You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గిన్నిస్ రికార్డులకు ఎక్కిన భారత పులుల గణన.. ఎందుకంటే...
భారత్‌లో పులుల లెక్కింపు విధానం కొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. కెమెరాల సహాయంతో వన్యప్రాణి గణన ఇంత పెద్ద ఎత్తున ఇంకెక్కడా లేకపోవడంతో 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'కు ఎక్కింది.
దీంతో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఇదో గొప్ప సందర్భమని.. ఆత్మనిర్భర భారత్‌కు సరైన ఉదాహరణనని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
'ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2018' లెక్కలను గత ఏడాది 'గ్లోబల్ టైగర్ డే' సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ లెక్కలే 'ప్రపంచంలోనే కెమేరా సహాయంతో చేపట్టిన భారీ వన్యప్రాణి గణన'గా 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు దక్కేలా చేశాయి.
నాలుగేళ్లు ముందుగానే..
పులుల సంఖ్య రెట్టింపు చేయడానికి పెట్టుకున్న లక్ష్యాన్ని భారత్ నాలుగేళ్లు ముందుగానే చేరుకుందని కేంద్ర పర్యవరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు.
గత గణన ప్రకారం దేశంలో ఇప్పుడు 2,967 పులులు ఉన్నాయి. ప్రపంచంలోని పులుల్లో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి.
2022 నాటికి దేశంలో పులుల సంఖ్య రెట్టింపయ్యేలా చేస్తామని 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత్ తీర్మానించుకోగా ఇప్పుడు అంతకు నాలుగేళ్లు ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నట్లు మంత్రి తెలిపారు.
గిన్నిస్ బుక్‌లో ఏం రాశారంటే..
''భారత్ 2018-19లో నిర్వహించిన సర్వే నాలుగో సైకిల్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన గణనల్లో వనరులు, గణాంక సేకరణ పరంగా అత్యంత సమగ్రమైనది. 141 వేర్వేరు ప్రాంతాల్లో 26,838 ప్రదేశాల్లో కెమేరా ట్రాప్స్(మోషన్ సెన్సర్లున్న కెమేరాలు అడవుల్లో అమర్చగా వాటి పక్క నుంచి జంతువులు వెళ్లినప్పుడు అవి రికార్డు చేస్తాయి) ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో 1,21,337 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులుల గణన చేపట్టారు. ఈ కెమేరా ట్రాప్స్ మొత్తం 3,48,58,623 ఫొటోలను తీశాయి. అందులో 76,651 పులులవి కాగా 51,777 చిరుతలవి, మిగతావి ఇతర జంతువుల ఫొటోలు. ఈ ఫొటోల్లోని పులులను వాటిపై చారల తీరు ఆధారంగా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మొత్తం 2,461 పులులున్నట్లు(కూనలను మినహాయించి) తేల్చార''ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొన్నారు.
నేషనల్ టైగర్ కంజర్వేటివ్ అథారిటీ ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయిలో పులులను లెక్కిస్తారు. దీనికి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారం అందిస్తుంది. రాష్ట్రాల అటవీ శాఖలు, ఇతర కొన్ని సంస్థలు ఇందులో భాగస్వాములవుతాయి.
2018 సర్వే ప్రకారం దేశంలో మొత్తం 2967 పులులు ఉండగా అందులో 2461 కెమేరా ట్రాప్‌ల సహాయంతో లెక్కించారు. మిగతావి ఇతర పద్ధతుల్లో గణించారు.
పులుల సంరక్షణలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ముందంజలో ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
- చిరుత పులి బలహీనతలేంటో మీకు తెలుసా!?
- ఈ ‘పులి’ ఏం చేసిందో తెలుసా?
- ఇది హిందూ-ముస్లింల ఘర్షణా లేక అస్సామీలకూ బెంగాలీలకూ మధ్య ఘర్షణా?
- యాదాద్రి: ముస్లిం శిల్పులు చెక్కుతున్నారు
- BBC INVESTIGATION: అలీగఢ్‌లో ముస్లిం యువకుల ఎన్కౌంటర్లో వాస్తవమెంత?
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- రోహింజ్యా ముస్లింలు క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు?
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- ఎన్నికల్లో వాట్సాప్ దుర్వినియోగం, ఒకేసారి 3 లక్షల మందికి మెసేజ్‌లు
- దీపావళి: హరిత టపాసులు అంటే ఏంటి?
- పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరువు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)