ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు లవ్ జిహాద్ పేరుతో అమాయక ముస్లిం యువకుడి జీవితంతో ఆటలు ఆడుకుంటున్నారా?

    • రచయిత, చింకీ సిన్హా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సాయంత్రం అవుతోంది. ఆ ఇంట్లో చాయ్ చేసేందుకు ఓ మహిళ పొయ్యి వెలిగించారు. ఒవైస్ అహ్మద్ ఇల్లు అది. ఆయన ఇంట్లో లేరు.

ఒవైస్ తండ్రి రఫీక్ ఇంటి పెరడులో ఓ మంచం వేసుకుని కూర్చుని ఉన్నారు. 'మా తరఫున ఎవరూ గొంతెత్తరు. మా కొడుకు విషయంలో తప్పు చేశారు'' అని ఆయన అన్నారు.

తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఆయనలో కనిపించినా, ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు.

''మేం ముస్లింలం. ఇది వాస్తవం. మేం పెద్దగా ఏదీ ఆశించం'' అని ఆయన అన్నారు.

ఒవైస్‌ను లొంగిపోవాలని బెదిరించేందుకు కొన్ని రోజుల పాటు రఫీక్‌ను పోలీస్ స్టేషన్‌లో పెట్టారని ఆ ఇంట్లోని మహిళ చెప్పారు. రఫీక్ భోజనం చేస్తుండగానే మధ్యలోనే పట్టుకుపోయారని వివరించారు.

రఫీక్ రోజు కూలీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షరీఫ్ నగర్‌ ఊరు వారిది. గ్రామంలో వారికి కాస్త భూమి ఉంది.

ఒవైస్‌కు 21 ఏళ్లు. ఉపాధి కోసం రకరకాల పనులు చేసేవారు ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగుతున్నారు.

ప్రస్తుతం ఒవైస్‌పై కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఒవైస్ ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు.

ఒవైస్ పొరుగు ఇంట్లో ఉండే టీకారామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒవైస్ అరెస్టయ్యారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో అక్రమ మత మార్పిడులపై నిషేధం విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్సుకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గత ఏడాది నవంబర్ 28న ఆమోద ముద్ర వేశారు. దీన్నే 'లవ్ జిహాద్' చట్టం అని కూడా పిలుస్తున్నారు. ఇది వచ్చిన కొన్ని గంటలకే దీని కిందే ఒవైస్ అరెస్టయ్యారు.

అక్రమ మత మార్పిడులను నాన్‌బెయిలెబుల్ నేరాలుగా పరిగణిస్తూ, దోషులకు పదేళ్ల వరకూ శిక్ష విధించేలా ఈ చట్టాన్ని తెచ్చారు.

తన కూతురు ఆశాను ఒవైస్ 'బలవంతంగా, లొంగదీసుకుని' ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించారని టీకారాం ఫిర్యాదులో ఆరోపించారు. ఆశాను పెళ్లి చేసుకోనివ్వాలని, ఆమెను మతం మారనివ్వాలని తమను బెదిరించారని కూడా పేర్కొన్నారు.

బరేలీలోని దేవ్‌రైనా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

ఒవైస్, ఆశా ఒకే బడిలో చదువుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు తెలుసు. వాళ్ల ఊరిలో సుమారు 1200 ఇళ్లు ఉన్నాయి. జనాభా 5 వేల వరకూ ఉంటుంది. వీరిలో ముస్లింలు 400 మంది దాకా ఉంటారని గ్రామ సర్పంచ్ ధ్రువ్ రాజ్ చెప్పారు.

గత ఏడాది జూన్‌లో ఆశాకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ ఒవైస్ ఆమెను ఇప్పటికీ వేధిస్తూ ఉన్నారని టీకారాం ఫిర్యాదులో ఆరోపించారు.

ఒవైస్‌పై పోలీసులు సెక్షన్ 504, సెక్షన్ 506తోపాటు కొత్తగా తెచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. కొత్త చట్టం ప్రకారం నిర్దోషిని అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుంది.

ఇక టీకారాం తన కూతురిని ఒవైస్ కిడ్నాప్ చేసినట్లు కూడా గతంలో కేసు పెట్టారు. కానీ, ఆ కేసును పోలీసులు మూసేశారు.

ఒవైస్‌కు నలుగురు అన్నలు ఉన్నారు. వాళ్లు ఎవరూ ఆరో తరగతికి మించి చదువుకోలేదు. ప్రభుత్వ బడులు ఉచిత విద్య అందిస్తున్నా, కుటుంబ పోషణ కోసం వారు చిన్న వయసులోనే పనులకు వెళ్లాల్సి వచ్చింది.

