You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిరణ్ మజుందార్ షా: 'ఆర్థిక వ్యవస్థపై విమర్శలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు'
'అమిత్ షాగారూ మీ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రజలు భయపడుతున్నారు' అని రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలకు బయోకాన్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మంజుందార్ షా కూడా మద్దతు పలికారు.
"భారత ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన పరిష్కారాలు, సూచనల కోసం ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను సంప్రదిస్తుందనే ఆశిస్తున్నా. ఇప్పటి వరకూ మనం దూరంగానే ఉన్నాం, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గురించి ఎలాంటి విమర్శనూ వినేందుకు సిద్ధంగా లేదు" అని షా ట్విటర్లో పోస్ట్ చేశారు.
బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ భారత ఆర్థిక వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన తర్వాత రోజే షా ఈ పోస్ట్ చేశారు.
అంతకు ముందు, దేశంలో భయంతో కూడిన వాతావరణం ఉందని, ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రజలు భయపడుతున్నారని.. ప్రభుత్వం విమర్శను స్వీకరిస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదని పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అన్నారు.
'ఎకనమిక్ టైమ్స్' అవార్డు ఫంక్షన్‌కు హాజరైన రాహుల్ బజాజ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్‌లు ఉన్న ఒక ప్యానల్‌ను ''ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రజలకు ఎందుకివ్వడం లేదు' అని ప్రశ్నించారు. ఎకనమిక్ టైమ్స్ తన యూట్యూబ్ చానల్‌లో ఉంచిన ఈ కార్యక్రమ వీడియోలోనూ రాహుల్ బజాజ్ సంధించిన ప్రశ్న వినొచ్చు.
యూపీయే ప్రభుత్వ కాలంలో ప్రజలకు ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ ఉండేదని, కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో భయానక వాతావరణం ఉందని రాహుల్ బజాజ్ అన్నట్లుగా మీడియా సంస్థలు తెలిపాయి.
''యూపీఏ-2 పాలన ఉన్నప్పుడు విమర్శించగలిగేవాళ్లం. మీరిప్పుడు బాగా పనిచేస్తున్నారు. కానీ, మేం ఏ విషయంలోనైనా విమర్శించాలనుకుంటే మాత్రం దాన్ని మీరు అభినందిస్తారన్న నమ్మకం లేదు'' అన్నారాయన.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారత జీడీపీ 4.5గా నమోదైందని.. ఇది గత ఆరున్నరేళ్లలో అత్యల్పమని నేషనల్ స్టేటిస్టిక్స్ ఆఫీసు నుంచి గణాంకాలు వెలువడిన మరుసటి రోజే బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, రాహుల్ బజాజ్ వ్యాఖ్యలకు అమిత్ షా స్పందిస్తూ ''మీరిప్పుడు ప్రశ్నించిన తరువాత.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జనం భయపడుతున్నారని నేనే మాత్రం అనుకోను'' అన్నారు.
''ఎవరూ భయపడాల్సిన అవసరమే లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మీడియా నిత్యం విమర్శిస్తూనే ఉంది. అయినా, ప్రశ్నించడానికి, విమర్శించడానికి భయపడే వాతావరణం ఉందని మీరనుకుంటే ఆ పరిస్థితి లేకుండా చేయడానికి మేం కృషిచేస్తాం'' అన్నారు.
ఇవి కూడా చదవండి.
- మహారాష్ట్ర: బీజేపీకి అధికారాన్ని దూరం చేసిన ఆ ఆరు తప్పులు.. ఈ పరాభవానికి ఫడణవీస్ ఒక్కరే బాధ్యులా?
- శివసేన హిందుత్వం, కాంగ్రెస్ లౌకికవాదం ఇప్పుడు ఏమవుతాయి?
- రాజకీయ చదరంగంలో అమిత్ షాపై శరద్ పవార్ ఎలా గెలిచారు.. అసలు చాణక్యుడు ఎవరు?
- మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఎలా జరిగిందంటే...
- మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది
- మహారాష్ట్ర: నాలుగు రోజులకే సీఎం ఫడణవీస్ రాజీనామా, ఈ రాజకీయాలు చెబుతున్నదేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)