ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ గురువారం అసెంబ్లీ మార్షల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ విమర్శించింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో వీడియో క్లిప్‌ను ప్రదర్శించింది.

అసెంబ్లీ గేటు మూసివేయడంతో తాను లోపలికి వెళ్లకూడదా అంటూ చంద్రబాబు మార్షల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం, లోకేశ్ కూడా అదే స్థాయిలో మాట్లాడటం ఈ వీడియోలో కనిపించింది.

సభ ప్రారంభం నుంచి దీనిపై తీవ్రస్థాయి చర్చ జరిగింది.

ప్రతిపక్షనేత చంద్రబాబు సభలో మాట్లాడుతూ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనను కూడా అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని అన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎప్పుడూ ఇలా చేయలేదని చెప్పారు. తమను మార్షల్స్‌తో అవమానించారని అన్నారు.

''మమ్మల్ని అవమానించి ఆనందపడాలని మీరు అనుకుంటున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేం ముందుకు వెళ్తాం. పాలన అంటే ప్రతిపక్షాలను కూడా గౌరవించేవిధంగా ఉండాలి కానీ, ఉన్మాది పరిపాలనగా ఉండరాదని అన్నాను. లోపలికి రాకుండా అడ్డుకోవడంతోనే నేను గట్టిగా మాట్లాడాను తప్పితే ఎవరినీ అవమానించాలని కాదు' అని చంద్రబాబు వివరణ ఇచ్చారు.

తర్వాత స్పీకర్ మాట్లాడుతూ, ''చంద్రబాబు అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడారు. దీనిపై సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్వేగంలో అన్నారని అర్థం చేసుకుంటున్నాం. కానీ, దయచేసి మీరు చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వెలిబుచ్చితే బాగుటుంది'' అని సూచించారు.

చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, లోకేష్ కూడా అధికారుల గొంతుపట్టుకున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ''అధికారుల గొంతుపట్టుకోవడం ఏంటి? ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారు?" అంటూ ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును చీఫ్ మార్షల్‌ తోసేశారని, తాము చేసిన తప్పేంటో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. మార్షల్స్ తమపై దాడి చేశారని ఆరోపించారు.

అంతకుముందు మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ''40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు, ఆయన తనయుడు శాసన సభ మార్షల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీశారు. మార్షల్స్‌ను పీకపట్టుకొని బెదిరించారు'' అని అన్నారు.

ప్రతిపక్షనాయకుడు సభా మర్యాదలను మరిచిపోయారని, ఘటనపై సభాపతి చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ కోరారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చి మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ప్రతిపక్షనాయకుడే సభా మర్యాదలను మరిచిపోయారని, టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)