You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: 24 గంటలూ కోవిడ్-19 రోగుల ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని చూసే హైదరాబాదీ యాప్
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్-19 రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయి, గుండె కొట్టుకునే రేటు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో వచ్చే మార్పులను గుర్తించి ఎప్పటికప్పుడు సరైన చికిత్స అందిస్తే, పేషెంటు పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా కాపాడుకోవచ్చు.
ఆసుపత్రుల్లో కాకుండా ఇంట్లో ఉంటూ ఇవన్నీ నిరంతరం చూసుకోవడం చాలా కష్టం. దీంతో పలువురు పేషెంట్ల పరిస్థితి దెబ్బతింటోంది.. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త యాప్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసింది హైదరాబాద్‌కి చెందిన విగో కేర్ అనే సంస్థ.
కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లలో రెస్పిరేటరీ రేట్, ఆక్సిజన్ (ఎస్పీఓ2), గుండె వేగం (హార్ట్ రేట్), ఈసీజీ, శరీర వేడి (టెంపరేచర్), లను నిరంతరం మోనిటర్ చేసి దాన్ని విశ్లేషించే వ్యవస్థను విగోకేర్ తయారు చేసింది.
ఇది ఎలా పనిచేస్తుంది?
వ్యక్తి ఛాతీపై చిన్న సిలికాన్ ప్యాచ్ (రబర్బు స్టిక్కర్ లాంటిది) అతికిస్తారు. ఇది టెంపరేచర్, ఈసీజీ వంటి వాటిని తీస్తుంది.
అలాగే డేటా ట్రాన్స్‌ఫర్ చేసే సదుపాయం ఉన్న ఆక్సీమీటర్ కూడా వారు ఇస్తారు. ఆ వ్యక్తి దగ్గర ఉండే ఆండ్రాయిడ్ ఫోన్లో విగోకేర్ యాప్ వేసుకోవాలి. ఈ ప్యాచ్, ఆక్సీమీటర్ల నుంచి డేటా నిరంతరం ఆ యాప్‌కి వెళుతుంది. అక్కడ నుంచి విగోకేర్ సర్వర్లో రోగి మొత్తం డాటా రికార్డవుతుంది.
ప్యాచ్ శరీరంపై ఉన్నా ఏ సమస్యా ఉండదు. అన్ని పనులూ మామూలుగా చేసుకోవచ్చు.
అవసరం ఏమిటి?
‘‘కోవిడ్-19 రోగులకు జ్వరం, ఆక్సీజన్, గుండె పరిస్థితులను నిరంతరం చెక్ చేయడం కోసం ఎవరో ఒకరు వారి దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆ అటెండర్ లేదా హెల్త్ వర్కర్‌కి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ ఈ వ్యవస్థ ద్వారా కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తి దగ్గరకు వెళ్లకుండానే అతనికి సంబంధించిన సమగ్ర డేటా తీసుకోవచ్చు’’ అని వివరించారు విగోకేర్ సీటీవో అక్కిరాజు.
రోగులకు సంబంధించిన త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికీ, రోగి దగ్గర లేకపోయినా అతని కీలక ఆరోగ్య ప్రమాణాలు పరిశీలించడానికి డాక్టర్‌లకు ఇది ఉపయోగ పడుతుంది. అలాగే, రోగి విషయాలు ఎప్పటికప్పుడు సమగ్రంగా నమోదు చేయడంలో పేషెంటు అటెండరుకీ ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది.
అన్నింటికీ మించి ఆక్సిజన్ లెవల్ వంటి కీలక అంశాల్లో తేడా వచ్చినా, పెరిగినా, పరిస్థితి దెబ్బతింటున్నా హెచ్చరికలు వెంటనే వస్తాయి. దాంతో వైద్యులూ తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ యాప్ ద్వారా అన్ని కీలకాంశాలు 24 గంటలూ రికార్డు అవుతాయి. ఎప్పుడైనా ఈసీజీ తీసుకోవచ్చు. అలాగే రోగి ఆరోగ్య పరిస్థితి ఒక గ్రాఫ్‌లా (డాష్ బోర్డులో) కనిపిస్తూ ఉంటుంది.
