You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నారా చంద్రబాబు నాయుడు: ‘ప్రధాని నరేంద్ర మోదీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు’ - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారని.. ఏపీకి ప్రత్యేక హోదాతో సహా ఇతర కేంద్ర హామీలపై ఆనాడు జగన్ చెప్పిందేంటి ఇప్పుడు చేసేదేంటని చంద్రబాబు ప్రశ్నించారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.
మరోవైపు తనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారని కూడా ఆ కథనంలో చెప్పింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు పోరాడానని చంద్రబాబు తెలిపారని పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఏపీ బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో మూడు రాజుధానుల బిల్లును మళ్లీ తీసుకురావడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. అది తప్పుడు విధానమని ఆయన మండిపడ్డారు.
శాసన మండలి ఇప్పటికే సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన బిల్లులను మళ్లీ ఎలా తెస్తారని ప్రశ్నించారు. మండలిలో మళ్లీ గట్టిగా పోరాడతామని, ఈ బిల్లులపై పోరాటంలో తమకు రెండో ఆలోచనే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణలో సెప్టెంబర్‌లో స్కూళ్లు: నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు
కోవిడ్-19 నేపథ్యంలో తెలంగాణలో ఈ విద్యాసంవత్సరాన్ని 3 నెలలు ఆలస్యంగా అంటే సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని 'నమస్తే తెలంగాణ' పత్రిక ఒక కథనం రాసింది.
ఈ కథనం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభించే యోచనలో ఉన్న ప్రభుత్వం వీటిని దశలవారీగా ప్రారంభించాలా, వద్దా అన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా కేసుల నమోదు ఎక్కువగానే ఉంది.
ఈ నేపథ్యంలో ఒక జాతీయ విద్యాసంస్థలను దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులు నష్టపోకుడా తరగతుల ప్రారంభానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. 1 నుంచి 10 తరగతులను ఒకేసారి ప్రారంభించడం లేదంటే 8 నుంచి 12 లేదంటే 5 నుంచి 7 తరగతులు, ఇలా దశలవారీగా ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సెప్టెంబర్‌లో తరగుతులు ప్రారంభించి ఏకబిగిన 220 రోజుల పాటు తరగతులు కొనసాగిస్తేనే సిలబస్ పూర్తికి అవకాశం ఉంటుందని నమస్తే తెలంగాణ తన కథనంలో పేర్కొంది.
మరణశిక్షలే సమాజానికి సందేశాలు కావు: సుప్రీంకోర్టు
అత్యాచారం కేసుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించడం ద్వారానే సమాజానికి సందేశం ఇచ్చినట్లుకాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు 'ఈనాడు' ఒక కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం వరంగల్ జిల్లాలో 9 నెలల చిన్నారిని గత ఏడాది అత్యాచారం చేసి హత్య చేసిన ప్రవీణ్ అనే యువకుడికి గతంలో ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు రద్దు చేసి దానిని తుది శ్వాస వరకు నిందితుడు జైలులో ఉండే శిక్షగా మార్చింది.
అయితే హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లింది. ఇలాంటి నేరాలలో మరణశిక్ష విధించడం వల్ల సమాజంలో ఈ తరహా నేరాలు చేసేవారికి ఒక సందేశం ఇచ్చినట్లవుతుందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. కోర్టు ఈ వాదనతో విభేదించింది.
జీవితాంతం జైలులో ఉంచడం ద్వారా కూడా సమాజానికి సందేశం ఇవ్వొచ్చని, హైకోర్టు తీర్పును తాము సమర్ధిస్తున్నామనని జస్టిస్ కిషన్ కౌల్, జస్టిస్ కె.ఎం. జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- డిప్రెషన్‌ను గుర్తించడం ఎలా? దీని లక్షణాలు ఏంటి? దీన్నుంచి ఎలా బయటపడాలి?
- చైనా సరిహద్దులో 20 మంది భారత సైనికులు చనిపోయారు: భారత సైన్యం అధికారిక ప్రకటన
- భారత్ - చైనా సరిహద్దు: ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? నాలుగు దశాబ్దాలుగా లేని గొడవలు ఇప్పుడెందుకు?
- డెక్సామెథాసోన్: కరోనావైరస్ రోగుల ప్రాణాలను కాపాడుతున్న చౌక మందు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)