You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైలు టాయిలెట్లో టీ క్యాన్ల వీడియో వైరల్: కాంట్రాక్టరుకు లక్ష జరిమానా
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మామూలుగానే రైళ్లలో ఉండే మరుగుదొడ్లకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తుంది... అలాంటిది ఓ టాయిలెట్లోంచి కొందరు వరుసగా అనేక టీ క్యాన్లు బయటకు తెస్తున్నారు..
టాయిలెట్లోకి టీ క్యాన్లు ఎందుకు తీసుకెళ్లారో ఎవరికీ తెలియదు. కానీ ఈ దృశ్యాలున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ వేదికగా దానిపై పెద్ద దుమారమే రేగింది. రైళ్లలో మనం తాగే పానీయాలు ఎంతవరకు సురక్షితం అన్న చర్చ మరోసారి మొదలైంది.
ఈ వీడియో వైరల్ అయ్యాక దక్షిణ మధ్య రైల్వే విచారణ చేపట్టింది. విచారణ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.
చెన్నై-హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో 2017 డిసెంబర్‌లో సికింద్రాబాద్ స్టేషన్లో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు నిర్ధరించారు.
వీడియోలో ఉన్న వ్యక్తులందరినీ గుర్తించారు. వారిలో ఒకరు కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగి కాగా, మిగిలిన ఇద్దరూ అనధికారిక వెండర్లు.
ఆ ఉద్యోగి పనిచేస్తున్న కాంట్రాక్టర్ శివప్రసాద్‌కు ఐఆర్‌సీటీసీ లక్ష రూపాయల జరిమానా విధించింది. మిగిలిన ఇద్దరు అనధికారిక అమ్మకందార్లతో సహా, సికింద్రాబాద్ స్టేషన్లో అనధికారికంగా ఉన్న వెండర్లందరినీ తొలగించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
"అక్కడ జరిగింది ఏమైనా కావచ్చు. కానీ టాయిలెట్ నుంచి టీ క్యాన్లు తీసుకురావడం మాత్రం చాలా పెద్ద తప్పు. అందుకే దీనిపై కఠిన చర్యలు తీసుకున్నాం. మేం లక్ష జరిమానాతో సరిపెట్టలేదు. అతని లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఇప్పటికే ఐఆర్‌సీటీసీ ఆ కాంట్రాక్టర్‌కి షోకాజ్ ఇచ్చింది. ఆ వివరణపై ఆధారపడి అవసరమైతే, అతని లైసెన్సు కూడా రద్దు చేస్తాం’’ అని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఉమామహేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
‘‘ఎక్కడో ఎవరో ఏదో చేశారని మొత్తం రైల్వేల్లో దొరికే పదార్థాలన్నీ ఇలానే ఉంటాయనడం సరికాదు. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడమే మా ఉద్దేశం’’ అని పేర్కొన్నారు.
గతంలో రైళ్లలో చాలా మంది చిరు వ్యాపారులు టీ అమ్మేవారు. వారిలో కొందరికి లైసెన్సులు ఉండేవి. ఇంకొందరికి ఉండేవి కావు. చాలా మంది అనధికారికంగా అమ్మేవారు.
కానీ ఇప్పుడు రైళ్లలో ఆహారాలు అమ్మే హక్కును కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నారు.
వాళ్లు స్టేషన్లలో వస్తువులు అమ్మకూడదు. కేవలం రైళ్లలోనే అమ్మాలి. అలాగే స్టేషన్‌లో స్టాల్స్ ఉన్నవారు రైళ్లలో అమ్మకూడదు. ఇదంతా ఐఆర్‌సీటీసీ పర్యవేక్షిస్తుంది. దీంతో పదార్థాలు అమ్మేవారిపై, వాటి నాణ్యతపై రైల్వేలకు కొంత పట్టు వస్తుంది.
ఈ కేసులో కూడా దక్షిణ మధ్య రైల్వే విచారణ జరిపించగా, చర్యలు ఐఆర్‌సీటీసీ తీసుకుంది.
అయితే, టీ క్యాన్లలో నీరు నింపడం కోసమే వాటిని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లారా, నీరు నింపడానికి కాకపోతే మరెందుకు తీసుకెళ్లారు... అన్న విషయంపై అధికారులలో స్పష్టత లేదు.
బీబీసీతో మాట్లాడిన ఓ ఉన్నతాధికారి రైల్వే టాయిలెట్లలో వచ్చే నీటిని క్యాన్లలో పట్టే అవకాశం చాలా తక్కువని అన్నారు.
"మగ్‌లలో పట్టడమే కష్టం. పైగా అది చల్లని నీరు. టీ క్యాన్లలో ఆ నీరు కలిపితే అతను ఎలా అమ్ముతాడు? కాబట్టి ఆ వీడియో చూసిన వెంటనే టీలో టాయిలెట్ నీరు కలిపేశారు అనడంలో లాజిక్ లేదు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు.
"ఈ కేసు విచారణ సందర్భంలో కూడా ట్రైన్ సైడ్ వెండర్ తమ దగ్గర మిగిలిన పాలను స్టేషన్లలో అమ్ముకోవడానికి అనుమతి లేదు కాబట్టి, ఆ పాలను స్టేషన్ వెండర్‌కి ఇచ్చినట్టు చెప్పాడు. అది నిజమో కాదో తెలీదు. కానీ అతడు ఏం చేసినా, చేయకపోయినా, క్యాన్‌ని టాయిలెట్లోకి తీసుకెళ్ళడమే పెద్ద తప్పు. అందుకే రైల్వే అంత సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఇంకా సీరియస్ యాక్షన్ కూడా ఉండబోతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.