దీపిక, రణవీర్ సింగ్‌ల వివాహం: 'ఆమె అలా అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి'

    • రచయిత, వికాస్ త్రివేది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'ఒక చిటికెడు సిందూరం ఖరీదు నీకేం తెలుసు రమేష్ బాబూ' అని 2007లో మొదటిసారి వెండితెర మీద అడిగిన యువతి 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే సిందూరాన్ని నుదుటన దిద్దుకోనుంది. ఆర్‌కే అన్న టాటూ చెరిగిపోయి, ఇప్పుడు దాని స్థానంలో ఆర్‌ఎస్ వచ్చింది. రణవీర్ సింగ్ ఇప్పుడు బాండ్ బజా బారాత్ తీసుకుని దీపికను తన ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

వీరిద్దరి పెళ్లి నవంబర్ 14, 15 తేదీల్లో జరగనుంది. సరిగ్గా అయిదేళ్ళ కిందట అదే తేదీన వారిద్దరూ మొదటిసారిగా రామ్‌లీల సినిమాలో కనిపించారు. పెళ్ళి సంగతి సరే, ఇంతకూ ఇద్దరి మధ్యా ప్రేమ ఎలా చిగురించింది?

వారిద్దరూ మొదటిసారి కెమెరా ముందు ఎదురుపడింది రామ్‌లీలా సినిమాలో 'లహూ ముహ్ లగ్ గయా' అన్న పాట షూటింగ్‌లో. ఆరోజు తెర ముందు రంగులు చల్లుకుని జరుపుకున్న వేడుక నిజజీవితం సంబరంగా మారుతుందని వారు ఊహించి ఉండరు.

వారు వేర్వేరు సందర్భాలలో చెప్పుకున్న ప్రేమకథ ఇది..

కథానాయిక గుండె పగిలితే..

ఎవరైనా కథానాయిక గుండె పగిలిందంటే అది వార్తాపత్రికల ఎంటర్‌టైన్‌మెంట్ పేజీ అప్‌డేట్ అవుతుంది.

దీపిక గురించి తల్చుకుంటే మొదట చాలా మంది యువతకు ఆమె బ్రేకప్ గురించి గుర్తుకు వస్తుంది. దాని నుంచి బైటపడే క్రమంలో దీపిక డిప్రెషన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, ఆమె ఎప్పుడూ తన డిప్రెషన్‌కు బ్రేకప్ కారణమని చెప్పలేదు.

ఆ సందర్భంలోనే దీపిక, రణవీర్‌లు తెర ముందు వెనుక కూడా ఒకరికొకరు దగ్గరయ్యారు. తర్వాత రణవీర్ బహిరంగంగానే డిప్రెషన్ నుంచి బైటపడిన దీపికపై ప్రశంసలు కురిపించారు.

''దీపిక తన డిప్రెషన్ గురించి ఒకసారి టీవీలో మాట్లాడుతుండగా చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దాన్నుంచి బయటపడడానికి చాలా ధైర్యం కావాలి. దీపిక జీవితాన్ని జయించింది'' అన్నారు.

దీపిక-రణవీర్‌ల మొదటి కలయిక

అది జులై 6. రణవీర్ సింగ్ జన్మదినం. ఆ రోజు అతను తన కుటుంబంతో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తున్నారు.

దీపిక కూడా అనుకోకుండా అదే రెస్టారెంట్‌కు వెళ్లారు. రణవీర్ సింగ్‌ను చూడగానే ఆమె, ''వావ్.. ముంబైకు మారిపోయావా?'' అని ప్రశ్నించారు.

'బాండ్ బాజా బారాత్'లో రణవీర్ నటన మాయలో పడి, ఆమె రణవీర్ బాంబే యువకుడనే మర్చిపోయారు.

చోరీ చోరీ చుప్ కే చుప్ కే

రణవీర్ సింగ్ దీపిక పేరు ఎత్తకుండానే చాలాసార్లు తన ప్రేమ గురించి సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, రణవీర్ సింగ్ అంకుల్ ఎవరిని ప్రేమిస్తున్నారని అడిగితే చిన్న పిల్లలు కూడా చెబుతారు.

మీడియా వార్తలపై రణవీర్ ''కొన్నిసార్లు మా ఇద్దరి గురించి వార్తలు చదివినపుడు 'ఆహా, ఓహో.. ఏం సృజనాత్మక రచన' అనిపించేది. వాటిని చదవడం బలే మజాగా ఉండేది'' అన్నారు.

