బిహార్ ఎన్నికల ఫలితాలు: నితీశ్ కుమార్ విజయ రహస్యం ఏమిటి?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నడుమ జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్ 15 ఏళ్ల పాలనను ఇదివరకటి 15 ఏళ్ల ఆర్జేడీ పాలనతో పోలుస్తున్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో చాలాసార్లు ఆర్జేడీ పాలనను ‘‘జంగిల్ రాజ్‌’’గా నితీశ్ అభివర్ణించారు. తన పాలనను సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్‌గా)తో పోల్చారు.

‘‘ఇదివరకు కిడ్నాప్, మత ఘర్షణలు, అరాచకాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే మీరు మాకు అవకాశం ఇచ్చారు. మేం సుపరిపాలను ఏర్పాటుచేశాం. జంగిల్ రాజ్ నుంచి విముక్తి కల్పించాం’’అని నితీశ్ వ్యాఖ్యానించారు.

స్కూళ్లలో లక్ష మందికిపైగా ఉపాధ్యాయుల నియామకం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యుల్ని అందుబాటులో ఉంచడం, మారుమూల గ్రామాలకు విద్యుత్‌ వెలుగులు, రోడ్లతో అనుసంధానం, మహిళల్లో అక్షరాస్యత పెంపు తదితర విజయాలను తమ ప్రభుత్వం సాధించిందని నితీశ్ చెప్పారు. ఇంతకీ ఆయన ప్రస్థానం ఎలా మొదలైందో ఒకసారి చూద్దామా?

స్వాతంత్ర్యోద్యమ నాయకుడి తనయుడిగా..

కుర్మీ వర్గానికి చెందిన నితీశ్ కుమార్ 1951, మార్చి 1న జన్మించారు. ఆయన తండ్రి పేరు కవిరాజ్ రామ్ లఖన్ సింగ్. తల్లి పేరు పరమేశ్వరీ దేవి. కవిరాజ్ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధేయవాది విభూతి అనురాగ్ నారాయన్ సిన్హాకు ఆయన సన్నిహితుడు. వృత్తిరీత్యా కవిరాజ్ ఆయుర్వేద నిపుణుడు.

1972లో బిహార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి నితీశ్ మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. తొలుత బిహార్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

1973లో నితీశ్.. మంజు కుమారి సిన్హాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. 2007లో న్యూమోనియాతో మంజు మరణించారు.

నితీశ్‌ కుమార్‌ కాలేజీలో చదివే రోజుల్లో రాజ్‌ కపూర్‌ చిత్రాలను ఎంతగానో ఇష్టపడే వారని నితీశ్‌ కుమార్: ద రైజ్ ఆఫ్‌ బిహార్ పుస్తకంలో అరుణ్‌ సిన్హా ప్రస్తావించారు. చదువుకునే రోజుల్లో ఆయనకు 150 రూపాయల స్కాలర్‌ షిప్‌ అందేది. దాంతో ఆయన ఎక్కువగా పుస్తకాలు కొనుక్కునేవారు.

సోషలిస్టు నాయకుడిగా రాజకీయ ప్రవేశం

నితీశ్ కుమార్‌ను సోషలిస్టు నాయకుడిగా చెబుతుంటారు. ప్రముఖ సోషలిస్టు నాయకులైన జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఎస్‌ఎన్ సిన్హా, వీపీ సింగ్‌లతో ఆయన కలిసి పనిచేశారు.

1974 నుంచి 1977 మధ్య జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో నితీశ్ పాల్గొన్నారు. ఎస్‌ఎన్ సిన్హా నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు.

1977లోనే తొలిసారి హర్‌నౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్‌పై నీతీశ్ పోటీచేశారు. అయితే ఓటమి పాలయ్యారు. 1985లో ఇదే స్థానం నుంచి తొలిసారి ఆయన శాసన సభకు ఎన్నికయ్యారు.

1989లో జనతా దళ్ జనరల్ సెక్రటరీ పదవిని నితీశ్ చేపట్టారు. అదే ఏడాది తొలిసారి బాడ్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మొత్తంగా ఆరుసార్లు ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా..

వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం(1998-99)లో నితీశ్ కేంద్ర రైల్వే, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, డాయిసాల్ రైలు ప్రమాదం జరగడంతో కేంద్ర మంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేశారు. ఈ ప్రమాదంలో 285 మంది వరకు మరణించారు.

రైల్వే మంత్రిగా కొంత కాలమే పనిచేసినప్పటికీ.. ఇంటర్నెట్‌లో రైలు టిక్కెట్ల బుకింగ్ సదుపాయం, భారీగా కొత్త రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు తెరవడం లాంటి సంస్కరణలు తీసుకొచ్చారు. తత్కాల్ విధానాన్ని కూడా ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారు.

తర్వాత ఏర్పాటైన ఎన్‌డీఏ ప్రభుత్వం(2001-2004)లో నితీశ్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.

