విజయనిర్మల: "నిగర్వి, నమ్మిన విలువలకు కట్టుబడిన మనిషి"

    • రచయిత, అనిల్ అట్లూరి
    • హోదా, బీబీసీ కోసం

తెలుగు నవలలకు అది స్వర్ణయుగం. తెలుగు రచయితలకు కూడా. రచయితల కంటే రచయిత్రులకే అని చెప్పుకోవాలి. అప్పట్లో చలనచిత్ర రంగం మద్రాసులో ఉండేది. చిత్ర పంపిణీదారులందరూ దాదాపుగా విజయవాడలో ఉండేవారు. సీడెడ్ పంపిణీదారులు గుంతకల్లులో ఉండేవారు.

చిత్ర పరిశ్రమకు చెందినవారు చాలా మంది అప్పట్లో మంచి పాఠకులు. ఆఫీసు బాయ్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు... ఎంతో కొంత వారికున్నంతలో చదువు ఉండేది. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు సరే సరి.

మా నాన్న రచయిత కావడం, మాతామహులు 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి కావడంతో, కుటుంబ నేపథ్యంలో సాహిత్యం ఉండటం మూలంగా, అమ్మ చౌదరాణి కూడా అడపాదడపా రాస్తుండడం మూలంగా తనకు కొంత గుర్తింపు ఉండేది.

రాణి బుక్ సెంటర్ తను స్థాపించి, నిర్వహించడం అన్నది సామాన్య విషయం కాదుగాని ఆ రోజుల్లో ఒక స్త్రీ, ఒక వితంతువు వ్యాపారంలోకి ప్రవేశించడం అసామాన్య విషయం. దానికి ఎంతో ధైర్యం కావాలి. నిబ్బరం ఉండాలి. క్రమశిక్షణ ఉండాలి. మంచీ, చెడు పట్ల విచక్షణ ఉండాలి. జీవితం పట్ల ఒక అవగాహన ఉండాలి.

విజయనిర్మలకు అవన్నీ ఉన్నాయి. ఆమె నిగర్వి కూడా. బహుశా అదే అనుకుంటాను విజయనిర్మలను మా అమ్మ చౌదరాణిని కలిపింది. ఇందాక అన్నట్టు విజయనిర్మల కూడా మంచి పాఠకురాలు.

చక్రపాణి 'యువ' మాసపత్రికలో యద్దనపూడి సులోచనారాణి 'మీనా' నవల సీరియల్ గా వచ్చినప్పుడే పాఠకుల ఆదరణ పొందింది. (అప్పట్లో దానిని రెండు భాగాలుగా విజయవాడలోని కప్పగంతుల మురళీకృష్ణ తమ క్వాలిటీ పబ్లిషర్స్ ద్వారా ప్రచురించారు. అప్పట్లో యద్దనపూడి నవలలన్నింటికీ దాదాపుగా వారే ప్రచురణకర్తలు.)

'మీనా' నవలను తెరకెక్కించడానికి విజయనిర్మల ఆలోచన రూపు దిద్దుకునే క్రమంలో ఆ నవల మీద, సినిమా అడాప్టేషన్‌కున్న పరిమితుల మీద, తన దర్శకత్వపు బాధ్యతల మీద కొంత చర్చ జరిగింది. అప్పట్లో వస్తున్న సాహిత్యం, ముఖ్యంగా నవలా సాహిత్యం మీద వారిద్దరి మధ్య చర్చ ఉండేది. అప్పట్లో లాండ్ ఫోన్లు కదా!

'మీనా' షూటింగ్ అప్పుడే విజయనిర్మల మీద కంటే కూడా ఆమె 'దర్శకత్వం' మీద జోకులు వేసుకునేవారు. నాకు బాగా గుర్తు. విజయకృష్ణ యూనిట్‌లో అసిస్టెంటు డైరెక్టరు ఒకరు అమ్మ వద్ద విజయనిర్మల దర్శకత్వం మీద జోకు లేస్తుంటే తను చీవాట్లు పెట్టింది... "ఆడవాళ్లంటే మీకు మరీ అలుసైపోయింది" అంటూ.

'మీనా' ప్రీవ్యూకు విజయనిర్మల ప్రత్యేకంగా ఫోన్ చేసి, "కారు పంపిస్తాను, రండి" అని అమ్మను అహ్వానించారు. వారిద్దరి మధ్య స్నేహం అది.

సినిమాల్లో బ్రేక్ కోసం కథలు పట్టుకుని చాలా మంది దర్శకుల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరుగుతూ వాళ్లకు తమ కథలను వినిపిస్తుంటారు.

ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

అలా ఒకే కథను ఆ రచయిత ఏ ఇద్దరికో, ముగ్గురికో, పది మందికో చెప్పేవాడు.

ఏ సినిమాలోనో ఆ కథలో ఒకటో, రెండో పాయింట్లో కనబడితే, "నా కథను కాపీ కొట్టేశారండి," అని ఆక్రోశం వెళ్లగక్కేవారు.

ఒక్కోసారి కథను పూర్తిగా ఎవరైనా 'లేపేసే' వారు. పెద్దవాళ్లు ఏదో 'సెటిల్' చేసేవారు.

ఆ రోజుల్లో ఒక ఔత్సాహిక అసోసియేట్ డైరెక్టర్ కథ ఒక నవలగా వెలువడింది. ఆ నవలను ఒక దర్శకుడో/నిర్మాతో కొనేసారు. అది ఆ 'అసోసియేట్ డైరెక్టర్'కు తెలిసింది. కథ కోర్టుకు వెళ్ళింది.

ఆ 'లిటిగేషన్' గురించి విజయనిర్మల తెలుసుకుని ఆ 'అసోసియేట్ డైరెక్టర్'నే సమర్థించింది. న్యాయాన్యాయాల విచక్షణ అది.

ఏది ఏమైనా తెలుగు చలనచిత్ర రంగం మద్రాసులో ఉన్నన్నాళ్లు సినిమా-సాహిత్యం రెండూ చెట్టాపట్టాలేసుకుని తిరిగాయి. హైదరాబాద్‌కు వచ్చాక సాహిత్యమూ, సినిమా రెండింటి మధ్య కాస్త దూరం పెరిగినట్టే ఉంది.

చలనచిత్ర రంగంలో స్త్రీలకు విజయనిర్మల స్ఫూర్తి ప్రదాత. ఆమె ఒక చలనచిత్ర నిర్మాతగా, ఒక దర్శకురాలిగా, ఒక గృహిణిగా తన బాధ్యతలను నిర్వహించిన వ్యక్తి. ఆమె తను నమ్మిన విలువలకు కట్టుబడిన మనిషి.

(ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మల జూన్ 27 గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అనారోగ్యంతో మరణించారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)