వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు, ఆయన కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..

బీమా కోరెగావ్ కేసులో విరసం నేత, కవి వరవరరావుకు బోంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న వరవరరావుకు ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ బోంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఆయనకు ఆరు నెలల పాటు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే, ఆయన బెయిల్ సమయంలో ముంబయిలోనే ఉండాలని, విచారణకు అందుబాటులో ఉండాలని షరతులు విధించింది.

వరవరరావు వయసు, ఆరోగ్య పరిస్థితులతో పాటు తలోజా జైల్ హాస్పిటల్‌లో తగిన సౌకర్యాలు లేకపోవడాన్ని బెయిల్ మంజూరు చేయడానికి సహేతుక కారణాలుగా భావిస్తున్నట్లు కోర్టు చెప్పిందని 'లైవ్‌ లా' వెబ్‌సైట్ వెల్లడించింది.

వరవరరావుకు బెయిల్ నిరాకరిస్తే... రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సంక్రమించిన మానవ హక్కులు, ఆరోగ్య హక్కు పరిరక్షణ బాధ్యతను విస్మరించినట్లేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ బెయిల్‌‌ రావడం సంతోషకరమే కానీ, కోర్టు పెట్టిన షరతులతో ఆయనకు చాలా సమస్యలు ఎదురవుతాయని వరవరరావు బంధువు, 'వీక్షణం' పత్రిక సంపాదకులు వేణుగోపాల్ అన్నారు.

"రెండున్నరేళ్లుగా 2018 ఆగస్టు 25న ఆయన్ను అరెస్టు చేసినపప్పటి నుంచీ ఇది అబద్ధపు కేసు అని చెబుతూ వచ్చాం. బెయిల్ కోసం వివిధ కోర్టుల్లో ఐదు సార్లు పిటిషన్లు వేశాం. అన్ని పిటిషన్లూ తిరస్కరణకు గురయ్యాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి, వయసు, కోవిడ్ వచ్చినందున గత ఆగస్టులో మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేశాం. అది హైకోర్టుకు వచ్చింది. హైకోర్టులో మూడు నెలలుగా వాదనలు జరుగుతున్నాయి. మొదట ఆయన్ను ఆసుపత్రిలో చేర్చాలని కోర్టు చెప్పింది. నవంబర్ నుంచి ఆయన నానావతి ఆసుపత్రిలో ఉన్నారు. ఇన్నాళ్ల తరువాత బెయిల్ రావడం సంతోషమే. ఆయన కుటుంబంతో గడిపే అవకాశం వచ్చింది" అని వేణుగోపాల్ చెప్పారు.

"ఈ బెయిల్ చిన్న ఊరట మాత్రమే. ఎందుకంటే, ఈ బెయిల్ చాలా షరతులతో కూడినది. వాటిలో చాలా ముఖ్యమైనది, ఆయన ముంబయిలోనే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పరిధిలోనే ఉండాలనేది. ఆయన సందర్శకులను కలవకూడదు, కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే కలవాలి. బొంబాయిలో ఇల్లు తీసుకుని ఆయన, మా అక్క కలిసి ఉండడం కష్టం. ఆమెకు 72 ఏళ్లు, ఆయనకు 80 ఏళ్లు. ఇద్దరికీ ఆరోగ్య సమస్యలున్నాయి. వారికి తోడుగా ఇంకెవరైనా ఉండాలి. బెయిల్ షరతుల వల్ల ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ అసంతృప్తి ఉన్నా, బెయిల్ రావడమే ఒక సంతోషకరమైన విషయం. ఊరట. అంతేకాక, ఇది ఒక ముందస్తు సూచనగా, ఆయన కంటే రెండేళ్ళు పెద్ద అయిన స్టాన్ స్వామి, పార్కిన్సన్ వ్యాధితో ఇప్పటికే చేతులు వణుకుతూ ఉన్న వ్యక్తి, 70 ఏళ్ల దాటిన గౌతమ్, ఆనంద్.. ఇలాంటి వాళ్లంతా ఉన్నారు కాబట్టి, వారికి ఆరోగ్య కారణాలతో అయినా బెయిల్ ఇవ్వాలని డిమాండ్‌కు ఇవాళ్టి బెయిల్ ఒక ఊతం ఇస్తుంది. అందువల్ల మేం సంతృప్తి పడుతున్నాం" అని వేణుగోపాల్ అన్నారు.

"మా అంతిమ డిమాండ్ ఇవాళ మొదటిసారి చేస్తోంది కాదు. రెండున్నరేళ్ల క్రితం తొలి అరెస్టు సమయంలోనే ఇది అబద్ధపు కేసు అని, దీనిని కొట్టేయాలి అన్నాం. తరువాత సుప్రీం కోర్టులో రొమిల్లా థాపర్ కేసులో కూడా సాక్ష్యాధారాలు సరైనవి కావు, కాబట్టి వాటిని విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించాలని అన్నాం. ఆ తరువాత శరత్ పవార్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, పెగాసస్ సాఫ్టువేర్ అదే విషయం చెప్పాయి. వారం క్రితం ఆర్సనాల్ కన్సల్టింగ్ అదే విషయం చెప్పింది. ఈ కేసును ఎత్తేయాలనేది మా డిమాండ్. మాకు వరవర రావుతో మళ్లీ కలసే అవకాశం వస్తోంది. ఆయన ఆరోగ్యం, వయసు రిత్యా ఇది మంచి పరిణామం" అని ఆయన చెప్పారు.

2018లో అరెస్ట్

వరవరరావు బీమా-కోరేగావ్‌ అల్లర్ల కేసులో 2018 జనవరిలో అరెస్టయ్యారు. అప్పటి నుంచీ పోలీసు కస్టడీలోనే ఉన్నారు.

ఆయనపై తీవ్రవాద నిరోధక చట్టం(యుఏపీఏ) ఆరోపణలు మోపారు.

అయితే ఆరోగ్య కారణాలరీత్యా వరవరరావును విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు.

విరసం నేత, కవి వరవరరావుకు బెయిల్‌ ఇవ్వడం కుదరదని గత ఏడాది నవంబరులో బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది.

ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వీడియో కాల్‌ ద్వారా పరిశీలిస్తారని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్లి వైద్య సహాయం అందిస్తారని అప్పుట్లో కోర్టు తెలిపింది.

వరవరరావు మూత్ర సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయనకు డైపర్స్‌ వాడాల్సి వస్తోందని కుటుంబం తరఫు న్యాయవాది గతంలో వాదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)