తెలంగాణకు చెందిన యూపీ ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంట్లో సీబీఐ సోదాలు

ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఉత్తర ప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి బి. చంద్రళ సహా పలువురి ఇళ్లలో సీబీఐ అధికారులు శనివారం సోదాలు నిర్వహించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఉత్తర ప్రదేశ్, దిల్లీల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వివరించారని వెల్లడించింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ ఆమె సంబంధికుల ఇంటిపై దాడి చేసింది.

ఎవరీ చంద్రకళ

గిరిజన తెగకు చెందిన బుఖ్యా చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా రామగుండం. పాఠశాల విద్యను రామగుండంలోనే పూర్తి చేశారు. హైదరాబాద్‌లో డిగ్రీ చేసిన ఆమె ఉస్మానియా యూనిర్సిటీలో ఏకానమీలో పీజీ చేశారు.

2008లో సివిల్స్ పరీక్షల్లో 409వ ర్యాంకు సాధించారు. ఆమె భర్త ఎ.రాములు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

చంద్రకళ ఉత్తరప్రదేశ్‌ కేడర్ అధికారి. అక్కడ వివిధ హోదాల్లో పనిచేశారు. బిజ్నూర్, మధుర,బులంద్షార్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. కలెక్టర్‌ హోదాలో క్లీన్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు.

ప్రస్తుతం ఆమె స్వచ్ఛ భారత్ మిషన్‌కు సంబంధించి తాగునీరు, పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తారు.

గతంలో అవినీతి అధికారులను ఎదిరించి సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫేస్‌బుక్ పేజీలో 85 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.

ఆ వీడియోతో వైరల్

యూపీలోని బులంద్ షహర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడు చంద్రకళ.. అవినీతి, అక్రమార్కులకు పాల్పడే అధికారులను గట్టిగా మందలించి వైరల్‌గా మారారు.

రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలున్న అధికారులు, కాంట్రాక్టర్లను వరుసలో నిలబెట్టి ఆమె మందలించారు.

ఈ సంఘటనకు సంబంధించి వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి ఈమెకు 'నిజాయతీపరులంటూ' ఫాలోయింగ్ పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)