You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇది బీజేపీ-ఆర్ఎస్‌ఎస్, మోదీ-షాలకు గుణపాఠం: రాహుల్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు బీజేపీ నేత యడ్యూరప్ప ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.
మణిపూర్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని బీజేపీ అగౌరవపరిచిందని, అందుకే ఆ పార్టీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలకు, దేవెగౌడకు ధన్యవాదాలు చెబుతున్నట్టు రాహుల్ తెలిపారు.
బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు పాఠం నేర్చుకోవాలి
"విధానసభలో జాతీయ గీతాలాపనకు ముందే బీజేపీ సభ్యులు లేచి వెళ్లిపోయారు. అది మీరంతా గమనించారు. వాళ్లు పార్లమెంటు సహా, దేనినీ లెక్క చేయరు. వ్యవస్థలను అగౌరవపరుస్తారు.
మీరు దేశంలో ప్రతి వ్యవస్థనూ దెబ్బతీయలేరు. అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు ఏదంటే అది చేయలేరు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు, మోదీ, అమిత్‌షాలు దేశంలో ప్రతి వ్యవస్థనూ దెబ్బతీస్తున్నారు.
మీ డబ్బుకంటే, మీ అధికారం కంటే దేశంలో ఉన్న వ్యవస్థలు బలమైనవి. మణిపూర్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని బీజేపీ అగౌరవపరింది.
ప్రజాస్వామ్యంపై దాడిని కర్ణాటకలో అడ్డుకున్నాం. రాష్ట్ర ప్రజలకు... పార్టీ సభ్యులకు, నాయకులకు, దేవెగౌడకు నా అభినందనలు.
మేము కర్ణాటక ప్రజల గొంతుకను కాపాడాం. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ పోరాడతాం.
వ్యవస్థలను నిర్వీర్యం చేయకుండా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను అడ్డుకునేందుకు పోరాడతాం.
బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు పాఠం నేర్చుకోవాలి. ఇకనైనా వ్యవస్థలను గౌరవించాలి.
కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులను కొనడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. ఫోన్ సంభాషణలు అన్నీ దిల్లీ (ప్రధాని మోదీ) కనుసన్నల్లోనే జరిగాయి.
అవినీతి గురించి ఆయన మాట్లాడతారు. కానీ వాళ్లే దాన్ని పెంచుతున్నారు. మోదీనే ఒకరకంగా అవినీతి పరుడు.
ప్రధాని మోదీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు దేశం, ప్రజాస్వామ్యం, దేశ ప్రజల కంటే పెద్దవాళ్లేమీ కాదు.
ఇప్పుడు బీజేపీని ఓడించాం. ఇదే తీరును ఇక ముందు కూడా కొనసాగిస్తాం" అని రాహుల్ అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: ప్రకాశ్ జావడేకర్
అయితే, కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఓడించిందని రాహుల్ గాంధీ అనడం హాస్యాస్పదమని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు.
కాంగ్రెస్‌కి వ్యవస్థలంటే గౌరవం లేదని.. అందుకు కర్ణాటక గవర్నర్ మీద ఆ పార్టీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)