You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం పీఎఫ్ఐ సంస్థను నిషేధించాలని ఎందుకు కోరుతోంది
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
2006 నవంబర్ 22న కేరళలోని కోజికోడ్‌లో స్థాపించిన తర్వాత నుంచీ 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' (పీఎఫ్ఐ)ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలతో ఇది తాజా వివాదంలో చిక్కుకుంది. ఈ ఆందోళనలు చాలా ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి.
పీఎఫ్ఐపై నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖను కూడా కోరింది.
కానీ, యూపీ సర్కారు చర్యలను నియంతృత్వ చర్యగా వర్ణిస్తోంది పీఎఫ్ఐ.
సంస్థ స్థాపన నుంచీ వివాదాలే
కర్ణాటక 'ఫోరం ఫర్ డిగ్నిటీ' (కేడీఎఫ్), తమిళనాడులోని మనిద నీతి పసరై, నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ అనే మూడు సంస్థల కలయికతో ఈ కొత్త సంస్థ ఏర్పాటైంది. దీని శాఖలు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఆ తర్వాత మరికొన్ని సంస్థలు పీఎఫ్ఐలో కలిశాయి. వాటిలో 'గోవాలోని సిటిజన్ ఫోరం', రాజస్థాన్‌లోని 'కమ్యూనిటీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ', పశ్చిమ బంగాల్‌లోని 'పౌరసత్వ హక్కుల సురక్షా కమిటీ', మణిపూర్ 'లిలోంగ్ సోషల్ ఫోరం', ఆంధ్రప్రదేశ్‌లోని 'అసోసియేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్' ఉన్నాయి.
కేరళలో ప్రొఫెసర్‌పై దాడి
కానీ స్థాపించిన నాలుగేళ్లలోనే పీఎఫ్ఐను వరుసగా ఆరోపణలు చుట్టుముట్టడం మొదలైంది.
దీనిపై మొట్టమొదటి ఆరోపణ 2010 జులై 4న జరిగిన ఘటన గురించి వచ్చింది. ఆ రోజు కేరళలోని తోడుపూజాలో కాలేజీ ప్రొఫెసర్ టీజే థామస్‌ను ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్న కొందరు, ఆయన చేతిని మణికట్టు వరకూ నరికేశారు.
ప్రొఫెసర్ థామస్ తమ కాలేజీ ప్రశ్నపత్రంలో కొన్ని అభ్యంతర ప్రశ్నలను ప్రస్తావించారు. దాంతో ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.
తర్వాత ఆయనపై దాడి జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన వారిలో పీఎఫ్ఐ సభ్యులు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే సంస్థ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. దీనిని ఒక కుట్రగా వర్ణించింది.
ఝార్ఖండ్‌లో నిషేధం
అదే ఏడాది ఆగస్టు వరకూ కేరళ పోలీసులు పీఎఫ్ఐ స్థావరాలపై వరుస దాడులు చేశారు. ఎన్నో పత్రాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
నిషేధిత సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కి పీఎఫ్ఐ అనుబంధంగా ఉందని కూడా వారు వాదించారు.
అంతే కాదు, పీఎఫ్ఐ కార్యకర్తలపై దాడులు చేసినప్పుడు అతివాద సంస్థ అల్ ఖైదా ప్రచార సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామని కేరళ పోలీసులు చెప్పారు.
పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగుచూసిన రాష్ట్రం కేరళ ఒక్కటే కాదు. 2018లో ఝార్ఖండ్ ప్రభుత్వం కూడా ఈ సంస్థపై నిషేధం విధించింది. దానిని ఆ తర్వాత ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది.
ఝార్ఖండ్ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో పీఎఫ్ఐపై మరోసారి నిషేధం విధించింది.
పీఎఫ్ఐపై సందేహాలు
"ఈ సంస్థకు వివిధ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. సంస్థ కార్యకర్తలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి" అని ఆ తర్వాత విడుదలైన ఒక ప్రకటనలో ఝార్ఖండ్ ప్రభుత్వం ఆరోపించింది.
2012లో జరిగిన అల్లర్ల తర్వాత అస్సాంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎస్ఎంఎస్‌లు పంపించడం వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2012లో ఆగస్టు 12న ఒక్కరోజే ఈ సంస్థ ద్వారా 60 కోట్ల విద్వేషపూరిత ఎస్ఎంఎస్‌లు పంపించారని ఆరోపిస్తున్నాయి. పీఎఫ్ఐ మాత్రం అందులో తమ ప్రమేయం లేదని చెబుతోంది.
పీఎఫ్ఐ ఎప్పుడూ తమపై వచ్చే ఆరోపణలను కొట్టిపారేస్తూ వస్తోంది. "తమ సంస్థ 'సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా' (ఎస్‌డీపీఐ)కు సంబంధించినది, అందుకే, 2006లో జరిగిన విలీనం తర్వాత ఎస్‌డీపీఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అబూ బాకర్‌నే పీఎఫ్ఐ చైర్మన్‌గా చేశాం" అని చెబుతోంది.
పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హింసకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా పీఎఫ్ఐపై సందేహాలు వ్యక్తం చేసింది. ఆ సంస్థపై నిషేధం విధించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కోరింది.
బల ప్రదర్శన ఆరోపణ
అటు, కేంద్రం కూడా యూపీ, దిల్లీలో జరిగిన హింసలో పీఎఫ్ఐ హస్తం ఉండవచ్చని భావిస్తోంది.
కానీ, దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయని సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.మొహమ్మద్ అలీ జిన్నా ఒక పత్రికా ప్రకటన ద్వారా ఆరోపించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే వాటిని అణచివేయడానికి 'బల ప్రదర్శన' చేస్తున్నారని ఆరోపించారు.
"ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పీఎఫ్ఐకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య కార్యకలాపాలకు విరుద్ధంగా యోగీ పోలీసుల మరో నియంతృత్వ చర్య" అని పీఎఫ్ఐ తన ప్రకటనలో చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- చరిత్రలో తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్.. వ్యవసాయాన్ని ఇది ఆదుకొంటుందా?
- ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
- భారత్‌లోకి దిగుమతి అవుతున్న 66 శాతం బొమ్మలతో పిల్లలకు ప్రమాదం
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- ‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)