You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారతరత్న: ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాలకు భారతరత్న పురస్కారం
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీని భారతరత్న పురస్కారం వరించింది. ఆయనతో పాటు నానాజీ దేశ్‌ముఖ్ , భూపేన్ హజారికాలను మరణానంతరం భారతరత్న పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు దేశ అత్యున్నత పురస్కారాలకు వీరిని ఎంపిక చేసినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాలకు ఈ పురస్కారం మరణానంతరం లభిస్తోంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముగ్గురికీ భారత రత్న ఇస్తున్నట్టు విడివిడిగా ట్వీట్ చేశారు. వారి సేవల గురించి చెప్పారు.
మోదీ తన ట్వీట్‌లో నానాజీ దేశ్‌ముఖ్ గ్రామీణ రంగానికి చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ఆయనను అసలైన భారతరత్నంగా వర్ణించారు.
భూపేన్ హజారికా గురించి ట్వీట్ చేసిన మోదీ ఆయన భారతీయ సంప్రదాయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తీసుకొచ్చారని చెప్పారు. ప్రణబ్ ముఖర్జీని ఈ కాలపు ఉత్తమ రాజకీయ నేతగా వర్ణించారు.
నానాజీ దేశ్‌ముఖ్
మహారాష్ట్రలోని హింగోలీలో 1916 అక్టోబర్ 11న జన్మించిన నానాజీ దేశ్‌ముఖ్ తన జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనసంఘ్‌లతో ఆయన అనుబంధం కొనసాగింది.
జనతా పార్టీ 1977లో అధికారంలోకి వచ్చినప్పుడు నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కానీ, 60 ఏళ్ళ వయసు పైబడిన వారు ప్రభుత్వం వెలుపల ఉంటూ ప్రజాసేవ చేయడం ఉత్తమ మార్గమని నానాజీ చెప్పారు. ఆ ఎన్నికల్లో నానాజీ బలరాంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
నానజీ 1980లో క్రియాశీలక రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీనదయాళ్ శోధ్ సంస్థాన్ సంస్థను ప్రారంభించి తన సామాజిక సేవను కొనసాగించారు.
అటల్ బిహారీ వాజపేయీ ప్రభుత్వం 1990లో నానాజీని రాజ్యసభకు ఎంపిక చేసింది. అదే ఏడాది ఆయనకు సామాజిక సేవా రంగంలో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. నానాజీ దేశ్‌ముఖ్ 95 ఏళ్ళ వయసులో 2010 ఫిబ్రవరి 27న కన్నుమూశారు.
భూపేన్ హజారికా
గాత్ర సంగీతంతో భాషల పరిమితులను అధిగమించన సంగీతకారుడు, గాయకుడు భూపేన్ హజారికా. అంతేకాదు, అసోం సంస్కృతి, సంగీతాలపై అవగాహన కలిగిన హజారికా మంచి కవి, సినీ రూపశిల్పి కూడా.
దక్షిణాసియాలోనే అత్యుత్త సాంస్కృతిక సృజనశీలిగా గుర్తింపు పొందిన హజారికా 2011 నవంబర్ 5న తుదిశ్వాస విడిచారు.
మాతృభాష అసాంతో పాటు ఆయన హిందీ, బెంగాలీ తదితర భారతీయ భాషల్లో ఎన్నో పాటలు పాడారు. అసాం సంగీత సంప్రదాయాన్ని నలు చెరగులా చాటిన సంగీతజ్ఞుడిగానూ ఆయన పేరు తెచ్చుకున్నారు.
పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత అవార్డులతో ఎన్నో పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి. వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హజారికా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.
ప్రణబ్ ముఖర్జీ
అయిదు దశాబ్దాల సుదీర్ఘ కాలం క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ప్రణబ్ ముఖర్జీ భారతదేశ 13వ రాష్ట్రపతి అయ్యారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెండు పర్యాయాలు రాష్ట్రపతి పదవిని చేపట్టారు కాబట్టి, ప్రణబ్ ఆ పదవిని అధిష్ఠించిన 12 వ్యక్తి అని చెప్పవచ్చు.
కాంగ్రెస్ పార్టీ నేతగా ఎన్నో పదవులు చేపట్టిన ప్రణబ్ దా ఇటీవలి కాలంలో ప్రధాని మోదీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఆయన వెళ్ళడం ఎంతో చర్చనీయాంశమైంది.
ఆయన తొలిసారి 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యైారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999లలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 మే నెలలో ఆయన పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించారు.
ముఖర్జీ 1973లో తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్ళ పాటు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలలో మంత్రిగా సేవలందించారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రణబ్ 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)