జంతువులతో ఆటాడుకున్న భారతీయ రింగ్ మాస్టర్

    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1927లో షాంఘాయ్‌లో జరిగిన ఒక సర్కస్‌లో భారతదేశానికి చెందిన ప్రముఖ జంతు శిక్షకుణ్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక రచయిత బోనులోకి ప్రవేశించాడు.

అప్పుడు ఆ సర్కస్ కంపెనీ వద్ద నాలుగు చిరుతలు, ఐదు పులులు ఉన్నాయి.

నిజానికి ఆ ఇంటర్వ్యూకు అది ఒక అసాధారణ సెట్టింగ్. కానీ అదే సమయంలో దామూ ధోత్రె కూడా సాధారణమైన వారేమీ కాదు.

అప్పటికి ఆయన వయసు 25 ఏళ్లే అయినా, తన అసాధారణ దైర్య సాహసాలతో ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందారు.

డేర్ డెవిల్ ప్రదర్శనకు దామూ ధోత్రె పెట్టింది పేరు.

సర్కస్ ప్రపంచంలో దామూ విశ్వవిఖ్యాతి గాంచినా, భారతదేశంలో మాత్రం ఆయన గురించి చాలా తక్కువ తెలుసు.

ఆయనపై ఎంతో పరిశోధన చేసిన ఆయన మనవడు మహేంద్ర ధోత్రె, తన తాతయ్య చరిత్ర గురించి, సాధించిన విజయాల గురించి యువతరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందంటారు.

''వలస పాలన సమయంలో కెరీర్ ప్రారంభించిన ఆయన.. గోధుమ వర్ణం వాళ్లు ఏ వృత్తిలోనైనా ఉన్నత స్థితికి చేరడం కష్టమైన సమయంలో... పేరు ప్రఖ్యాతులు సాధించారు'' అని తెలిపారు.

దామూ పూణెలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయసులో.. తన మేనమామ నిర్వహించే సర్కస్‌ను సందర్శించేవారు.

అడవి జంతువులు ఆయనకు అబ్బురం కలిగించేవి. వాటికి శిక్షణ ఇచ్చే వ్యక్తిని దామూ దగ్గర నుంచి చూసేవారు. ఆయనను అనుకరించడానికి ప్రయత్నించేవారు.

''ఒకరోజు జంతువుల బోనులోకి ప్రవేశించిన ఆయన.. కొన్ని నిమిషాలలోనే వాటిని ప్రశాంతంగా మార్చగలిగారు. అప్పుడే ఆయనలోని శక్తిని ఆ సర్కస్ వారు గుర్తించారు'' అని ధోత్రె తెలిపారు.

ఈ సంఘటనతో ఆయనకు భయమన్నది లేదని అర్థమైంది. అదే ధైర్యంతో ఆయన రింగ్ లోపల జంతువులతో డ్రామా నడిపించేవాడు.

దామూ ఆసక్తిని గమనించిన ఆయన మామయ్య, ఆయనకు శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే దామూ తల్లి మాత్రం తన కుమారుడు జంతువుల బోనులోకి వెళతాడని తెలుసుకుని భయపడిపోయారు.

అయితే సోదరుని హామీతో ఆమె శాంతించారు. అలా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జంతు శిక్షకుడు దామూ ధోత్రె జన్మించారు.

1912లో స్కూలు వదిలిపెట్టిన దామూ, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు తన మామయ్య సర్కస్ బృందంతో కలిసి పర్యటించారు. కానీ తల్లి మీద బెంగతో పూణెకు తిరిగి వచ్చారు.

అయినా ఆయన హృదయం మాత్రం సర్కస్ బృందంతోనే ఉండేది.

''ఆయన పూణెలో ఉండగా సైకిల్ మీద స్టంట్లు చేసేవారు. దీంతో ఆయనకు చాలా పేరు వచ్చింది. స్థానిక పత్రికలు ఆయనను 'వండర్ బాయ్' అని పిలిచేవి'' అని ధోత్రె తెలిపారు.

అలా స్టంట్స్ చేస్తూ దామూ, అవకాశం దొరికినప్పుడల్లా జంతువులకు శిక్షణ ఇచ్చేవారు.

రింగ్‌లో నాటకీయత..

22 వయసులో దామూ రష్యన్ సర్కస్‌లో మోటర్ సైకిల్ స్టంట్స్ రైడర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అలా ఉద్యోగం సంపాదించుకున్న ఆయన, తర్వాత రింగ్ మాస్టర్‌గా కూడా పని చేయగలనని యాజమాన్యాన్ని ఒప్పించారు. ఆ సర్కస్ కంపెనీతో కలిసి చైనాను సందర్శించినప్పుడు ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.

''చైనాలో ఆయన చేసే అసమాన ప్రదర్శనకు జనం జేజేలు కొట్టారు. ఆయన బోనులో ఒకేసారి అనేక జంతువులను ఆడించేవారు'' అని ధోత్రె తెలిపారు.

దామూ ప్రతిభ కారణంగా చైనాలో ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ల సర్కస్‌కు రావడం ప్రారంభించారు. అప్పట్లో రింగ్ మాస్టర్లు శరీరాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులు ధరించి, భద్రత కొరకు ఆయుధాలు పట్టుకునేవారు. దానికి భిన్నంగా దామూ చొక్కా లేకుండా, కేవలం పగిడీ మాత్రం ధరించేవారు.

