You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రిపబ్లిక్ డే: 21 ఫిరంగులతో సెల్యూట్.. భారత్‌ను గణతంత్ర దేశంగా ప్రకటించిన క్షణాన 1950 జనవరి 26న ఏం జరిగింది
గణతంత్ర దినోత్సవం ఏంటి, దానిని ఎందుకు జరుపుకొంటారు?
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే, ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుంటారు.
గణతంత్ర దినోత్సవం జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది?
దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ, భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా అదే రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.
భారత్ తన రాజ్యాంగాన్ని ఎప్పుడు స్వీకరించింది?
భారత్ రాష్ట్రాల ఒక సంఘం. ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన ఒక గణతంత్ర దేశం. ఈ గణతంత్ర దేశంలో పాలన భారత రాజ్యాంగం ప్రకారం సాగుతుంది. దానిని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
భారత రాజ్యాంగంలోని పంచవర్ష ప్రణాళికను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
భారత రాజ్యాంగంలో పంచవర్ష ప్రణాళికను సోవియట్ యూనియన్(యుఎస్ఎస్ఆర్) నుంచి తీసుకున్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారు?
దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటారు. జాతీయ జెండాను ఆయనే ఎగురవేస్తారు.
గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర రాజధానుల్లో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారు?
గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్ర రాజధానుల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. భారత్‌లో రెండు జాతీయ జెండా వేడుకలు జరుగుతాయి. ఒకటి గణతంత్ర దినోత్సవం, రెండోది స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని దేశ రాజధానిలో, ముఖ్యమంత్రులు రాష్ట్ర రాజధానుల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
కొత్త దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ నుంచి గౌరవ వందనం ఎవరు స్వీకరిస్తారు?
గణతంత్ర దినోత్సవ పరేడ్ నుంచి భారత రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. భారత సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ ఆయనే. ఈ పెరేడ్‌లో భారత సైన్యం తమ ట్యాంకులు, మిసైళ్లు, రాడార్, యుద్ధ విమానాలు లాంటి వాటిని ప్రదర్శిస్తుంది.
'బీటింగ్ రిట్రీట్' అనే వేడుక ఎక్కడ జరుగుతుంది?
బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం రైజీనా హిల్స్‌లో రాష్ట్రపతి భవనం ఎదుట జరుగుతుంది. దానికి రాష్ట్రపతి ముఖ్య అతిథి. బీటింగ్ రిట్రీట్ వేడుకను గణతంత్ర దినోత్సవాల ముగింపు కార్యక్రమంగా చెబుతారు. ఇది గణతంత్ర దినోత్సవం జరిగిన మూడో రోజు అంటే జనవరి 29న సాయంత్రం నిర్వహిస్తారు. బీటింగ్ రిట్రీట్‌లో పదాతి దళం, వైమానిక దళం, నావికా దళాల బ్యాండ్ సంప్రదాయ సంగీతం వినిపిస్తూ మార్చ్ చేస్తాయి.
భారత జాతీయ జెండా ఎవరు డిజైన్ చేశారు?
భారత జాతీయ జెండాను పింగళి వెంకయ్య డిజైన్ చేశారు. పింగళి మొదట డిజైన్ చేసిన జెండాలో ఎరుపు, ఆకుపచ్చ రెండు రంగులు మాత్రమే ఉండేవి. ఆయన ఈ జెండాను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బెజవాడ సెషన్‌లో గాంధీజీ సమక్షంలో అందించారు. తర్వాత గాంధీ సలహాతో జెండా మధ్యలో తెల్లరంగును జోడించారు. ఆ తర్వాత చరఖా ప్రాంతంలో రాష్ట్రీయ చిహ్నం హోదాలో అశోక చక్రానికి చోటు లభించింది. భారత జాతీయ జెండా ప్రస్తుత స్వరూపాన్ని 1947 జులై 22న నిర్వహించిన భారత రాజ్యాంగ సభ సమావేశం సందర్భంగా స్వీకరించారు. భారత్‌లో 'త్రివర్ణం' అంటే భారత జాతీయ జెండా అని అర్థం.
జాతీయ సాహస పురస్కారాలు ఎప్పుడు ప్రదానం చేస్తారు?
జాతీయ సాహస పురస్కారాలను భారత్ ప్రతి ఏటా జనవరి 26 సందర్భంగా ధైర్యసాహసాలు ప్రదర్శించిన పిల్లలకు ఇస్తారు. ఈ అవార్డులను 1957 నుంచి ప్రారంభించారు. పురస్కారంలో భాగంగా ఒక పతకం, ధ్రువ పత్రం, నగదు బహుమతి అందిస్తారు. స్కూల్ విద్య పూర్తి చేసేవరకూ పిల్లలందరికీ ఆర్థిక సాయం కూడా అందిస్తారు.
గణతంత్ర దినోత్సవ పెరేడ్ ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది?
గణతంత్ర దినోత్సవ పరేడ్ రాష్ట్రపతి భవనం నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా గేట్ దగ్గర ముగుస్తుంది.
ప్రథమ గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి ఎవరు?
ప్రథమ గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్ దర్బార్ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఐదు మైళ్ల పొడవున సాగిన పరేడ్ తర్వాత, ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
భారత రాజ్యాంగం రూపొందించడానికి ఎన్ని రోజులు పట్టింది?
రాజ్యాంగ సభ దాదాపు మూడేళ్ల (2 సంవత్సరాల 11 నెలల, 17 రోజులు)లో భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ వ్యవధిలో 165 రోజుల్లో 11 సెషన్స్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
- అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో ‘రాక్షసుల్లా’ ఎలా మారారు?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)