ఇందులో బీపీ, యాక్టివిటీ వంటివి చెక్ చేసే అవకాశం ఉన్నా, ప్రస్తుత కోవిడ్-19 ప్యాకేజీలో వాటిని కలపలేదు. అలాగే ఆక్సిజన్ వంటి వైటల్స్ ఏ రోజు, ఏ గంట ఎలా ఉన్నాయో, లక్షణాలు ఎప్పుడు పెరిగాయో, తగ్గాయో గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది.
‘‘కోవిడ్-19 విషయంలో ముందు నుంచీ జాగ్రత్త పడితే పరిస్థితి చేజారదు. ఐసీయూ అవసరం కూడా ఎవరికో కానీ రాదు. కానీ దానికోసం ఎప్పటికప్పుడు వైటల్స్ (శరీరంలోని వివిధ ఆరోగ్య ప్రమాణాలు) చూసుకుంటూ ఉండాలి. ఆ సమాచారాన్ని విశ్లేషించి, రోగి పరిస్థితిపై ఒక అంచనాకు రావాలి. అప్పుడు సరైన చికిత్స ఇవ్వవచ్చు.. సరిగ్గా మా యాప్ అదే పని చేస్తుంది. ఆ డివైస్‌ల నుంచి వచ్చిన డేటాను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా విశ్లేషించి, ప్రతీ రోగి గురించీ సమగ్రమైన రిపోర్టు డాష్ బోర్డుపై అందిస్తాం. దీనిద్వారా వైద్యులకు రోగి పరిస్థితిపై వేగంగా అవగాహన వస్తుంది’’ అన్నారు అక్కిరాజు.
దీనికి అదనంగా లక్షణాలకు సంబంధించిన ప్రశ్నలు వేసి, జవాబులు తీసుకుంటుంది యాప్. దాని ద్వారా రోగి వ్యాధి లక్షణాలపై కూడా ఒక రిపోర్టు ఉంటుంది. అదే యాప్ ద్వారా డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్ కూడా చేయవచ్చు.
‘‘చాలా సందర్భాల్లో ఆసుపత్రి అవసరం ఉన్నవారు ఖర్చు భరించలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రులు అవసరం లేని వారు కూడా అక్కడే ఉండపోతున్నారు. దీనివల్ల అవసరం ఉన్న వారికి బెడ్ దొరకడం లేదు. ఈ తేడాను పూరించడానికి, ఆసుపత్రి తరహా నిరంతర పర్యవేక్షణ అవసరమైన వారికి తక్కువ ధరలోనే ఆ సౌకర్యాలను అందించాలన్నదే మా లక్ష్యం. దాని కోసమే మా సంస్థ పనిచేస్తోంది. పెద్ద ఆపరేషన్లు అయిన తరువాత డిశ్చార్జి అయిన వారూ, గర్భిణీలు.. ఇలాంటి వారికోసం మేం నిరతరం పనిచేస్తున్నాం. ఆ క్రమంలో మా ఆవిష్కరణ కోవిడ్ వారి కోసం కూడా ఉపయోగపడుతుంది.’’ అని చెప్పారు అక్కిరాజు.
కోవిడ్ రోగులు ఒక్కోసారి బాత్రూంకి వెళ్లొచ్చేసరికి వైటల్స్ పడిపోతుంటాయని, అలా జరిగి చనిపోయిన రెండు కేసులు కూడా చూశామని ఇలాంటి విషయాల్లో ఈ యాప్ బాగా ఉపయోగపడుతోందని విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ కోవిడ్ అడ్మిన్ వ్యవహారాల ఇంచార్జి కామినేని అచ్యుత బాబు అన్నారు.
