్ని భారత్ జారవిడుచుకుందని మేదాంత ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగం ఛైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ యతిన్ మెహతా అన్నారు.
‘‘భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసుకుని... పరీక్షలు, ట్రేసింగ్, వ్యాక్సీనేషన్‌ను పెంచేందుకు ఆ సమయం ఉపయోగించుకోవాల్సింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కానీ, అలా జరగలేదు. సెకండ్ వేవ్ మరింత ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫిబ్రవరికి ముందు డాక్టర్ మెహతా కూడా కుటుంబంతో కాస్త ఎక్కువ సేపు గడపగలిగారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా తీరిక లేకుండా మారిపోయింది.
‘‘ఇలా ఎంతకాలం కొనసాగగలమన్నది నాకూ అర్థం కావడం లేదు. సాధ్యమైనదంతా చేస్తాం. కానీ, సెకండ్ వేవ్ మనల్ని తీవ్ర స్థాయిలో పరీక్షించబోతోంది’’ అని ఆయన అన్నారు.
‘‘ఏ ఉద్యోగమైనా సరే... రోజులో 24 గంటలు, వారంలో ఏడు రోజులూ చేస్తూ పోతే ఎలా ఉంటుంది? అది కూడా వంద రెట్ల ఒత్తిడి మధ్య. వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి అదే’’ అని డాక్టర్ మెహతా అన్నారు.
వైద్య సిబ్బంది మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
‘‘మేం నేరుగా సంక్షోభంలోకి దూకి, మా పని మేం చేసేస్తున్నాం. మాకు సమస్యలు లేవనుకుంటే పొరపాటే’’ అని అన్నారు.
‘‘కరోనా వచ్చిన మొదట్లో భయం ఉండేది. అయితే, ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతున్న కొద్దీ ఆ భయం దూరమైంది. కానీ, ఇప్పుడు దీనికి అంతు అన్నది కనుచూపు మేరలో కనిపించడం లేదు’’ అని పింటో అన్నారు.
నవంబర్‌లో కరోనా ఉధృతి పెరిగింది. అయితే, అప్పుడప్పుడే వ్యాక్సీన్లు బయటకు వస్తుండటంతో వైద్య సిబ్బందిలో కూడా ఆశలు చిగురించాయి. కానీ, ఇప్పుడు అవి ఆవిరవుతున్నాయి.
ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియని యుద్ధంలా ఉందని ఆయన అంటున్నారు.
ఇప్పటివరకూ 8 కోట్ల డోసుల వ్యాక్సీన్లు ఇచ్చారు. వీటిలో చాలావరకూ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, 60 ఏళ్ల వయసు పైబడినవారే ఉన్నారు. ఇప్పుడు 45 ఏళ్లు పైబడ్డవారికి వ్యాక్సీన్లు ఇస్తున్నారు.
కరోనావ్యాప్తి వేగాన్ని కట్టడి చేయాలంటే వ్యాక్సీనేషన్ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ సంక్షోభ పరిస్థితుల్లో సేవలందిస్తున్న నర్సులు, వార్డు బాయ్‌లు... ఇలా అందరూ విపరీతమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
‘‘ఎన్నికలు జరుగుతుండటంతో నిబంధనలను అందరూ ఉల్లంఘిస్తున్నారు. గత కొన్ని వారాల్లో నిర్లక్ష్యం ఎక్కువైంది. జనం చేజేతులారా ముప్పును కొనితెచ్చుకుంటున్నారు’’ అని కేరళలోని ఎర్నాకుళం మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తున్న విద్యా విజయన్ అన్నారు.
‘‘గత ఏడాది అంతా ఒత్తిడిలో పనిచేస్తున్నాం. జనవరిలో అంతా కుదుటపడుతున్నట్లు అనిపించింది. కానీ, ఇప్పుడు మళ్లీ యుద్ధం మొదలైనట్లు అనిపిస్తోంది. మేం వెనక్కితగ్గం. జనానికి నాది ఒకటే విజ్ఞప్తి. బయట పార్టీలు చేసుకునేందుకు వెళ్లే ముందు... ఐసీయూల్లో తీరిక లేకుండా పనిచేస్తున్న మా గురించి ఆలోచించండి’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ఐపీఎల్: కొత్త రూల్స్ కెప్టెన్ కాళ్లకు బంధాలా... బ్యాట్స్మన్లకు పరుగుల పంటేనా?
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)