శబరిమల: ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు

కేరళలోని శబరిమల ఆలయంలోకి తొలిసారిగా 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు ప్రవేశించారు.

బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున 3.45 గంటలప్పుడు ఆలయంలో పూజలు చేశారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

కేరళలోని పెరింతల్మన్నా పట్టణానికి చెందిన బిందు, కన్నూరుకు చెందిన కనకదుర్గ డిసెంబర్ 24న కూడా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

కానీ, అప్పుడు పెద్దఎత్తున ఆందోళనలు జరగడంతో వారి ప్రయత్నం ఫలించలేదు.

బిందు అమ్మిని వయసు 40 ఏళ్లు. కనకదుర్గ వయసు 39 ఏళ్లు.

దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 మధ్య వయసున్న మహిళలు వెళ్లి పూజలు చేయడం ఇదే తొలిసారి.

"నిజమే, వాళ్లు ఉదయం 3.45 గంటలకు గుడిలోకి వెళ్లారు. శబరిమల దళిత్ మరియు ఆదివాసీ మండలి సభ్యులు వారికి భద్రత కల్పించారు" అని రచయిత, సామాజిక కార్యకర్త సన్నీ కప్పికాడ్ బీబీసీకి చెప్పారు.

అయితే, శబరిమలకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి మాత్రం.. ఎవరు వచ్చారు? ఎవరు వెళ్లారు? అన్నది ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.

బిందు మాత్రం, తాను ఆలయంలో అయ్యప్ప స్వామిని 3.45గంటలకు దర్శించుకున్నానని స్థానిక టీవీ చానెల్‌తో చెప్పారు. రాత్రి 1.30కి తమ ప్రయాణం ప్రారంభమైందని, 6.1 కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కి ఆలయాన్ని చేరుకున్నామని ఆమె వివరించారు.

ఆ టీవీ చానెల్‌ ప్రసారం చేసిన దృశ్యాలలో ఆ ఇద్దరు మహిళలకు భద్రతగా సాధారణ దుస్తులు ధరించిన కొందరు పురుషులు ఉన్నట్లు కనిపిస్తోంది.

కాగా మహిళల ప్రవేశం తరువాత ఆలయాన్ని శుద్ధి కోసం మూసివేశారు. గంటపాటు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచారు.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ వెళ్లవచ్చంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆలయంలో పూజలు చేసుకోవడం మహిళల హక్కు అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

అంతకుముందు పీరియడ్స్ వచ్చే వయసు(10 నుంచి 50 ఏళ్ల వయసు) వారు ఈ ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండేది.

అయితే, కోర్టు తీర్పును నిరసిస్తూ బీజేపీతో పాటు, దాని అనుబంధ సంస్థలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా చూస్తామని.. అందుకే ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని నిరసనకారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)