"24 గంటలూ వైటల్స్ చూడడం వల్ల, ఏ సమయంలో ఎక్కువ ఫ్లక్చుయేట్ (పెరుగుదల, తగ్గుదల ఎక్కువగా ఉండడం) అవుతుందో తెలుసుకుని, ఆ అవకాశాలు నివారిస్తాం. ఉదాహరణకు డాక్టర్ చూసినప్పుడు బాగుండవచ్చు. కానీ బాత్రూకి వెళ్లినప్పుడు శాచ్యురేషన్ పడిపోతుంది. రెస్పిరేటరీ స్పీడు పెరుగుతుంది. లేదా మరో పనిచేస్తున్నప్పుడు తీవ్రంగా మారిపోతుంటాయి. అంటే రోగి శరీరంలో ఎప్పుడు వైటల్స్ పడిపోతున్నాయో గ్రాఫ్ ద్వారా గుర్తించి, ఆ పనులు చేయనివ్వకుండా నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. నిరంతర మానిటరింగ్ కాబట్టి 24 గంటల డాటా ఉంటుంది.'' అని ఆయన వివరించారు.''ఇది ఉపయోగకరంగానే ఉంది. నా డాటా ఎప్పటికప్పుడు డాక్టర్ కి అప్డేట్ అవుతూ ఉండడం చేత ఆయన కూడా అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు కుదిరింది'' అన్నారు హైదరాబాద్ కి చెందిన గోపాలకృష్ణ.
ఏ రోగి విషయంలోనైనా డాక్టర్‌కి రెండు కావాలి. ఒకటి వైటల్స్, రెండు సింప్టమ్స్. ఆ రెండూ ఈ యాప్ సమగ్రంగా విశ్లేషించి అందిస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ఆసుపత్రులు, వైద్యులు ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది. దీనికి ఐదు రోజులకు 6-8 వేల వరకూ ఖర్చవుతోంది.
డా. సీ శేఖర్ ఫౌండర్ సీఈవోగా, రతీశ్ భట్ సహ వ్యవస్థాపకులుగా 2018లో కనెక్టెడ్ కేర్ ఇండియా సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థే వైటల్స్ ఆన్ గో ని షాట్ ఫాంలో విగో బ్రాండ్ తో ఈ యాప్ విడుదల చేసింది. భట్టిప్రోలు అక్కిరాజు ఈ సంస్థ సీటీవో.
పేషెంటు ఆసుపత్రిలో లేనప్పుడు కూడా వ్యక్తి ఆరోగ్యం నిరంతరం మోనిటర్ చేసే వ్యవస్థలను తయారు చేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. వైద్యాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అందరికీ అందుబాటులోకి తేవడానికి తాము పనచేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీ, బయో సెన్సార్ డివైజులను ఉపయోగించి వీరు తమ వ్యవస్థలను తయరు చేస్తారు.
ఈ సంస్థ మెడిసిన్, టెక్నాలజీలను మేళవించి వివిధ ఉత్పత్తులు, వ్యవస్థలు తయారు చేస్తోంది. నిజానికి ఈ తాజా ఆవిష్కరణ కూడా కోవిడ్-19 కంటే ముందే ప్రారంభించారు. గర్భిణులు, గుండె వ్యాధులతో బాధపడేవారు, పెద్ద ఆపరేషన్లు అయిన తరువాత ఇంటి దగ్గర ఉంటూనే నిరంతరం రోగిని మోనిటర్ చేయాలనుకునే వారి కోసం.. ఇంట్లో ఉంటూనే వారి ఆరోగ్య పరిస్థితి మోనిటర్ చేసే ఉత్పత్తులను, వ్యవస్థలను తయారు చేస్తోంది విగోకేర్. ఆ క్రమంలో కోవిడ్ మహమ్మారి వ్యాపించడంతో, సరిగ్గా ఈ వ్యాధి అవసరాలకు తగ్గట్టుగా తమ ఉత్పత్తిని మలిచారు.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన ఎలా ఉండబోతోంది... ఎన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి?
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)