You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైజాగ్ గ్యాస్ లీక్: తెల్లవారుజామున 3.25 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఎప్పుడేం జరిగింది?
తెల్లవారుజామున ప్రమాదం సంభవించినప్పటి నుంచి ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకునే వరకు ఎప్పుడు ఏం జరిగిందన్న వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.
ఉదయం 3.25 : అరుణ్ కుమార్ (స్థానికుడు) 100 నంబర్‌కు ఫోన్ చేసి గ్యాస్ లీకేజీ గురించి విశాఖపట్నం సిటీ పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే గోపాలపట్నం పోలీసు స్టేషన్‌ను అప్రమత్తం చేశారు.
ఉదయం 3:26 : రక్షక్ వాహనంలో నలుగురు కానిస్టేబుళ్లతో ఎస్‌ఐ సత్యనారాయణ ఈ ప్రమాదం జరిగిన ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామానికి వెళ్లారు.
ఉదయం 3.35: ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు కానిస్టేబుళ్లు ఆర్.ఆర్. వెంకటాపురం చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు... మర్రిపాలెం అగ్నిమాపక కేంద్రానికి, అంబులెన్సుకు సమాచారం అందించారు. ఆలోగా కంచరపాలెం సీఐతో పాటు, ఆర్‌ఐ భగవాన్, గాజువాక ఎస్‌ఐ గణేష్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఉదయం 3:40: స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిని పోలీసులు ప్రారంభించారు. మొత్తం 4,500 కుటుంబాలను ఖాళీ చేయించారు. ఇళ్ల తలుపుతట్టి, ప్రజలను నిద్రలేపి అక్కడి నుంచి తరలించారు. అదే సమయంలో నగర కంట్రోల్ రూం అన్ని రక్షక్ వాహనాలను, హైవే పెట్రేలింగ్ వాహనాలను అప్రమత్తం చేసింది.
ఉదయం 3:45: అగ్నిమాపక దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టారు.
ఉదయం 3.45 నుంచి 4 గంటల వరకు 12 రక్షక్ వాహనాలు, ఆరు 108 అంబులెన్సులు, నాలుగు హైవే పెట్రోలింగ్ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి.
ఉదయం 4:30: విశాఖ నగర పోలీసు కమిషనర్, జోన్-2 డీసీపీ అక్కడికి చేరుకుని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జోన్2 డీసీపీ విషవాయువును పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఆపరేషన్‌లో ఆర్‌ఐ భగవాన్, సీఐ రమణయ్య, ఎస్‌ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ నాగరాజు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. మొత్తం 20 మంది పోలీసు సిబ్బంది స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు.
ఉదయం 7.00 గంటల తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)