తెలంగాణ ఆర్టీసీ సమ్మె: మూడు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం

ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీ నియామకం ఎందుకు చేపట్టలేదని, కార్మిక సంఘాలతో ఎందుకు చర్చలు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

"ప్రభుత్వం అంటే తండ్రి పాత్ర పోషించాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని వ్యాఖ్యానించింది.

సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాఠశాలల తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని అడిగింది.

ప్రజలే ప్రజాస్వామ్యం.. ప్రజలకన్నా ఎవరూ గొప్పవారు కాదు అని స్పష్టం చేసింది.

రేపు ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలని, 3 రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేసింది.

కార్మిక సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ శాంతియుతంగా జరిగితే తమకేమీ అభ్యంతరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఆర్టీసీ జేఏసీ తరపున వాదనలు వినిపించిన దేశాయ్ ప్రకాశ్ రెడ్డి... "చర్చల కోసం రెండు సార్లు ప్రభుత్వ న్యాయవాదులకు ఫోన్లు చేశాం. కానీ స్పందన లేదు. ప్రభుత్వంలో విలీనం చేస్తే తప్ప చర్చలు లేవు అని తాము ఎప్పుడూ చెప్పలేదు. మా డిమాండ్లు మీ ముందు పెడతాం. ఏవి సాధ్యమో, ఏవి కావో చెప్పండి. అన్ని సమస్యలనూ కోర్టులే తేల్చాలి అంటే కుదరదు, కొన్నింటికి చర్చలతో పరిష్కారం దొరుకుతుంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)