2019 అక్టోబర్‌లో ఆశా తమ ఇల్లు విడిచి వెళ్లారు. ఆమె కుటుంబం ఒవైస్‌పై అప్పుడే కిడ్నాప్ కేసు పెట్టింది. పోలీసులు బరేలి రైల్వే స్టేషన్‌లో ఆశాను గుర్తించి, తీసుకువచ్చి ఇంట్లో అప్పగించారు.

ఇంట్లో వాగ్వాదం తర్వాత తాను వెళ్లిపోయానని... బరేలీ, దిల్లీ రైల్వే స్టేషన్లలో కొన్ని రోజులు గడిపానని మెజిస్ట్రేట్ ముందు ఆశా వాంగ్మూలం ఇచ్చారు. ఒవైస్‌కు ఈ విషయంతో సంబంధం లేదని చెప్పారు. పోలీసులు అప్పుడు కేసును మూసేశారు.

ఆశాకు గత ఏడాది జూన్‌లో ఆమె సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగిందని గ్రామ సర్పంచ్ చెప్పారు.

టీకారాంను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు, వారి ఇంటి గేటు వద్ద ఓ మహిళ కనిపించారు. తాను ఆ ఇంటికి అతిథినని, టీకారాం ఎక్కడికి వెళ్లారో తెలియదని ఆమె చెప్పారు. ఆయన ఫోన్ నెంబర్ అడిగినా, ఇవ్వలేదు. అయితే, టీకారాం కుటుంబం మీడియాతో మాట్లాడటం లేదని నాకు అదివరకే గ్రామస్థులు చెప్పారు.

తన కొడుకుపై కేసు విషయంలో టీకారాం కుటుంబాన్ని రఫీక్ నిందించడం లేదు. పోలీసుల బలవంతం వల్లే వాళ్లు ఒవైస్‌పై ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు.

టీకారాం ఫిర్యాదులో ఆశా వాంగ్మూలాలు లేవు. ప్రదేశాలు, తేదీలు కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు. ఒవైస్, ఆశా 12వ తరగతి వరకూ కలిసి చదువుకున్నారని టీకారాం ఫిర్యాదులో పేర్కొన్నారు.

కానీ, ఆశా, తాను ఎనిమిదో తరగతి వరకే కలిసి చదువుకున్నామని, బడిలో ఉన్నప్పుడు తాము స్నేహితులమని ఒవైస్ చెప్పారు.

''అందుకే నాపై కేసు పెట్టారనుకుంటా. నాపై కిడ్నాప్ కేసు ఎందుకు పెట్టారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆ కేసులో 2019 అక్టోబర్‌లో నన్ను నాలుగైదు రోజులు పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. నేను అమాయకుడిని'' అని ఒవైస్ అన్నారు.

ఆ తర్వాత మళ్లీ కొత్త ఆర్డినెన్స్ కింద పోలీసులు ఒవైస్‌ను అరెస్టు చేశారు. తన న్యాయవాది మహమ్మద్ ఆరిఫ్ సలహా మేరకు స్టేషన్‌కు వెళ్లేంతవరకూ ఒవైస్‌కు ఆ విషయం తెలియదు. అప్పుడు ఒవైస్ 21 రోజులపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది.

''నా మీద కేసు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. వాళ్లకే బాగా తెలుసు అనుకుంటా. భయంగా ఉంది. నేను ఏ తప్పూ చేయలేదు'' అని ఒవైస్ అన్నారు.

ఒవైస్ బహేరీలో కాలేజీకి వెళ్లేవారు. కానీ, ఆయన చదువు మానేశారు.

ఒవైస్ తండ్రి రఫీక్‌కు 70 ఏళ్లు. తన కొడుకుపై పెట్టిన కేసు ముస్లింలపై జరుగుతున్న కుట్రలో భాగమని ఆయన అన్నారు.

''ఎఫ్‌ఐఆర్‌లో ఆ అమ్మాయి వాంగ్మూలం లేదు. ఆధారాలు లేవు. అంతా మౌనమే. అన్యాయాల గురించి గొంతు ఎత్తేందుకు నేను భయపడను'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఒవైస్‌పై కేసు విషయం మాట్లాడేందుకు ఆ గ్రామంలో ఎవరూ సరిగ్గా ముందుకు రావడం లేదు. గ్రామ సర్పంచ్‌ను కలవాలని రఫీక్ సూచించారు.

కానీ, పంచాయతీ ఎన్నికలు సమీపస్తున్నందున తాను ఈ కేసు గురించి మాట్లాడలేనని సర్పంచ్ ధ్రువ్ రాజ్ అన్నారు. తనకు బీజేపీ పార్టీతో సంబంధాలున్నాయని ఆయన చెప్పారు.

'ఒవైస్ మంచి కుర్రాడు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. పైనుంచి చాలా ఒత్తిడి ఉంది'' అని ఆయన అన్నారు.

