You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్: మావోయిస్టుల దాడిలో 17 మంది భద్రతాసిబ్బంది మృతి
- రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, రాయ్‌పూర్ నుంచి బీబీసీ కోసం
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు చెందిన 17 మంది మరణించారు. శనివారం ఎన్‌కౌంటర్ తరువాత 17 మంది జవాన్ల ఆచూకీ తెలియలేదు.. ఆదివారం వారి మృతదేహాలను కనుగొన్నట్లు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన మరో 14 మంది జవాన్లను రాయ్‌పూర్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
చికిత్స పొందుతున్న జవాన్లను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ ఆదివారం పరామర్శించారు.
శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాలోని చింతాగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కసాల్‌పాడ్, మినపా మధ్య మావోయిస్టులుగా అనుమానిస్తున్న కొందరు భద్రతాబలగాలపై దాడి చేశారు.
ఆ తరువాత భద్రతాబలగాలకు చెందిన 17 మంది ఆచూకీ తెలియలేదు. ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో సెర్చ ఆపరేషన్ ప్రారంభించగా మృతదేహాలు దొరికాయి.
మావోయిస్టులు భద్రతాబలగాల నుంచి యూజీబీఎల్ వంటి అధునాతన ఆయుధాలు సహా మరిన్ని ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
ఈ ఏడాది ఇదే పెద్ద దాడి
ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇంతవరకు ఇదే పెద్ద దాడి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆదివారం వరకు ఘటన సంగతి తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల బస్తర్ ప్రాంతంలో ఆపరేషన్ ప్రహార్ పేరిట చేపడుతున్న భారీ ఆపరేషన్‌లో భాగంగా శుక్రవారం ఎస్టీఎఫ్, డీఆర్‌జీ బృందాలు డోర్నపాల్ నుంచి వచ్చాయని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
వారంతా అడవిలో కూంబింగ్ చేసి తిరిగి వస్తుండగా మావోయిస్టులు దాడి చేశారని తెలిపారు.
కోరాజ్‌డోంగరీ కొండ వద్ద జరిగిన ఈ ఘటనలో భద్రతా బలగాలను మావోయిస్టులు నలువైపుల నుంచి చుట్టుముట్టారని.. కొండపై నుంచి మరికొందరు కాల్పులు జరిపారని ఆ అధికారి వివరించారు.
ప్రతిగా భద్రతాబలగాలూ కాల్పులు జరిపాయని.. ఈ ఎదురుకాల్పుల్లో కొందరు జవాన్లు గాయపడగా వారిలో 14 మందిని హెలికాప్టర్లలో రాయ్‌పూర్ తరలించినట్లు చెప్పారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
మళ్లీ అక్కడే
2014 డిసెంబరులో ఇదే ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేసి 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు.
మినపా ప్రాంతంలో క్యాంప్ ఏర్పాటుకు పోలీసులు ఎన్నోసార్లు ప్రయత్నించిన ప్రతిసారీ మావోయిస్టులు దాడి చేస్తుండడంతో క్యాంప్ ఏర్పాటు సాధ్యం కాలేదు.
గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గినప్పటికీ మళ్లీ వారు బలపడుతున్నారు. మార్చి 14న బస్తర్ జిల్లాలోని మర్దూమ్‌లో మావోయిస్టుల దాడిలో ఇద్దరు ఛత్తీస్‌గఢ్ పోలీసులు చనిపోయారు.
ఫిబ్రవరి 18న కొంతా బ్లాక్‌లో మావోయిస్టుల దాడిలో ఓ జవాను మృతి చెందాడు.
ఫిబ్రవరి 10న సీఆర్పీఎఫ్ కోబ్రా దళానికి చెందిన ఇద్దరు మావోయిస్టుల దాడిలో మరణించారు.
ఇవి కూడా చదవండి.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాక్డౌన్
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: భారతదేశంలో మూగబోతున్న నగరాలు
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
- భారత్ కూడా పాకిస్తాన్ చేసిన 'తప్పే' చేస్తోంది: షోయబ్ అఖ్తర్
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)