‘హోం మంత్రి నెలానెలా రూ.100 కోట్లు వసూలు చేయమన్నారు’.. సుప్రీంకోర్టులో ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పిటిషన్

మహారాష్ట్ర ప్రభుత్వం తనను హోంగార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో తాను ప్రస్తావించిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా ఆయన కోర్టును కోరారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నెలా నెలా రూ.100 కోట్లు వసూలు చేసిపెట్టాలని మహారాష్ట్ర పోలీసులకు టార్గెట్ పెట్టారంటూ పరమ్‌వీర్ సంచలన ఆరోపణలు చేస్తూ ఇటీవలే ఉద్ధవ్ ఠాక్రేకు ఇటీవల ఆ లేఖ రాశారు.

సుప్రీం కోర్టులో సోమవారం పరమ్‌వీర్ సింగ్ తాజా పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది.

అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి విషయంపై నిష్పాక్షికంగా, ఎలాంటి జోక్యం లేకుండా విచారణ జరిగేలా సీబీఐతో దర్యాప్తు చేయించాలని పరమ్‌వీర్ సింగ్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.

పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు

ముంబయి పోలీస్ కమిషనర్ పదవి నుంచి తనను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పరమ్‌వీర్ సింగ్ సుప్రీం కోర్టును కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఈ బదిలీ ఆదేశాలు ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

భారత రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్‌ను ఇది ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

ఇదివరకు ‘టీఎస్ఆర్ సుబ్రమణ్యన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ కేసులో కమిషనర్, డీజీపీ పదవులకు కనీస పదవీకాలం రెండేళ్లు ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని... మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాన్నిఉల్లంఘించిందని పరమ్‌వీర్ వాదిస్తున్నారు.

నిర్ధారిత పదవీకాలంతో సున్నితమైన పదవుల్లో ఉన్న అధికారులను బదిలీ చేసే విషయంలో సహేతుకమైన కారణాలతో పాటు తగిన స్థాయిలో సంప్రదింపులు కూడా జరిగి ఉండాలని సుప్రీం కోర్టు చాలా తీర్పుల్లో పేర్కొందని పరమ్‌బీర్ సింగ్ తన పిటిషన్‌లో గుర్తుచేశారు.

లోక్‌సభలో గందరగోళం

పరమ్‌వీర్ సింగ్ రాసిన లేఖపై సోమవారం లోక్‌సభలో గందరగోళం రేగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది.

లేఖలోని ఆరోపణలపై సీబీఐ విచారణ జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

‘‘ముంబయిలోని 1,742 బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలా నెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాఝేకు రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి చెప్పారని పరమ్‌వీర్ సింగ్ రాసిన లేఖలో ఉంది’’ అని లోక్‌సభలో జీరోఅవర్ సమయంలో బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మహారాష్ట్రలోని అధికార కూటమిలో సభ్యులైన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గందరగోళం సృష్టించారు.

మహారాష్ట్రలో ప్రభుత్వమే అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని, ఈ విషయమై రాష్ట్ర సీఎం ఇంతవరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కోటక్ విమర్శించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, మహారాష్ట్ర హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు.

‘‘ఇది తీవ్రమైన విషయం. దీన్ని ఒక రాష్ట్ర అంతర్గత అంశంగా పరిగణించలేం. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పరమ్‌వీర్ సింగ్ తన లేఖలో స్పష్టంగా చెప్పారు’’ అని బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)