You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జయప్రదపై ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు... అఖిలేష్ మౌనంపై ప్రశ్నలు :లోక్‌సభ ఎన్నికలు 2019
సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ఆదివారం రాంపూర్‌లో జరిగిన ఒక ఎన్నికల బహిరంగ సభలో జయప్రదను ఉద్దేశించి అన్నట్లు వస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
ఆ సభలో ఖాన్ "రాంపూర్ ప్రజలకు ఎవరిని అర్థం చేసుకోడానికి 17 ఏళ్లు పట్టిందో, వారిని నేను 17 రోజుల్లోనే గుర్తించా. వారి అండర్ వేర్ రంగు ఖాకీ" అన్నారు.
ఆజం ఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్, సుష్మా స్వరాజ్ సహా దేశంలోని సీనియర్ మహిళా నేతలందరూ వ్యతిరేకించారు.
ఆజం ఖాన్‌కు నోటీసు జారీ చేసిన జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు.
దీనితోపాటు ఆజం ఖాన్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన జయప్రద ఆజం ఖాన్ అభ్యర్థిత్వం రద్దు చేయాలని, ఆయన లాంటి వారు ఎన్నికల్లో గెలిస్తే సమాజంలోని మహిళల పరిస్థితి ప్రమాదంలో పడుతుందని అన్నారు.
దానితోపాటు సోషల్ మీడియాలో కూడా రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకూ ఆజం ఖాన్ వ్యాఖ్యలపై అఖిలేష్ మౌనంగా ఉండడాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇటు, ఆజం ఖాన్ వ్యాఖ్యలపై ఎలాంటి ప్రకటనా చేయని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాత్రం ఆయనతో చేతులు కలిపి తీసుకున్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు.
జయప్రద ఏమన్నారు.
దీనిపై మాట్లాడిన జయప్రద "ఆయనకు ఇలా అనడం కొత్త కాదు. 2009లో నేను ఆయన పార్టీ అభ్యర్థిగా ఉన్నాను. పార్టీలో ఉన్నా కూడా అఖిలేష్ నాకు మద్దతు ఇవ్వలేదు. అప్పుడు కూడా నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆజం ఖాన్‌కు అది అలవాటే. ఆయన్ను ఆ అలవాటు వదలదు. ఆజం ఖాన్ అలాంటి వ్యాఖ్యలు చేయకపోతేనే అది కొత్త విషయం అవుతుంది" అన్నారు.
"కానీ ఆయన స్థాయి ఎంతకు దిగజారిందంటే.. ఆజం ఖాన్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతోనే ఆటలాడుకుంటున్నారు. నేను ఒక మహిళను. నాపై ఆయన చేసిన వ్యాఖ్యను నేను నా నోటితో చెప్పలేకపోతున్నాను. ఈసారీ ఆయన హద్దులు మీరారు. నా ఓపిక నశించింది. ఇప్పుడు నాకు ఆయన సోదరుడే కాదు, అసలు ఎవరూ కాదు. నేను మిమ్మల్ని ఏం అన్నానని, నాపై ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే ఈ విషయం ప్రజల వరకూ చేరింది. ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం రద్దు చేయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎన్నికల్లో గెలిస్తే, సమాజంలో మహిళలకు స్థానం లభించదు" అన్నారు.
అఖిలేష్ మౌనం ఎందుకు
ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాక విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఒక ట్వీట్ చేశారు.
అందులో "ములాయం భాయ్. మీరు సమాజ్ వాదీ పార్టీ పితామహులు. మీ కళ్ల ముందే రాంపూర్‌లో ద్రౌవతి వస్త్రాపహరణం జరుగుతోంది. మీరు భీష్ముడిలా మౌనంగా ఉండే పొరపాటు చేయకండి" అన్నారు.
ఈ వివాదం సోషల్ మీడియా నుంచి టీవీ తెర వరకూ చేరినా అఖిలేష్ యాదవ్ మాత్రం తన రాంపూర్ ర్యాలీ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు.
ఇవే ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా యూజర్స్ అఖిలేష్‌పై విరుచుకుపడుతున్నారు.
అద్వైతా కాలా అనే రచయిత తన ట్విటర్‌లో "ఆజం ఖాన్ మహిళలకు వ్యతిరేకంగా చెప్పలేని వ్యాఖ్యలు చేసినప్పుడు, నేను అక్కడే ఉన్నానని అఖిలేష్ యాదవ్ గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇక నాయకత్వంపై ఎలాంటి ఆశలూ లేవు, జాతీయ మహిళా కమిషన్, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. అన్నారు.
కౌస్తుభ్ మిశ్రా అనే ట్విటర్ యూజర్ "ఇప్పటివరకూ క్షమాపణ అడగనందుకు మీరు సిగ్గుపడాలి. సిగ్గులేకుండా మీరు ఇలాంటి ట్వీట్ ఎలా చేస్తారు. ఎస్పీ, బీఎస్పీ లాంటి చిన్న పార్టీల అత్యాశ ఆలోచనలు ఇలాగే ఉంటాయి" అన్నారు.
సోషల్ మీడియాలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే చాలా మంది యూజర్స్ కూడా అఖిలేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేక్ సింగ్ అనే ఒక ట్విటర్ యూజర్ "భయ్యాజీ, మెదడు అదుపులో పెట్టుకుని మాట్లాడమని ఆ ఆజం ఖాన్ గారికి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. రాంపూర్ లేదా దేశానికి ఆజం ఖాన్ అవసరం ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. మనమంతా మహిళ గర్భం నుంచే పుట్టాం. అది మనం మర్చిపోకూడదు. జయప్రద ప్రత్యర్థి కావచ్చు, కానీ ఆమె కూడా ఒక మహిళే" అన్నారు.
ఇటు ట్విటర్ యూజర్ మాయా మిశ్రా "మీ అమ్మ, అక్క దగ్గర కూడా ఇలాంటి భాషే ప్రయోగిస్తారా, ఆజం ఖాన్‌కు ఇంత మర్యాద ఇస్తున్నారు @yadavakhilesh అని రాశారు
అయితే, ఆజం ఖాన్ దీని మీద కూడా స్పందించడానికి నిరాకరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- BBC Fact Check: కాంగ్రెస్ పార్టీ బాల్ ఠాక్రేకు ఓటుహక్కు లేకుండా చేసిందా?
- మోదీ వ్యతిరేక 'నగ్న నిరసన'ను తమిళ రైతులు ఎందుకు విరమించుకున్నారు...
- BBC Fact Check: ఇందిరా గాంధీని వాజ్‌పేయీ 'దుర్గా' అని పిలిచేవారా...
- హేమామాలిని.. తమిళ సినిమాల నుంచి ఎందుకు తప్పుకున్నారు?
- BBC Reality Check: భారత్దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)