కశ్మీర్: శ్రీనగర్ సౌరాలో రాళ్లు రువ్విన ఘటన జరిగింది: భారత హోం శాఖ

శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో గత శుక్రవారం నమాజు తర్వాత రాళ్లు రువ్వుకున్న ఘటనలు జరిగాయని భారత ప్రభుత్వం అంగీకరించింది.

హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒక ట్వీట్‌లో "శ్రీనగర్ సౌరా ప్రాంతంలో కొన్ని ఘటనలు జరిగాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆగస్టు 9న కొంతమంది స్థానికులు మసీదు నుంచి నమాజు చేసి వస్తున్నారు. వారిలో కొన్ని అల్లరిమూకలు కూడా ఉన్నాయి. అశాంతి సృష్టించడానికి వారు అకారణంగా భద్రతాదళాలపై రాళ్లు రువ్వారు. కానీ భద్రతాదళాలు సంయమనం పాటించాయి. శాంతిభద్రతలను కాపాడ్డానికి ప్రయత్నించాయి. మేం ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఇప్పటివరకూ కశ్మీర్‌లో ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించలేదు’’ అన్నారు.

ఇంతకు ముందు బీబీసీ కూడా ఒక వీడియో ద్వారా శుక్రవారం శ్రీనగర్ సౌరా ప్రాంతంలో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయని చెప్పింది.

ఆందోళనకారులను చెల్లాచెదురు చేయడానికి భద్రతాదళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయని, పెల్లెట్ గన్ ఉపయోగించారని చెప్పింది.

కానీ, అప్పుడు భారత ప్రభుత్వం అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం తన స్వరం మార్చింది.

హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి అప్పుడు చేసిన ట్వీట్‌లో "మొదట రాయిటర్స్, తర్వాత డాన్ ఒక న్యూస్ రిపోర్ట్ ప్రచురించాయి. అందులో శ్రీనగర్‌లో వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయని, వాటిలో పది వేల మంది పాల్గొన్నారని రాశారు. ఇది పూర్తిగా కల్పితం, తప్పుడు సమాచారం. శ్రీనగర్/బారాముల్లాలో చిన్న చిన్న వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి, కానీ వీటిలో 20 కంటే ఎక్కువమంది లేరు" అన్నారు. కానీ, ఇప్పుడు చేసిన ట్వీట్ దానికి భిన్నంగా ఉంది.

ఆ తరువాత తాము.. తమ కథనానికీ, పాత్రికేయ విలువలకు కట్టుబడి ఉన్నట్లు బీబీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)