U19 ప్రపంచకప్ సెమీస్ హీరో యశస్వి జైశ్వాల్... పగలంతా ప్రాక్టీస్, రాత్రి పానీపూరీ అమ్మకం

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, బీబీసీ కోసం

"యశస్వికి పదకొండు, పదకొండున్నరేళ్లు ఉంటాయి. నేను మొదటిసారి అతడి ఆటను చూసింది అప్పుడే. ఆ సమయంలో తన కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉన్నట్లు నాకు అతడితో మాట్లాడిన తర్వాతే తెలిసింది".

ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ మొదటి సెమీ పైనల్లో పాకిస్తాన్‌పై 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గురించి అతడి కోచ్ జ్వాలా సింగ్ చెప్పిన మాట ఇది.

యశస్వి కోచ్ జ్వాలాసింగ్ కూడా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు. అతడి గురించి బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

"ఆ సమయంలో యశస్వి దగ్గర తినడానికి డబ్బు, ఉండడానికి చోటు కూడా లేదు. తను ముంబయిలోని ఒక క్లబ్‌లో గార్డుతోపాటు టెంటులో ఉండేవాడు. పగలు క్రికెట్ ఆడేవాడు. రాత్రి పానీపూరీ అమ్మేవాడు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉత్తర్‌ప్రదేశ్‌ భదోహీ జిల్లాలోని తన ఇంటి నుంచి అతడు చాలా చిన్న వయసులోనే ముంబయి వచ్చేశాడు" అన్నారు.

"అతడికి అది చాలా కఠిన సమయం. ఎందుకంటే పిల్లలకు ఇల్లు గుర్తొస్తుంటుంది. ఒక విధంగా యశస్వి తన బాల్యాన్ని కోల్పోయాడు. కానీ తను జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకునేవాడు."

నాది కూడా అలాంటి కథే

"నా కథ కూడా అలాంటిదే. నేను కూడా ఏదైనా సాధించాలని చిన్న వయసులోనే గోరఖ్‌పూర్ నుంచి ముంబయి వచ్చేశాను. నేను కూడా యశస్వికి ఎదురైన ఆ కష్టాలన్నీ పడ్డాను" అన్నారు జ్వాలా సింగ్.

"యశస్వి బాధను నేను అర్థం చేసుకోగలిగాను. ఇంటి నుంచి తనకు కాస్త డబ్బు అందేది. కానీ, కుటుంబానికి ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, తను ఎంత కష్టాల్లో ఉన్నాడో ఇంట్లో వారికి తెలిస్తే, తిరిగి వచ్చేయమంటారేమో అని భయం. అతడికి ట్రైనింగ్ ఇవ్వాలని, తన అన్ని అవసరాలనూ చూసుకోవాలని నేను అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుంచి యశస్వి నాతోనే ఉన్నాడు" అన్నారు.

భారీ ఇన్నింగ్స్ అడిగితే, సెంచరీ చేశాడు

ఈ అండర్-19 ప్రపంచకప్‌లో యశస్వి ప్రదర్శన గురించి మాట్లాడిన జ్వాలా సింగ్.. "మనం భారత్ తరపున ఆడుతున్నప్పుడు, అది సీనియర్ అయినా, జూనియర్ అయినా మన మీద ఒక బాధ్యత ఉంటుంది. దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని అనిపిస్తుంది. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఆటతీరు, వరుసగా అద్భుత ప్రదర్శన చేస్తున్న యశస్వి జైశ్వాల్.. నిజంగా ప్రశంసనీయం" అన్నారు.

"కానీ తను 50 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయిపోతున్నాడు. నేను యశస్వితో నాకు సెమీ పైనల్లో పాకిస్తాన్‌పై భారీ ఇన్నింగ్స్ కావాలని అడిగాను. తను సెంచరీతో దాన్ని చేసి చూపించాడు. టీమ్ విదేశాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్‌తో అద్భుతంగా ఆడడం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే, అందరి కళ్లూ ఎప్పుడూ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ మీదే ఉంటాయి. నాకు అప్పుడు చాలా గర్వంగా అనిపించింది. పాకిస్తాన్‌పై అలాంటి ఇన్నింగ్స్ ఎవరినైనా రాత్రికిరాత్రే హీరోను చేసేస్తుంది" అని జ్వాలా సింగ్ చెప్పారు.

ఒక్క మ్యాచ్‌తో హీరో

యశస్వి జైశ్వాల్ ఈ అండర్-19 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో 312 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌పై 105 (నాటౌట్‌) పరుగులతోపాటు ఆస్ట్రేలియాపై 62, న్యూజీలాండ్‌పై 57, జపాన్‌పై 29, శ్రీలంకపై 59 రన్స్ చేశాడు.

ఈ ప్రపంచకప్‌లో అతడి విజయ రహస్యం గురించి చెప్పిన కోచ్ జ్వాలా సింగ్.. ఇంత ప్రతిభ ఉన్న ఆటగాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

"ఒక్క తప్పు చాలా వెనక్కు తీసుకెళ్లగలదు. తన రికార్డు చూస్తే తెలుస్తుంది. కఠినంగా శ్రమించే ఆటగాళ్లు చాలా మంది కనిపిస్తారు. కానీ వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని ఆడే ఆటగాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు" అంటారు జ్వాలా సింగ్.

