You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సల్మాన్ ఖాన్‌కు బెయిలు, జైలు నుంచి విడుదల
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ న్యాయస్థానం శనివారం మధ్యాహ్నం బెయిలు మంజూరు చేసింది.
దాంతో సాయంత్రం జోధ్‌పూర్ జైలు నుంచి సల్మాన్ విడుదలయ్యారు.
ఇరవై ఏళ్ల క్రితం కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఆయన రెండు రాత్రులు గడిపారు.
బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జోధ్‌పూర్ న్యాయస్థానంలో విచారణ జరిగింది.
న్యాయమూర్తి రవీంద్ర కుమార్ ఈ విచారణకు సంబంధించిన తీర్పును శనివారం మధ్యాహ్నం వెలువరించారు.
రూ. 50 వేల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేశారు.
అసలేం జరిగింది?
1998 సెప్టెంబర్ 26న 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపాన కంకనీ అనే గ్రామం వద్ద కృష్ణ జింకల వేటకు సంబంధించి 'భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం' కింద సల్మాన్‌పై కేసు నమోదైంది.
బిష్నోయి సముదాయానికి చెందిన కొందరు పెట్టిన కేసులో సల్మాన్ తొలిసారిగా 1998 అక్టోబర్‌లో అరెస్టయ్యారు. అయితే, అప్పుడు వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది.
తర్వాత ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగింది.
2018 ఏప్రిల్ 5న జోధ్‌పూర్ కోర్టు తీర్పు చెప్పింది. సల్మాన్‌ను దోషిగా ప్రకటించింది. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది.
సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు.
1998 సెప్టెంబర్ 26వ తేదీన కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు రాగా.. అక్టోబర్ 2వ తేదీన బిష్నోయి సముదాయానికి చెందిన కొందరు సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు.
కేసు నమోదైన పది రోజుల తర్వాత సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఎనిమిది రోజుల పాటు జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో గడిపారు.
తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. తర్వాత ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగుతూ వచ్చింది.
తాను నిర్దోషినని సల్మాన్ వాదించారు.
ఆయన వాదనల్ని తిప్పికొట్టేందుకు పోలీసులు 28 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)