ఏడు రోజుల సీఎంగా..

తొలిసారి ముఖ్యమంత్రిగా మార్చి 2000లో నితీశ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. 324 మంది సభ్యులున్న అసెంబ్లీలో అప్పుడు ఎన్‌డీఏకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు లాలూ చేతిలో 159 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిద్దరికీ సరిపడా ఆధిక్యం (163) దక్కలేదు. అయితే, బల పరీక్షకు ముందే నితీశ్ రాజీనామా చేశారు. ఏడు రోజులపాటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.

నితీశ్ పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 2005లోనే. ఆ తర్వాతి ఎన్నిక (2010)ల్లోనూ ఆయనే విజయం సాధించారు.

అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఎన్‌డీఏ నుంచి వేరుపడి జేడీయూ విడిగా పోటీచేసింది. నితీశ్ రాజీనామా అనంతరం జీతన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నితీశ్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని ఘన విజయం సాధించారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు వెలుగుచూడటంతో మహా కూటమి బీటలు వారింది.

దీంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేశారు. అయితే, వెంటనే ఎన్‌డీఏతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లోనూ ఎన్‌డీఏతో కలిసే నితీశ్ బరిలోకి దిగారు.

ఒకప్పుడు... మట్టిలోనైనా కలుస్తాను గానీ బీజేపీతో కలవను అని నితీశ్‌ అన్నారు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనని విశ్లేషకులు చెబుతుంటారు.

‘‘2005-10 మధ్యలో ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాల కారణంగా ఆడపిల్లలకు పోషకాహారం, పాఠశాల విద్య వంటివి అందాయి. లాలూ ప్రసాద్ పాలనలో జరిగిన అవినీతి నీతీశ్‌ పాలనలో ఆగిపోయింది. మాటలు చెప్పేవారికి 15 సంవత్సరాలు అధికారం ఇస్తే, కష్టపడి పనిచేసేవారికి ఐదేళ్లే ఇస్తారా అంటూ 2010లో నీతీశ్‌ తన ఎన్నికల ప్రసంగాల్లో పదే పదే చెప్పేవారు. కానీ గత ఐదారేళ్ల కాలంలో నితీశ్‌ ప్రభుత్వంపై కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి’’ అని బిహార్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మణికాంత్‌ ఠాకూర్‌ అన్నారు.

‘‘2005 నుంచి 2010 మధ్య నితీశ్ పాలన చాలా మెరుగ్గా ఉండేది. మహిళలు, బాలికల కోసం ఆయన చాలా పథకాలు ప్రవేశపెట్టారు. జంగిల్ రాజ్‌ను దాదాపుగా ఆయన తుడిచిపెట్టేశారు. కానీ గత ఏడున్నరేళ్లలో రాష్ట్రంలో అవినీతి పెరిగింది’’అని బిహార్ జర్నలిస్టు మణికాంత్ ఠాకుర్ వ్యాఖ్యానించారు.

‘‘ముఖ్యంగా గ్రామీణ బిహార్‌లో అవినీతి బాగా కనిపిస్తోంది. నితీశ్ వైపు ఉండే మహిళా ఓటర్లు అవినీతి గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మతపరమైన ఇమేజ్‌కు దూరంగా ఉండే నీతీశ్‌.. 2019 ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అలానే 2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ.. నితీశ్‌ కోసం ఓట్లడిగారు.

జేడీయూకు సంస్థాగత నిర్మాణం లేదు. బూత్‌ స్థాయి కార్యకర్తలు లేరు. కానీ నితీశ్ రాజకీయ చతురత, సామర్థ్యాలే ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగా నడిచే పార్టీలను ఎన్నికల క్షేత్రంలో వెనక్కు నెట్టాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే నితీశ్‌ లేని జేడీయూ ఎలా ఉంటుంది? జేడీయూకి తర్వాత నాయకుడు ఎవరు అనేదానికి అప్పట్లోనే కాదు, ఇప్పుడూ సమాధానం లేదు.

ఇవే ఆయనకు చివరి ఎన్నికలా?

‘‘ఇది ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవే నా చివరి ఎన్నికలు. ఇప్పటివరకు అంతా సవ్యంగా జరిగింది. ముగింపు కూడా సంతృప్తిగానే ఉంటుంది’’.

నవంబరు 5న పూర్ణియాలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భావోద్వేగంతో చెప్పిన మాటలివి. వెంటనే నితీశ్ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకబోతున్నారని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరైతే భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని మరోసారి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

అయితే, నితీశ్‌కు ఇవి చివరి ఎన్నికలు కావని జనతా దళ్ స్పష్టీకరించింది. రాజకీయాల్లో మంచి అనుభవమున్న నితీశ్ మాటల్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఆయనకు ఎప్పుడు, ఏం చేయాలో బాగా తెలుసు.

‘‘నితీశ్ మాటల్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఆయన ఆచితూచి మాట్లాడుతుంటారు’’అని పట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన డీఎం దివాకర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)