పూర్తిగా భిన్నమైన ఆటతీరు

ఈ సెంచరీ యశస్వి కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలిచిపోతుందా?

"చిన్న చిన్న విజయాలను పట్టించుకోకూడదు. ఇవన్నీ తాత్కాలికం. ఒక మ్యాచ్‌లో చాలా మంచి ప్రదర్శన ఇచ్చాక, తర్వాత మ్యాచ్‌లో కూడా బాగా ఆడాల్సి ఉంటుంది. 'మెరుగైన ప్రదర్శనను ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవద్దు, పరుగుల కోసం ఆకలి అలాగే ఉండాలి అని నేను అతడికి మొదటి నుంచీ చెబుతున్నాను. దానికోసం నేను యశస్వికి చాలా ఉదాహరణలు కూడా ఇచ్చాను" అని సమాధానంగా జ్వాలా సింగ్ అన్నారు.

బీబీసీతో మాటలు కొనసాగించిన కోచ్ జ్వాలా సింగ్.. "గొప్ప ఆటగాళ్లు వందలో 80 సార్లు బాగా ఆడతారు, కానీ, 20 సార్లు విఫలం అవుతారు అని సెమీ ఫైనల్ ముందు కూడా నేను యశస్వికి చెప్పాను. అన్నిటి మధ్య కంటిన్యుటీ అవసరం అన్నాను. అది తనలో వచ్చింది. యశస్వి కంటిన్యుటీ, సామర్థ్యం మిగతా ఆటగాళ్లకంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది" అన్నారు.

యశస్వి తన ఆర్థికపరిస్థితి చాలా కఠినంగా ఉన్న పరిస్థితుల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో అతడికి ఏదైనా ఆర్థిక సాయం అందిందా? అన్న ప్రశ్నకు జ్వాలా సింగ్ అలాంటిదేమీ అందలేదని చెప్పారు.

"నిజానికి, క్రికెట్ ఆడడానికి ఏదైనా, ఎన్నైనా భరించగలనని యశస్వి నాతో చెప్పాడు. అతడి మాట నా మనసులో నాటుకుంది. ఎందుకంటే, నేను కూడా నా గురించి అలాగే అనుకునేవాడ్ని. కానీ, నేను నా క్రికెట్ ఎక్కడ వదిలేశానో, అక్కడి నుంచే అతడిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. అతడిని చూస్తుంటే నాకు నేను గ్రౌండ్‌లో ఆడుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే తన స్టైల్ నాలాగే ఉంటుంది" అని జ్వాలా సింగ్ చెప్పారు.

యశస్విని మొదట కలిసిన రోజును గుర్తు చేసుకున్న జ్వాలా సింగ్... "యశస్వి నాకు కనిపించే సమయానికే నేను కష్టాల నుంచి బయటపడ్డాను. మంచి స్థితిలో ఉన్నాను. నిలదొక్కుకోడానికి నేను చేసిన పోరాటం లాంటి అవసరం యశస్వికి ఎప్పుడూ రాలేదు. అతడి బాగోగులు, కోచింగ్ అన్నీ నేనే చూసుకున్నాను. ట్రైనింగ్ కోసం తనను ఇంగ్లండ్ కూడా పంపించాను. అది చూసి మా ఇంట్లోవాళ్లు యశస్వితో 'నీకు అన్నీ దొరికాయి. ఇవన్నీ మా జ్వాలాకు దొరికుంటే తను కూడా నీలాగే అయ్యుండేవాడు' అని చాలాసార్లు అన్నారు" అని చెప్పారు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు

యశస్వి జైశ్వాల్ త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కనిపించబోతున్నాడు. ఆ జట్టు అతడిని 2 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.

అయితే యశస్వి మనసులో డబ్బుకు ఏ స్థానం ఉంది?

సమాధానంగా జ్వాలా సింగ్ "మీరు ఎవరైనా ఆటగాళ్లు, లేదా ఆర్మీకి సంబంధించిన వ్యక్తుల ఇంటికి వెళ్తే, అక్కడ గోడలపై తగిలించిన మెడల్స్, అవార్డులు కనిపిస్తాయి. కానీ, బీరువాలో ఉన్న డబ్బును వారు మీకు చూపించరు".

"క్రికెట్ ఆటగాళ్లు కూడా అంతే, వారికి తాము సాధించే విజయాలే ముఖ్యం. ఆ డబ్బుతో మనం మన జీవితాన్ని మరింత మెరుగ్గా చేసుకోగలం అనేది కూడా అక్షరాలా నిజం. ఇప్పుడు తను ఐపీఎల్‌లో అత్యుత్తమ వర్ధమాన ఆటగాడుగా అవార్డు గెలుచుకోవాలనేదే మా ఆశ" అన్నారు జ్వాలా సింగ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)