ఇన్నేళ్లుగా షరీఫ్ నగర్‌లో ఒకే మతాంతర వివాహం జరిగిందని... అది హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య జరిగిందని ధ్రువ్ చెప్పారు. ఆ అమ్మాయి హిందూ మతానికి కూడా మారిందని వివరించారు.

అయితే, ఆ అమ్మాయి మరెవరో కాదు. రఫీక్ మనవరాలు.

''అది మూణ్నాలుగు ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లికి అప్పట్లో అభ్యంతరాలు ఎదురయ్యాయి. కానీ, వాళ్లు పెళ్లి చేసుకున్నారు'' అని రఫీక్ చెప్పారు.

ఇక ఒవైస్‌పై నమోదైన కేసు విచారణాధికారి మరో జిల్లాకు బదిలీ అయ్యారని దేవ్‌రైనా పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు చెప్పారు. ఈ కేసు గురించి మరింత మాట్లాడేందుకు వాళ్లు నిరాకరించారు.

కొత్త చట్టం గురించి మాత్రం వారు మాట్లాడారు. ఈ చట్టం రాకముందు కూడా పెళ్లి ద్వారా బలవంతపు మత మార్పిడులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల వచ్చాయని చెప్పారు. అలాంటి ఫిర్యాదులపై కిడ్నాప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేవాళ్లమని వివరించారు.

సాక్ష్యాధారాలను సేకరించి, కోర్టులో సమర్పించడమే తమ పని అని దేవ్‌రైనా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి ఆర్‌కే సింగ్ అన్నారు.

కానీ, ఒవైస్‌ను లొంగిపోవాలని బెదిరించేందుకు ఆయన తండ్రి రఫీక్‌ను తీసుకువచ్చిన పోలీస్ స్టేషన్ దేవ్‌రైనానే.

ఒవైస్ ఆ తర్వాత బహేరీ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఆయన్ను దేవ్‌రైనా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, కోర్టులో సమర్పించారు. కోర్టు జుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత ఒవైస్‌కు బెయిల్ దొరికింది.

''ఐపీసీ 511 సెక్షన్ అన్ని నేరాలకు వర్తిస్తుంది. కొత్త ఆర్డినెన్స్ ద్వారా మరింత స్పష్టత వచ్చింది. ఇప్పుడు పెళ్లి ద్వారా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే దీని ద్వారా చర్యలు తీసుకోవచ్చు. పోలీసులకు పని భారం తగ్గుతుంది'' అని ఆర్‌కే సింగ్ అన్నారు.

భజరంగ్ దళ్ లాంటి రైట్ వింగ్ సంస్థల నుంచో, మరొకరి నుంచో తమకు సమాచారం రాదని... వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

''అందరూ పోలీసులనే నిందిస్తారు. మేం ముస్లింలకు వ్యతిరేకం కాదు'' అని ఆయన అన్నారు.

కొత్త ఆర్డినెన్స్ కింద మరిన్ని ఫిర్యాదులు వచ్చాయా? అని అడిగినప్పుడు... ఈ విషయంలో ప్రజలకు సంకేతం పంపేందుకు ఒక్క కేసు చాలని ఎస్ఎస్ఐ నిర్మోధ్ అన్నారు.

ఇక ఒవైస్‌పై కేసులో కోర్టు విచారణ మొదలవ్వడం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన న్యాయవాది మహమ్మద్ ఆరిఫ్ అన్నారు.

''ఆశా తన ఇష్టప్రకారం ఇల్లు వదిలివెళ్లానని 2019లో మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటికి ఆమె వయసు పద్దెనిమిదిన్నర ఏళ్లు. ఆమె మేజర్. తిరిగి ఇంటికి వచ్చారు. తండ్రి ఆమెకు పెళ్లి చేశారు. ఆ కేసు అయిపోయింది. కానీ, నవంబర్ 28న కొత్త ఆర్డినెన్స్ వచ్చాక, తాము మొదటి కేసు పెట్టాలని బరేలీ పోలీసులు అనుకున్నారు. మత మార్పిడి జరగకున్నా, ఆ అమ్మాయి తండ్రిని నవంబర్ 28న పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆయన్ను వేధించారు'' అని ఆరిఫ్ అన్నారు.

''జైల్లో ఉన్న రోజులు ఘోరంగా గడిచాయి. నాపై ఇంకా ఏ కేసులు పెడతారో కూడా తెలియదు. నా కెరీర్ నాశనమైపోయింది. కేసు విషయమై అందరూ వెక్కిరిస్తున్నారని చదువు మానేశాను. కోపం వస్తున్నా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇదంతా రాజకీయం. హిందూ అబ్బాయిలపై ఇలాంటి కేసు రాలేదు ఎందుకు?'' అని ఒవైస్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)