You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐపీఎల్‌లో మోదీని ఉద్దేశించి 'చౌకీదార్ చోర్ హై' అనే నినాదాలు వచ్చాయా: Fact Check
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం (ఈ నెల 25న) జైపూర్లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌కు సంబంధించి 24 సెకన్ల వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
''చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ)'' అనే నినాదాలను అక్కడి ప్రేక్షకులు చేశారని ప్రచారం జరిగింది.
ఈ వీడియోలో పంజాబ్ బ్యాట్స్‌మన్ నికలస్ పూరన్ క్రీజులో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ బంతి వేయడానికి రనప్ కోసం తిరిగి వెళ్తున్నారు.
ఆ సమయంలో ''చౌకీదార్ చోర్ హై'' అనే నినాదం వీడియోలో ఐదుసార్లు వినిపిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను దేశానికి కాపలాదారుగా చెప్పుకొంటుంటారు. తన చేతుత్లో భారత్ సురక్షితంగా ఉందని పేర్కొంటుంటారు.
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంలో, మోదీని ఉద్దేశించి 'కాపలాదారే దొంగ' అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
ట్విటర్, ఫేస్‌బుక్, షేర్‌చాట్‌లలో ఈ వీడియో కొన్ని వేలసార్లు షేర్ అయ్యింది. పెద్ద సంఖ్యలో యూజర్లు దీనిని చూశారు.
ట్విటర్‌లో లలిత్ దేవిస్ అనే ఒక యూజర్ స్పందిస్తూ- ''కాలం ఆడే ఆట ఎలా ఉంటుందో చూడండి. 2014 ఐపీఎల్లో 'మోదీ, మోదీ' అనే నినాదం వినిపించింది. 2019 ఐపీఎల్లో ఈ నినాదం స్థానంలో 'చౌకీదార్ చోర్ హై' అనే నినాదం వినిపిస్తోంది. కాలచక్రం ముందుకు కదులుతూనే ఉంటుంది'' అని వ్యాఖ్యానించారు.
ఫేస్‌బుక్‌లో ఇంచుమించు ఆరు భాషల్లో ఈ వీడియోను యూజర్లు షేర్ చేశారు.
కానీ ఈ వీడియోపై జరుగుతున్న ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు మొదలైంది. స్టేడియంలో ఓ మోస్తరు సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారు. పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది.
మొదటి ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ''ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు'' అనే ప్రశ్న మైకులోంచి వెలువడింది. అప్పుడు ప్రేక్షకుల నుంచి ''రాజస్థాన్ గెలుస్తుంది'' అనే స్పందన వచ్చింది.
15, 17 ఓవర్లలోనూ మ్యాచ్‌కు సంబంధించి ఈ నినాదాలు వినిపించాయి.
18వ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ మొదటి బంతి విసిరిన తర్వాత, స్టేడియంలో నార్త్ స్టాండ్ వైపు నుంచి ''మోదీ, మోదీ'' అనే నినాదాలు మొదలయ్యాయి.
స్టేడియం వెస్ట్ స్టాండ్‌లోంచి మ్యాచ్ చూసిన 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి జయంత్ చౌబే స్పందిస్తూ- స్టేడియంలోకి ప్రవేశించే ముందు సిబ్బంది తనిఖీలు బాగానే చేశారని తెలిపారు.
రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన ఎలాంటి సామగ్రినీ లోపలకు అనుమతించలేదని ఆయన చెప్పారు.
''మ్యాచ్ ప్రారంభంలో సంగీతం భారీస్థాయిలో ఉంది. కానీ 18వ ఓవర్లో నినాదాలు స్పష్టంగానే వినిపించాయి'' అని జయంత్ వివరించారు.
18వ ఓవర్లో ఉనద్కత్ రెండో బంతిని పంజాబ్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ కొట్టిన తర్వాత, నినాదాలు మారిపోయాయి. ప్రేక్షకుల్లోంచి ''చౌకీదార్ చోర్ హై'' అనే మాట పెద్ద శబ్దంలో వినిపించింది. ఈ నినాదం ఐదుసార్లు వినిపించింది.
ఈ మ్యాచ్ వీడియో మొత్తం హాట్‌స్టార్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
''మోదీ, మోదీ'' అనే నినాదానికి ప్రతిస్పందనగానే ''చౌకీదార్ చోర్ హై'' అనే నినాదాలు వినిపించాయి. కాబట్టి, స్టేడియంలో ''చౌకీదార్ చోర్ హై'' అనే నినాదాలు మాత్రమే వినిపించాయని చెప్పడం తప్పవుతుంది.
ఇవి కూడా చదవండి.
- క్రిస్ గేల్: బ్యాట్ పట్టిన పెను తుపాను.. పంజాబ్ జట్టు చరిత్రను తిరగరాస్తాడా?
- క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- గౌతం గంభీర్: క్రికెట్ నుంచి గర్వంగా తప్పుకుంటున్నాడు: అభిప్రాయం
- రోహిట్: ఏంటా వేగం.. ఏంటా బాదుడు?
- విరాట్ కోహ్లీకి ఐసీసీ అవార్డుల పంట.. ఎవరికీ సాధ్యం కానిది కోహ్లీకే సాధ్యమైంది
- ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ డైరీ: నారా లోకేశ్ నామినేషన్‌పై అధికారుల అభ్యంతరాలు
- మోదీ 'మేక్ ఇన్ ఇండియా' హామీలు ఏమయ్యాయి...
- ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 72 వేల వరకు ఇస్తాం: రాహుల్ గాంధీ
- ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి
- 'మిలిటెంట్ల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించిన కాంగ్రెస్' అనే ప్రచారంలో నిజమెంత...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)