దేశాన్ని కాంగ్రెస్ పాలించింది ఎన్నేళ్లు? 60 ఏళ్లు - మోదీ.... కాదు 70 ఏళ్లు అమిత్ షా : Fact Check

ఫిబ్రవరి 7న 16వ లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ తన చివరి ప్రసంగాన్ని వినిపించారు. 2019 ఎన్నికల ముందు జరిగిన చివరి పార్లమెంట్ సమావేశాలు ఇవి.

తన ప్రసంగంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తన 55 నెలల పరిపాలనను, 55ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోలుస్తూ మాట్లాడారు.

2014 లోక్‌సభ ఎన్నికల ముందు కూడా నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని..

''మీరు 60ఏళ్ల పాలనను కాంగ్రెస్ పార్టీకి అందించారు. అందుకు ప్రతిగా, అధికార దుర్వినియోగం తప్ప వారు చేసిందేమిటి? నాకు 60 నెలల సమయం ఇస్తే, అన్నీ సరిచేస్తా..'' అని 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ అన్నారు.

2016లో పార్లమెంటులో ప్రసంగిస్తూ..

''గడిచిన 60ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం నిజంగా పని చేసివుంటే, ఇప్పుడు వాళ్లు కష్టపడేవాళ్లా? 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ సాగించిన అధికార దుర్వినియోగాన్ని మనం మరవలేం'' అన్నారు.

అలా.. దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనా కాలం మోదీ మాటల్లో మారుతూవచ్చింది. మోదీతోపాటు మరికొందరు బీజేపీ నేతలకు కూడా ఈ విషయంలో అయోమయం ఉన్నట్లుంది.

2014 మార్చిలో.. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 60ఏళ్లు పాలించిందని మోదీ ట్వీట్ చేశారు.

2018 నవంబర్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 70ఏళ్లపాటు పరిపాలించిందని అన్నారు.

ఈ విషయమై మేం చేసిన అధ్యయనంలో, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రత్యక్షంగా 54సంవత్సరాల, 4 నెలలు పాలించిందని, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలు మరో 2సంవత్సరాల, 10నెలలు పాలించాయని తేలింది.

ఇలా కాంగ్రెస్ మొత్తం పరిపాలనా కాలం 57సంవత్సరాల, 2నెలలు.

1947, ఆగస్టు 15నుంచి 1977, మార్చి 24వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ భారత దేశాన్ని పాలించింది.

ఈ 29ఏళ్ల పాలనా కాలం(29సంవత్సరాల, 7నెలల, 9రోజులు)లో జవహర్‌లాల్ నెహ్రూతో(29)పాటు లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారి లాల్‌నంద, ఇందిరా గాంధీలు ప్రధానమంత్రులుగా పనిచేశారు.

1980 జనవరి 14న మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 1989, డిసెంబర్ 2వరకు అధికారంలో కొనసాగింది. ఈ 9ఏళ్ల(9సంవత్సరాల 10నెలల, 19రోజులు) పాలనాకాలంలో ఇందిరా గాంధీ, ఆమె మరణానంతరం రాజీవ్ గాంధీలు ప్రధానులుగా పని చేశారు.

1989లో రాజీవ్ గాంధీ హత్యానంతరం కేంద్రంలో అధికార మార్పిడి జరిగింది. 1991లో పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా, మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 1996 వరకు(4సంవత్సరాల, 10నెలల, 26రోజులు) అధికారంలో కొనసాగింది.

మళ్లీ 8ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 2004 నుంచి 2014వరకు వరుసగా పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. ఈ పదేళ్ల కాలంలో డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా పని చేశారు.

కాంగ్రెస్ పార్టీ పరోక్ష పాలన

1979జూలై నెలలో చౌధరీ చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. ఆయన పాలన కేవలం 170 రోజులు సాగింది. చరణ్ సింగ్ పాలన తర్వాత 1980లో పాలనా పగ్గాలు ఇందిరా గాంధీ చేతికి వచ్చాయి.

1990 నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సమాజ్‌వాది జనతా పార్టీ 7నెలల కాలం అధికారంలో ఉంది.

1996లో 'యునైటెడ్ ఫ్రంట్' పేరుతో 13పార్టీల సంకీర్ణ కూటమి, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అధికారంలోకి వచ్చింది.

1997 నవంబర్‌లో యునైటెడ్ ఫ్రంట్‌ నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చింది.

కానీ మధ్యంతర ఎన్నికలు వద్దంటూ, మరో యునైటెడ్ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కొత్త ప్రభుత్వంలో ఐ.కె.గుజ్రాల్ ప్రధాని అయ్యారు. ఈ కొత్త ప్రభుత్వం 10నెలల పాటు అధికారంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)