You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిరిసిల్ల రాజేశ్వరి: ఆమె కాళ్లు కలం పట్టాయి.. కవితలు రాశాయి
- రచయిత, ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్
- హోదా, షూట్/ఎడిట్: నవీన్
పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు బూర రాజేశ్వరి. తెలంగాణలోని సిరిసిల్ల ఆమె స్వస్థలం. చాలా మందికి ఆమె సిరిసిల్ల రాజేశ్వరిగానే తెలుసు.
వైకల్యంతో చేతులు పనిచేయకపోయినా, కాళ్లతో కలాన్ని పట్టి 700 కవితలు రాసి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకున్నారామె.
అవోరాధాలన్నింటినీ అధిగమించి, తన 40వ ఏట ఇంటర్మీడియట్ పాసై అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
జీవిత ప్రయాణంలో రాజేశ్వరి పడిన కష్టాల గురించి ఆమె తల్లి బూర అనసూయ వివరించారు.
''ఈ అమ్మాయి పుట్టినంక బోర్లా పడలేదు, అంబాడలేదు (పాకలేదు), నడవలేదు, కూసోలేదు (కూర్చోలేదు). పదేండ్ల పిల్ల అయ్యేదాకా ఎటు పోయినా గానీ ఎత్తికొని పోయిన నేను. కానీ నా బిడ్డకు చానా ధైర్యం. కష్టపడి నడవడం నేర్సుకుంది. చదువుకుంటా అన్నది. బడికి పొయ్యేటప్పుడు పడతవ్ అన్నా. అయినాగానీ పడో లేచో.. పడితే పడత అని బడికి పోయింది'' అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు అనసూయ.
ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు రాజేశ్వరి ఏకలవ్య శిష్యురాలు.
ఆయన పాటలు, మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి.
రాజేశ్వరి గురించి మహా న్యూస్ విలేకరి ద్వారా తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ, తన భార్య నిర్మలతో కలిసి సిరిసిల్లకు వెళ్లి ఆమెను కలిశారు.
తన తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారం కూడా ఆయన రాజేశ్వరికి బహుకరించారు.
రాజేశ్వరి రాసిన 350 కవితలను పుస్తకంగా తీసుకువచ్చి, రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి.. రాజేశ్వరి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెప్పారు.
రాజేశ్వరి పేరిట కేసీఆర్ పది లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు.
రాజేశ్వరి కాళ్లతో కవితలు రాయడం చూసి ఆశర్యపోయానని, ఇప్పటికీ ఆమె ప్రతి విషయాన్నీ తనతో పంచుకుంటారని అశోక్ తేజ చెప్పారు.
''రాజేశ్వరి డాడీ అంటది నన్ను'' అంటూ సంతోషంగా తన అనుభవాలను వివరించారు.
తన జీవితంతో పాటు చుట్టూ సమాజంలో కనిపించే, వినిపించే విషయాలనే కవితలుగా రాస్తానంటున్నారు రాజేశ్వరి.
తన వద్ద మరో 350 కవితలు ఉన్నాయని, వాటిని త్వరలోనే ముద్రిస్తానని చెప్పారు.
కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటర్ పాస్ అయ్యానని, డిగ్రీ కూడా పూర్తిచేయాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు.
తన వంతుగా ఇతరులకు సేవ చేసేందుకు, కళ్లను దానం చేయాలని రాజేశ్వరి నిర్ణయించుకున్నారు.
నిజానికి రాజేశ్వరికి మాట సరిగ్గా రాదు.
అయినా, కష్టపడి పదాలన్నీ కూడదీసుకుంటూ.. ''హలో ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి. కష్టాలొస్తే ధైర్యంగా ఉండాలి. భయపడొద్దు, భయపడి చనిపోవద్దు. ఓకే.. బై'' అని చెప్పారామె.
ఇవి కూడా చదవండి:
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ‘100 మందిని చంపేసి నదిలో పడేశారు’.. సూడాన్ నరమేధం
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)