కశ్మీర్‌కు వెళ్లేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు

    • రచయిత, అభిమన్యు కుమార్ సాహా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

24 ఏళ్ల అలీమ్ సయ్యద్ ఉద్యోగ రీత్యా దిల్లీలో ఉంటున్నాడు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అతడి స్వస్థలం.

గత ఆగస్టు 17న అతడి సోదరుడి వివాహం జరిగింది. దీనికి హాజరుకావాలని అతడు ఒక నెల ముందే విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు.

ఈ పెళ్లి ఏర్పాట్ల గురించే ఆగస్టు 4 రాత్రి అతడు కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా కాల్ కట్ అయ్యింది.

జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి, అక్కడ కర్ఫ్యూ విధించారని ఆ మరుసటి రోజు ఉదయం అలీమ్‌కు తెలిసింది.

ఆ తర్వాత అతడి విమాన టికెట్ క్యాన్సల్ అయినట్లు మెయిల్ వచ్చింది.

సోదరుడు పెళ్లికి అలీమ్ వెళ్లలేకపోయాడు.

కశ్మీర్‌లో మొబైల్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోవడంతో కనీసం ఇంట్లోవారితో ఫోన్‌లోనైనా మాట్లాడలేకపోయాడు.

దీనికితోడు అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయన్న వార్తలు రావడంతో అతడిలో ఆందోళన రేగింది.

ఇంట్లోవారు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు అలీమ్ కశ్మీర్ వెళ్లాలనుకున్నాడు. కానీ, ప్రభుత్వ ఆంక్షలు అతడికి అవరోధంగా మారాయి.

దీంతో కశ్మీర్‌కు వెళ్లేందుకు తనను అనుమతించాలంటూ అలీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అలీమ్ పిటిషన్‌ను విచారించింది. అలీమ్‌ తన ఇంటివరకూ సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది.

దిల్లీకి తిరిగివచ్చాక కశ్మీర్‌లో ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని కూడా అలీమ్‌ను కోర్టు ఆదేశించింది.

''అనంత్‌నాగ్‌లో పరిస్థితులు బాగా లేవు. శ్రీనగర్ దాకా వెళ్లినా, అక్కడి నుంచి ఇంటికి చేరుకోగలనన్న నమ్మకం లేదు. ఎయిర్‌పోర్ట్‌కు ఇంట్లోవాళ్లకి రమ్మని చెప్దామన్న, ఫోన్‌లు పనిచేయట్లేదు. అందుకే నాలో ఆందోళన పెరిగింది. నేను లా చదువుకున్నా. ఏమేం ఆప్షన్స్ ఉంటాయో నాకు తెలుసు. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించా'' అని అలీమ్ చెప్పాడు.

బుధవారం సుప్రీం కోర్టు అలీమ్ పిటిషన్‌తోపాటు మరో 13 పిటిషన్లను కూడా విచారించింది.

వాటిలో సీపీఎం నేత సీతారాం ఏచూరి తరఫున దాఖలైన పిటిషన్ కూడా ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్‌మై తరిగామిని కలిసేందుకు తాను కశ్మీర్ వెళ్లాలనుకుంటున్నట్లు ఏచూరి కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినా, కోర్టు ఏచూరికి అనుమతి మంజూరు చేసింది.

''ఆయన ఈ దేశ పౌరుడు. తన మిత్రుడిని కలవాలనుకుంటున్నారు. ప్రభుత్వం ఆయన్ను ఆపలేదు'' అని సీజేఐ వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో ఏచూరి ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు వీల్లేదని, కేవలం తరిగామిని మాత్రమే కలిసి రావాలని కోర్టు స్పష్టం చేసింది.

గురువారం ఏచూరి శ్రీనగర్ వెళ్లారు. అయితే, ప్రభుత్వం ఆయన్ను ఎయిర్‌పోర్ట్ నుంచే తిప్పిపంపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)