You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వయనాడు: 'కేరళ రాష్ట్రంలో మతపరమైన అంశాలకు ఓట్లు రాలవు...'
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళలోని వయనాడ్ లోక్‌స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ తుషార్ వెల్లపల్లిని బరిలోకి దించింది.
కేరళలోని మిగతా ప్రాంతాల తరహాలోనే వయనాడు ప్రజలూ ఓటు వేసే విషయంలో మతపరమైన అంశాలను పట్టించుకోరని భారత ధర్మ జనసేన (బీడీజీఎస్) పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి అంటున్నారు.
రాజకీయపరమైన విషయాలపైనే ఇక్కడి ప్రజల నిర్ణయాలు ఉంటాయని ఆయన బీబీసీతో చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలోకి దిగుతుండటంతో వయనాడు లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎన్నికల్లో ప్రాధాన్యం ఏర్పడింది. గురువారం ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.
రాహుల్‌పై తుషార్ ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
హిందువుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగానే రాహుల్ వయనాడుకు పారిపోయారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు భిన్నమైన వైఖరి తుషార్ వ్యాఖ్యల్లో వినిపించింది. తమకు ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వర్గాల ఓట్లూ వస్తాయని తుషార్ అన్నారు.
''అభివృద్ధి అనేది ఇప్పుడు ఎన్నికల అంశం. మోదీ తిరిగి అధికారంలోకి వస్తారని అందరికీ వంద శాతం నమ్మకం ఉంది. ప్రజలు ఆయనకే మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు. రాహుల్ మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు'' అని తుషార్ అన్నారు.
తుషార్ కేరళలో నేషనల్ డెమాక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కన్వీనర్‌గా ఉన్నారు.
''బయటివారు వచ్చి ఇక్కడ పోటీ చేయడం కేరళ ప్రజలకు నచ్చదు. అందరూ నాకే ఓటు వేస్తారు'' అని ఆయన చెబుతున్నారు.
కేరళలోని కాంగ్రెస్ నాయకులే రాహుల్‌ను పోటీకి ఆహ్వానించారు కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ''లేదు. వయనాడు సీటుకు తన పేరు ప్రతిపాదించాలని రాహులే వారికి సూచించారు. అమేఠీలో ఓడిపోతున్నందునే ఆయన ఇక్కడికి వస్తున్నారు'' అని తుషార్ వ్యాఖ్యానించారు.
మొదట త్రిస్సూర్ లోక్‌సభ సీటుకు తుషార్ పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, రాహుల్‌పై 'బలమైన ప్రత్యర్థి' అవసరమన్న ఉద్దేశంతో వయనాడులో పోటీ చేయాలని తుషార్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోరారు.
తుషార్ తండ్రి నటేషన్ వెల్లపల్లి ఓ వ్యాపారవేత్త. బీడీజీఎస్‌ను స్థాపించింది ఆయనే. ఎళావా వర్గానికి చెందిన 'నారాయణ ధర్మ పరిపాలన యోగం' అనే సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.
గతంలో చాలా అంశాల్లో తుషార్, నటేషన్ ఒకరితో మరొకరు విభేదించుకున్నారు.
నటేషన్ అనేక విద్యాసంస్థలను నడుపుతున్నారు. మద్యం వ్యాపారం నుంచి ఇటీవలే రైల్వే కాంట్రాక్టుల వైపు మళ్లారు. అధికారంలో ఎవరుంటే వారికి సన్నిహితంగా ఉంటారన్న పేరు ఆయనకుంది.
''నటేషన్ పక్కా వ్యాపారి. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారం చేపట్టినా ఆయన పనులు చేయించుకుంటారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ వచ్చినా అవి జరుగుతాయి'' అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు మద్దతుగా కొన్ని నెలల క్రితం 'వుమెన్స్ వాల్' పేరుతో ఎల్‌డీఎఫ్ చేపట్టిన భారీ మానవహార ప్రదర్శనలో నటేషన్ పాల్గొన్నారు.
తుషార్ మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు తనకు తండ్రి మద్దతు ఉందని తుషార్ చెప్పారు.
''ఆయన నాతో ఉన్నారు. శబరిమల రాజకీయ అంశం కాదు. అందుకే ప్రభుత్వం అడిగిందని అందులో పాల్గొన్నారు. ఓబీసీ, ఇతర వర్గాలకు చెందినవారితో సహా చాలా మంది హిందువులు ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు'' అని అన్నారు.
''కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ పరస్పరం ప్రత్యర్థులు. ఇక్కడ ఎన్నికలు రాజకీయ అంశాలపైనే జరుగుతాయి. కానీ, మత సంస్థల ప్రభావం కూడా ఉంటుంది. వాటిని తేలిగ్గా తీసుకోలేం'' అని సీపీఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి ప్రకాశ్ బాబు బీబీసీకి చెప్పారు.
గత ఎన్నికల్లో వయనాడులో కాంగ్రెస్ అభ్యర్థి షానవాస్ చేతిలో సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్ 20వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చూశారు.
అయితే, ఈసారి అక్కడ మళ్లీ సీపీఐ ఆయనకే టికెట్ ఇచ్చింది.
కేరళ ఎన్నికల్లో రాజకీయ అంశాలే ప్రధానమన్న ప్రకాశ్ బాబు, తుషార్ అభిప్రాయాలతో ఏఐసీసీ కార్యదర్శి పీసీ విష్ణునాథ్ కూడా ఏకీభవించారు.
''ఇక్కడ ఉత్తర భారత్‌లా కాదు. మత నాయకులను ప్రజలు అనుసరించరు. అందుకే, భాజపా భయపడుతోంది. రాహుల్‌పై గెలుస్తామన్న ధీమా ఉంటే ఆ పార్టీనే సొంతంగా అభ్యర్థిని నిలిపి ఉండేది. వయనాడులో పోరు ఇప్పుడు ఏకపక్షమే'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సనాతన్ సంస్థ 'హిందుత్వ తీవ్రవాద' శిక్షణ కేంద్రమా?
- కరణ్ థాపర్‌పై నరేంద్ర మోదీ పాత ‘పగ’ తీర్చుకుంటున్నారా?
- మోదీ-తొగాడియాల దోస్తీ ఎక్కడ బెడిసి కొట్టింది?
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్: తిరుగులేని ఆధిపత్యం నుంచి ఉనికి కోసం పరుగు తీసే దశకు...
- ఎవరిని చూసి జనం ఓటు వేస్తారు..? పార్టీయా, ముఖ్యమంత్రి అభ్యర్థా, స్థానిక అభ్యర్థా - ఏడీఆర్ సర్వేలో ఏం తెలిసింది?
- ఏడీఆర్ సర్వే: చంద్రబాబు పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఎక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)