రణవీర్‌ను చూడగానే తనకు కలిగిన మొదటి ఇంప్రెషన్‌పై హిందుస్తాన్ టైమ్స్ షోలో దీపిక, ''నా ఏజెంట్ రణవీర్ సింగ్‌కు పెద్ద అభిమాని. ఈ రణవీర్ సింగ్ పెద్ద స్టార్ అవుతాడు అని అంటుండేవాడు. నేను గాభరాగా, ఇతను నా టైప్ కాదు అనేదాన్ని'' అని తెలిపారు.

తమ ఇద్దరి మొదటి కలయిక గురించి గుర్తు చేసుకుంటూ రణవీర్, ''ఆ రోజు రెస్టారెంట్‌లో దీపిక నన్ను కలుసుకున్న రోజు నాకు ఏదో అలర్జీ వచ్చింది. దాంతో నేను నా మొహం దీపికకు కనిపించకుండా దాచుకుని ఆమెతో మాట్లాడాల్సి వచ్చింది'' అన్నారు.

ఆ రోజు దీపిక కనిపించినంత అందంగా మరెవ్వరూ ఉండి ఉండరని రణవీర్ అన్నపుడు దీపిక స్టేజీ మీదే సిగ్గుపడ్డారు.

లవ్.. లవేరియా హువా?

2013లో ఒక ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్, ''ప్రేమలో పడడం నాకు ఇష్టం. ప్రపంచంలో అదే అత్యంత ఉత్తమమైన విషయం. ఇప్పటివరకు ఆ అనుభవం నా ఎరుకలోకి రాలేదు'' అన్నారు.

అదే ఇంటర్వ్యూలో రణవీర్, ''దీపిక వైపు చూడండి. ఏం కనిపించే తీరు ఎంత గొప్పగా ఉంటుంది? ఆమె తెర మీదకు వచ్చిందంటే ఇక మరేదీ కనిపించదు. నా వైపు చూపులు తిప్పుకోవాలంటే నేను షర్ట్ విప్పేయాలి. నా మొత్తం ఎనర్జీని ప్రదర్శించాలి. కానీ, దీపిక కనిపిస్తే చాలు... అలా చూస్తూ ఉండిపోతాను'' అన్నారు.

ఆ ఇంటర్వ్యూలో రణవీర్ దీపికపై తన ప్రేమ గురించి చెప్పలేదు కానీ, కొంతమంది ఐదేళ్ల కిందట ఊహించింది ఇప్పుడు నిజమైంది.

పద్మావత్ వివాదంపై రణవీర్ ఆగ్రహం

పద్మావత్ సినిమా వివాదం సందర్భంగా దీపిక పదుకోనె ముక్కు కోసేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

వాటిపై రణవీర్ ఏమనుకున్నారు? దీనికి సమాధానంగా, ''వాళ్లంతా ఎవరు? వాళ్ల బెదిరింపులపై ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. వాళ్లంతా దీపిక గురించి అలా మాట్లాడి నన్ను రెచ్చగొట్టాలని చూశారు. కానీ నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీమ్ అంతా కలిసి నన్ను శాంతింపజేసారు'' అని రణవీర్ తెలిపారు.

ప్రేమంటే ఒకరిని ఒకరు పూర్తిగా అంగీకరించడం కదా మరి దీపికలో మీరు ఏం మార్చాలనుకుంటున్నారు అని ఒక ఇంటర్వ్యూలో రణవీర్‌ను అడిగినప్పుడు, తాను దీపికలో ఎలాంటి మార్పులూ కోరుకోవడం లేదని రణవీర్ తెలిపారు.

దీపిక కేవలం రణవీర్ కోసమే పాడతారా?

2015లో ఆజ్ తక్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్, ''దీపిక చాలా బాగా పాడుతుంది. కానీ, పాడడానికి చాలా సిగ్గు పడుతుంది. ఆమె పాటలు వినే అదృష్టం ఉన్న ఒకే ఒక వ్యక్తిని నేనే. కానీ మీరెంత ఎంత పొడిగినా, ఆమె మాత్రం పాడదు'' అని తెలిపారు.

అదే షోలో ఎంతో ప్రయత్నం చేస్తే కానీ దీపిక రెండు పంక్తులు పాడలేదు.

దీపిక వల్ల లేదా తన నటన వల్ల లేదా తన అలంకరణ వల్ల రణవీర్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.

రణవీర్ దుస్తులపై దీపిక, ''రణవీర్ డ్రెస్సులను చూస్తే చాలు మీరు అతను ఎప్పుడు నాతో ఉన్నాడు, ఎప్పుడు లేడు అని చెప్పేయొచ్చు'' అంటారు.

వచ్చే నెలలో రణవీర్ సింగ్ తెర మీదే కాదు, నిజ జీవితంలో కూడా ఆమె జీవిత భాగస్వామి కానున్నాడు. అప్పుడు వాళ్లిద్దరూ కనిపిస్తే 'లవేరియా హువా' అన్న పాట వినిపించొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)