You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీ ఇంట్లో అత్యంత అపరిశుభ్రమైనది ఏమిటో మీకు తెలుసా?
మీ ఇంట్లో అత్యంత అపరిశుభ్రమైనదేంటో మీకు తెలుసా?
ఈ ప్రశ్నకు అనుమానం లేకుండా చాలామంది ఇచ్చే సమాధానం... టాయిలెట్ అనో, నలుగురూ నడిచే నేల అనో.
కానీ అది కరెక్ట్ కాదు, టాయిలెట్ సీటు కన్నా ఎన్నో రెట్లు అపరిశుభ్రమైన ప్రదేశం అందరి ఇళ్లలోనూ, అదీ వంటగదిలో ఉంటుంది అంటే ఎవరైనా నమ్మగలరా?
అరిజోనా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం... వంటగదిలో ఉపయోగించే స్పాంజి లేదా గుడ్డ - ఇదే చాలామంది ఇళ్లలో ఉండే అత్యంత అపరిశుభ్రమైన వస్తువు.
గిన్నెలు తోమడానికి ఉపయోగించే స్పాంజిలు ఎన్నో రకాల బ్యాక్టీరియాకు నిలయాలు. ఎప్పుడూ తడిగానే ఉండే ఆ స్పాంజిలు, గుడ్డలు సూక్ష్మజీవుల వృద్ధికి అనుకూలంగా ఉంటాయి. దీంతో బ్యాక్టీరియా అక్కడ చాలా వేగంగా పెరుగుతాయి.
టాయిలెట్ సీటుపై ఒక్కో చదరపు అంగుళంలో 50 రకాల బ్యాక్టీరియా ఉంటాయని ఓ అంచనా. కానీ అంతే చదరపు అంగుళం విస్తీర్ణంలో... గిన్నెలు తోమే స్పాంజిలో కోటి రకాల సూక్ష్మజీవులుంటాయి. గిన్నెలు తోమే గుడ్డలో అయితే కనీసం 10 లక్షల రకాలుంటాయి.
అంటే టాయిలెట్ సీటు కన్నా గిన్నెలు తోమే స్పాంజి 200 రెట్లు ఎక్కువ మురికైన ప్రదేశమన్నమాట.
అందుకే ఈ స్పాంజిలను, గుడ్డలను ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. వారానికోసారి బ్లీచింగ్ పౌడర్ నీటితో శుభ్రం చేయాలి.
స్పాంజిలను ఎలా శుభ్రం చేయాలో 'గుడ్ హౌస్‌కీపింగ్' అనే మేగజీన్‌లో వివరించారు.
ఒకసారి ఒవెన్‌లో గానీ, డిష్ వాషర్‌లో గానీ వాటిని ఉంచవచ్చు.
మాంసాహారానికి సంబంధించిన వాటిని శుభ్రం చేయడానికి ఒక స్పాంజి, ఇతర అన్నింటికోసం మరొక స్పాంజి వాడటం మేలు.
వాటిని మరింత మెరుగ్గా శుభ్రం చేయడానికి ఓ చుక్క వెనిగర్ ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)