You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైఎస్ షర్మిలకు కొత్త పార్టీ వద్దని చెప్పాం, ఇక ఆమె ఇష్టం: వైసీపీ నేత సజ్జల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య విభేదాలున్నాయంటూ ప్రచారం జరుగుతోందని, అది నిజం కాదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విస్తరణ విషయంలో మాత్రమే వారి భిన్నాభిప్రాయాలున్నాయని ఆయన చెప్పారు.
మీడియాతో సజ్జల మాట్లాడుతూ.. "అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు లేవు. పార్టీ విస్తరణ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వైఎస్ జగన్‌కు కూడా జాతీయ స్థాయిలో వెళ్లేందుకు అవకాశం ఉంది. దేశంలో నాలుగో అతి పెద్ద పార్టీ మాది. షర్మిల కొత్త పార్టీ వైపు వెళ్లవద్దని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాం. దానికున్న పరిమితులు, పార్టీ పెడితే వచ్చే కష్టాలు కూడా చెప్పాం. నాతో సహా అనేక మంది ప్రయత్నం చేశాం. ఆమె కూడా అనుభవజ్ఞురాలు, రాజకీయ కుటుంబానికి చెందిన ఆమె, పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఆమెదే బాధ్యత, వచ్చే ఫలితాలు ఆమెవే" అని అన్నారు.
"ఏపీ రాజకీయాల్లో ఎదగనీయలేదనే ప్రచారంలో వాస్తవం లేదు. ఆమెకు సహకరించడం వల్లే ఆమె పాదయాత్ర చేశారు. పాదయాత్ర కోసం ఆమె చాలా కష్టపడ్డారు. పదవులకు సంబంధించి, వైఎస్ కుటుంబంలో విభేదాలున్నాయని అనుకోవడం లేదు. పైగా చిన్న పదవి రాలేదని చెప్పి అంత పెద్ద బాధ్యతను షర్మిల నెత్తిన పెట్టుకుంటుందని మేము అనుకోవడం లేదు. నిజంగా షర్మిలకు ఏపీలో పదవి ఇచ్చి ఉంటే వైసీపీ కుటుంబ పార్టీ అని ముద్ర వేసేవారు. వ్యక్తిగత స్పర్థలతో ఆమె పార్టీ పెట్టారనడంలో అర్థం లేదు. పార్టీ పెట్టాలన్నది షర్మిల నిర్ణయం. వద్దని జగన్ అభిప్రాయం. ఆమెకు జగన్ పార్టీ తరఫున మేము ఆల్ ది బెస్ట్ చెబుతాం. మా వైఎస్సార్సీపీ పరోక్షంగా కూడా ఇతర రాష్ట్రాలలో జోక్యం చేసుకోదు" అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నారని ఆమె అభిమానులు ప్రచారం చేస్తున్నారు.
మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద ఉన్న ఆమె నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
‘‘జై తెలంగాణ.. జోహార్ వైఎస్ఆర్.. జై షర్మిలక్క.. మన కష్టం తెలుసు.. మన కన్నీళ్లు తెలుసు.. మన బ్రతుకులు మార్చే బాట.. వైఎస్‌ఆర్ కుటుంబానికి తెలుసు.. షర్మిలక్క నాయకత్వం వర్థిల్లాలి’’ అని రాసి ఉన్న బ్యానర్లను అక్కడ ఏర్పాటు చేశారు.
ఈ బ్యానర్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి.
నల్గొండ జిల్లాకు చెందిన అభిమానులతో వైఎస్ షర్మిల మంగళవారం సమావేశం అయ్యారు.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఏర్పాట్లపైనే ఆమె చర్చించారని అభిమానులు ప్రచారం చేస్తున్నారు.
లోటస్‌పాండ్‌కు భారీగా చేరిన అభిమానులు డప్పులు వాయిస్తూ, టపాసులు పేలుస్తూ సందడి వాతావరణాన్ని సృష్టించారు.
వారిని పలకరించేందుకు బయటకు వచ్చిన షర్మిలపై కాగితపు పూలను చల్లారు.
'తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా'
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లేదని, దానిని తాను తీసుకొస్తానని వైఎస్ షర్మిల అన్నారు.
మంగళవారం నల్గొండ జిల్లా అభిమానులతో సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు తాను ప్రతి జిల్లా అభిమానులను కలవబోతున్నానని చెప్పారు.
తెలంగాణలో వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
‘‘రాజన్న రాజ్యం ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఎందుకు రాకూడదు?’’ అని ఆమె ప్రశ్నించారు.
రాజన్న రాజ్యం తెలంగాణలో తీసుకువస్తారా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘తీసుకు వస్తాం’’ అని బదులిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)