రింగ్‌లో నాటకీయ సంఘటనలు సృష్టించడంలో దామూది అందె వేసిన చేయి. ఆయన కనిపెట్టిన ఒక ప్రదర్శనలో పులి మీద మేక సవారీ చేసేది. అలాంటి సంఘటనలు చూడడానికి జనం ఎగబడేవాళ్లు.

అయితే దామూకు చాలా పేరు వచ్చినా, రష్యన్ సర్కస్ తన స్థాయికి తగినది కాదని ఆయన భావించారు. దాంతో తనకు ఉద్యోగం కావాలంటూ యూరోపియన్ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. వాటిని చూసిన ఒక ఫ్రెంచ్ సర్కస్ యజమాని దామూ యూరప్‌కు వెళ్లాలని సలహా ఇచ్చారు.

తాను అప్పటివరకు సంపాదించినదంతా ఖర్చు పెట్టి, 1939 జనవరిలో ఫ్రాన్స్‌కు వెళ్లారు దామూ.

ఫ్రాన్స్ చేరుకున్నపుడు యూరప్‌లో ఆయనను ఎవరూ ఎరగరు. కానీ ఆయన త్వరలోనే ఫ్రాన్స్‌లో చాలా ప్రముఖ వ్యక్తిగా మారారు. మంచి ఆదాయం కూడా సంపాదించడం ప్రారంభించారు.

అయితే ఆ విజయం ఎక్కువ కాలం సాగలేదు. 1940లో రెండో ప్రపంచ యుద్ధం యూరప్‌ను ముంచెత్తడం ప్రారంభించింది. దాంతో భద్రతా కారణాల రీత్యా సర్కస్‌లను నిషేధించారు.

దీంతో దామూ యూరప్‌లో చిక్కుకుపోయారు. అవి ఆయనకు చాలా కష్టమైన రోజులు.

ఆ సమయంలో ఒక ఫ్రెంచి సర్కస్ కంపెనీ తాము అమెరికాకు వెళుతున్నామని, తమ బృందంలో చేరాలని దామూను ఆహ్వానించింది.

దీంతో ఆయన ఎంతో ఆనందించారు. ఎందుకంటే అమెరికాకు చెందిన రింగ్‌లింగ్ బ్రదర్స్ సర్కస్ అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందిన సర్కస్ సంస్థ.

అమెరికాకు చేరుకున్న వెంటనే దామూ రింగ్‌లింగ్ బ్రదర్స్ యాజమాన్యాన్ని కలిసి తనను తాను పరిచయం చేసుకున్నారు. దాంతో వాళ్లు ఆయనను తమ బృందంలోకి తీసుకోవడం, ఆయన అక్కడ కూడా పెద్ద పేరు తెచ్చుకోవడం జరిగిపోయాయి.

''అప్పటివరకు అమెరికా ప్రజలు అలాంటి అసమాన ధైర్య సాహస ప్రదర్శనలు చూసి ఎరగరు'' అని ధోత్రె తెలిపారు.

కానీ 1941 చివర్లో అమెరికా కూడా యుద్ధంలో ప్రవేశించడంతో అక్కడ కూడా సర్కస్‌లను నిషేధించారు. దాంతో దామూ అమెరికా సైనిక కార్పొరల్‌గా చేరారు. ఆ తర్వాత 1945లో యుద్ధం ముగిసాక ఆయన మళ్లీ సర్కస్‌లో చేరారు.

1949లో దామూ అనారోగ్యం కారణంగా రింగ్‌లింగ్ బ్రదర్స్ నుంచి బయటకు వచ్చి, యూరప్‌కు తిరిగి వెళ్లారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన రెండేళ్ల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు.

అప్పటికి ఆయన భార్యకు క్యాన్సర్ అని డాక్టర్లు తేల్చారు. ఆయన భారతదేశానికి వచ్చేలోపే ఆమె మరణించారు. దాంతో ఆయన సర్కస్ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించారు. చివరకు ఆస్తమా తీవ్రతరం కావడంతో ఆయన సర్కస్‌కు పూర్తిగా దూరమయ్యారు.

''అయితే ఆ తర్వాత కూడా ఆయన రింగ్ మాస్టర్లు కావాలనుకునేవారికి శిక్షణ ఇచ్చేవారు'' అని ధోత్రె తెలిపారు.

హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి..

1971లో దామూను ఇంటర్నేషనల్ సర్కస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన మరణించారు.

''దామూ గురించి భారతదేశంలో చాలా మందికి తెలీదు. ఆయన జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరని ఆయన నిరూపించారు'' అని ధోత్రె తెలిపారు.

''దేశంలో మరో దామూ ధోత్రె పుట్టబోరు. ఎందుకంటే సర్కస్ అనేది అంతరిస్తున్న కళ. ఇప్పుడు సర్కస్‌లలో జంతువులను నిషేధించారు. అందువల్ల ఆయన వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం.''

''ఇవాళ సర్కస్‌లలో జంతువులను ఉపయోగించడం చాలా కౄరం అని భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ దామూ జీవించిన కాలంలో ఎలాంటి వినోదమూ ఉండేది కాదని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన కేవలం తనకు అత్యంత ఇష్టమైన వృత్తి చేపట్టారు. ప్రజలు ఆయనను అలాగే గుర్తు పెట్టుకోవాలని నేను భావిస్తున్నాను'' అని ధోత్రె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)